Magazines

అబద్ధాల్లో రేవంత్‌‌కు ఆస్కార్‌

2 గంటల క్రితం

Oscar
avatar
balaji

ప్రచురించబడింది నవం 01, 2026 | 3 నిమిషాల చదవడం

మంచిరేవులలో రూ.2 వేల కోట్ల కుంభకోణం

మియాపూర్‌ భూమిని అమ్మాలంటూ కలెక్టర్‌‌పై ఒత్తిడి

హెచ్‌‌సీయూకు చెందిన 400 ఎకరాలు తాకట్టు

రూ.10 వేల కోట్ల అప్పు కోసం బ్రోకర్‌‌కు రూ.400 కోట్ల కమీషన్‌

దమ్ముంటే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి

సీఎం రేవంత్‌‌రెడ్డికి హరీశ్‌‌రావు సవాల్‌


నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో
అబద్ధాలు చెప్పడంలో ఆస్కార్‌ అవార్డు ఉంటే అది సీఎం రేవంత్‌‌రెడ్డికే వస్తుందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు అన్నారు. వంటంతా మేము వండితే, చివర్లో గంట తిప్పి ఆయనే వండినా అంటున్నారని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ఓట్ చోరీ కాదనీ, పక్కా క్రెడిట్ చోరీ అని విమర్శించారు. తీర్పు ప్రతి చేతికి రాకముందే మియాపూర్ భూములను అమ్మాలంటూ కలెక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఆ భూములపై ఎవరి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నావ్‌ రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. మంచిరేవుల గ్రేహౌండ్స్ భూమి కేసు 2010లో కాంగ్రెస్ హయాంలో ఓడిపోయిందని గుర్తు చేశారు. నాడు ఏజీని కోర్టుకు పంపకుండా జీపీని పంపి ప్రయివేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు తెచ్చారని ‌తెలిపారు. 2017 మే 19న కేసీఆర్ ఆదేశాలతో దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను నియమిం చామని వివరించారు.

2021 డిసెంబర్ 31న హైకోర్టు డివిజన్ బెంచ్‌లో బీఆర్ఎస్ విజయం సాధించిందని చెప్పారు. 2023 ఆగస్టు 1న సుప్రీం కోర్టు 142 ఎకరాలు ప్రభుత్వానివేనని తుది తీర్పు ఇచ్చిందనీ, అప్పుడు బీఆర్‌ఎస్‌‌ ప్రభుత్వమే ఉందని గుర్తు చేశారు. 10 ఎకరాల 10 గుంటల భూమిని ప్రయివేట్ వ్యక్తులకు వదిలేశారని ఆరోపించారు. ఎకరం రూ.వంద కోట్లు పలికే చోట రూ.వెయ్యి కోట్ల ప్రభుత్వ ఆస్తి కొల్లగొట్టారని అన్నారు. భూభారతిలో ఈ రోజుకూ ఆ భూమి గ్రేహౌండ్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ పేరు మీదే ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి కనుసన్నల్లో కాకపోతే గ్రేహౌండ్స్ గోడ కూల్చే దమ్ము ఎవరికుంటుందని ప్రశ్నించారు. మంచిరేవులలో మొత్తంగా రూ.రెండు వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

గోల్డ్‌‌స్టోన్‌ ‌ప్రసాద్‌‌ సోదరుడిని జైలుకు 
పంపింది బీఆర్‌ఎస్సే

గోల్డ్‌స్టోన్ ప్రసాద్ సోదరుడిని జైలుకు పంపింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీశ్‌‌రావు అన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను అదే రోజు కేసీఆర్ సస్పెండ్ చేశారని చెప్పారు. 2016 జూన్ 1న 45 జీవోతో జాగీర్ అబాలిషన్ యాక్ట్‌కు చట్ట బద్ధత కల్పించామన్నారు. మియాపూర్ భూముల కేసు సుప్రీంకోర్టులో 192 సార్లు విచారణకు వస్తే 86 సార్లు బీఆర్ఎస్ నియమించిన వైద్యనాథన్ వాదించారని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక 11 విచార ణలు మాత్రమే జరిగాయని చెప్పారు. మియాపూర్ తీర్పునకు పునాది 2023లో తాము గెలిచిన ట్రినిటీ తీర్పులోని పేరా 93 అని వివరించారు. భూపాలపల్లి అటవీ భూముల కేసును టీడీపీ, కాంగ్రెస్ 20 ఏండ్లు పట్టించుకోలేవన్నారు. 2021లో అక్రమార్కులను అరెస్టు చేసి జైలుకు పంపింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. భూమి కట్టబెట్టే ఉద్దేశమే ఉంటే వాళ్లను ఎందుకు అరెస్టు చేస్తామన్నారు.

టీడీపీ ముఠాలో రేవంత్‌‌రెడ్డి భాగం కాదా?

ఎస్‌ఎల్‌‌పీ 6937/2021 దాఖలు చేసి మూడేండ్లు బీఆర్ఎస్ పోరాడిందని హరీశ్‌‌రావు చెప్పారు. ఐఎంజీ బిల్లీరావుకు ఎకరం రూ.50 వేల చొప్పున 850 ఎకరాలు కట్టబెట్టింది చంద్రబాబేనని అన్నారు. నాడు టీడీపీ ముఠాలో రేవంత్ రెడ్డి భాగస్వామి కాదా?అని ప్రశ్నించారు. ఐఎంజీ కేసులో తొమ్మిదేండ్లు పోరాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని , 2024 మార్చి 7న తీర్పు వచ్చిందని గుర్తు చేశారు.కంచె గచ్చిబౌలిలో చెట్లు నరికి జింకలను ఆగం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని ఆయన చెప్పారు. 400 ఎకరాల హెచ్‌‌సీయూ భూమిని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో తాకట్టుపెట్టారని విమర్శించారు. రూ.10 వేల కోట్ల అప్పు కోసం ముంబయి బ్రోకర్‌కు రూ.400 కోట్ల కమీషన్ ఇచ్చారని అన్నారు. దమ్ముంటే ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌‌రావు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, ఎమ్మెల్యే కెపి వివేకానంద, బీఆర్‌ఎస్‌ ‌నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్