Magazines

‘స్కిల్‌’ సరే... కొలువులేవి?

1 గంట క్రితం

Skills
avatar
balaji

ప్రచురించబడింది నవం 01, 2026 | 4 నిమిషాల చదవడం

లక్షలాది యువతకు నైపుణ్య శిక్షణ
దానికి తగ్గట్టు ఉద్యోగాల్లేవ్‌!


ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి
రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి రంగంలో ప్రభుత్వం భారీ విస్తరణ చేపట్టింది. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని చెబుతోంది. ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి స్కిల్స్‌ నేర్పిస్తున్నారు. అలాగే పరిశ్రమల అవసరాలకోసం ప్రత్యేక నైపుణ్య శిక్షణ పేరుతో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న గణాంకాలను చూస్తే శిక్షణా వ్యవస్థ వేగంగా విస్తరిస్తుంది. కానీ అదే సమయంలో ఉద్యోగ మార్కెట్‌లో దీనికి అనుగుణంగా ఖాళీలు ఉన్నాయా అంటే...ప్రశ్నార్థకమే (?) కనిపిస్తుంది.

సెక్యూరిటీ గార్డులు, 
మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లే...

ఉద్యోగార్ధుల కోసం జాబ్‌మేళాలు ప్రభుత్వం నిర్వహిస్తున్నవి కావడంతో నిరుద్యోగ యువత పెద్దసంఖ్యలో పాల్గొం ది. అయితే అక్కడి ఉద్యోగాలు చూసి బిక్కమొఖాలు వేయడం నిరుద్యోగులవం తైంది. ప్రయివే టు సెక్యూరిటీ గార్డులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, బ్యాంకుల కలెక్షన్‌ ఏజెంట్లు, ఎగ్జిక్యూటివ్స్‌, టెలీ మార్కెటింగ్‌ ఆపరేట ర్లు, ఇన్సూరెన్స్‌ ఏజెంట్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, స్విగ్గి, జొమాటో, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్‌, ర్యాపిడో, ఊబర్‌, ఓలా డ్రైవర్లు వంటి ఉద్యోగాలే ఇక్కడ ఉండటం నిరుద్యోగుల్ని నిరుత్సాహ పరిచింది. ఆ ఉద్యోగాలు కూడా నేరుగా కంపెనీలు రిక్రూట్‌ చేసుకొనేవి కావు. ఏజెన్సీల ద్వారానే రిక్రూట్‌మెంట్‌ చేపడుతున్నారు. అతి తక్కువ వేతనాలు, హెచ్చు పనిగంటలు, టార్గెట్లు సర్వసాధార ణం. ఇలాంటి ఉద్యోగాలపట్ల యువత ఆసక్తి చూపట్లేదు. చదివిన చదువుకు, జాబ్‌మేళాల్లో చేస్తున్న రిక్రూట్‌మెంట్లకు సంబంధమే లేదు.

చదువుకున్న నిరుద్యోగులు

దేశంలోని యువతరం, చదువుకున్న వారిలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు 55.5 శాతం ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా కేంద్రం నిర్వహించిన పీరియాడిక్‌ లేబర్‌ఫో ర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌)లో ఈ విషయాలు వెల్లడించింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అధికారిక పీఎల్‌ఎఫ్‌ఎస్‌ ఆధారిత గణాంకాల ప్రకారం 2023-24లో తెలంగాణలో 15-29 ఏండ్ల వయస్సు గల, సెకండరీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన యువతలో నిరుద్యోగిత రేటు 15.4 శాతం ఉన్నదని పేర్కొన్నారు. 2025-26లో ఈ శాతం మరింత పెరిగినట్టు అంచనా.

కూడు పెట్టని ‘స్కిల్‌’

విద్యార్థులు, యువతరానికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం మంచిదే. కానీ ఆ శిక్షణ పూర్తయ్యాక వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంలోనే అసలు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఏటా కొత్తగా శిక్షణ పూర్తి చేస్తున్న ప్రతి బ్యాచ్‌కు అదనపు ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుంది. నైపుణ్యం పెంచగానే సరిపోదు. దానికి సరిపడా ఉద్యోగం కూడా ఉండాలి. గత విద్యాసంవత్సరం (2025)లో ఏటీసీ/ఐటీఐల్లో 40,218 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. వీరిలో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ)ల్లో 10,921 మంది, ప్రభుత్వ ఐటీఐల్లో 7,935 మంది, ప్రయివేటు ఐటీఐల్లో 21,362 మంది...మొత్తంగా 40,218 మందికి అడ్మిషన్లు ఇచ్చారు. ఇవి కేవలం ఒక సంవత్సరం ప్రవేశాల సంఖ్య మాత్రమే. ఈ విద్యార్థులు కోర్సుల వ్యవధిని బట్టి కొందరు 2026లో, మరికొందరు 2027లో ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తారు. అంటే ఇప్పటికే ఉద్యోగాల కోసం ఉన్న యువతతో పాటు కేవలం 2025 ఏటీసీ/ఐటీఐ బ్యాచ్‌ నుంచే 40 వేల మందికిపైగా కొత్త సాంకేతిక ఉద్యోగార్థులు రాబోయే కాలంలో మార్కెట్‌లోకి వస్తారని గణాంకాలు చెప్తున్నాయి.

లెక్కలేవీ?

నైపుణ్య శిక్షణా కేంద్రాల్లో ప్రవేశాల సంఖ్యకు, ఉపాధి ఫలితానికి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడుతున్నది. ప్రస్తుతం 65 ఏటీసీలు ఏర్పాటు చేశారు. మరో 54 కేంద్రాలను అప్‌గ్రేడ్‌ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ శిక్షణా కేంద్రాల సంఖ్య పెరిగిన వేగంతో పరిశ్రమల్లో కొత్త ఉద్యోగాలు పెరుగుతున్నాయా అనే ప్రశ్నకు ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం వద్ద నిరుద్యోగుల లెక్కలు అధికారికంగా లేవు. టాస్క్‌ ప్రతిపాదన ప్రకారం 2024-25 నుంచి 2026-27 వరకు సంవత్సరాల వారీగా శిక్షణ పూర్తి చేసిన వారు, ప్లేస్‌మెంట్‌ పొందిన వారు, వాస్తవంగా ఉద్యోగంలో చేరిన వారి లెక్కలన్నీ ఎందుకు ఒకే చోట అందుబాటులో లేవనే ప్రశ్నలకు సమాధానాలు లేవు.

లక్ష్యంలోనే డొల్లతనం

రాష్ట్ర ప్రభుత్వం 2030 నాటికి 75 శాతం స్కిల్డ్‌ డిగ్రీ గ్రాడ్యుయేట్స్‌ లక్ష్యంగా, 55 నుంచి 60 శాతం ప్లేస్‌మెంట్‌ టార్గెట్‌ను నిర్దేశించింది. అంటే వందశాతం ప్లేస్‌మెంట్‌ ఇవ్వలేమని ప్రభుత్వమే ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. 2030 నాటికి నైపుణ్య శిక్షణ తీసుకునే విద్యార్థుల సంఖ్య 10.5 లక్షలకు చేరువ అవుతుందని 'టాస్క్‌' అంచనా వేసింది. కానీ ప్రభుత్వం 36,596 ప్లేస్‌మెంట్స్‌ మాత్రమే కల్పిస్తామని చెప్పడం సర్కారు డొల్లతనాన్ని ఎత్తిచూపుతుంది.

ఆధారాలేవీ?

రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 9 ఏండ్లలో 14 ప్రాధాన్య రంగాల్లో 22.5 లక్షల ఉద్యోగాలు సృష్టించామని పేర్కొంది. కానీ కొత్త నైపుణ్య విధానం మాత్రం ఇంకా 55-60 శాతం ప్లేస్‌మెంట్‌ లక్ష్యాన్ని చూపుతోంది. 22.5 లక్షల ఉద్యోగాలు సృష్టించబడిన రాష్ట్రంలో, చదువుకున్న యువతలో నిరుద్యోగిత ఇంకా 15.4 శాతం ఎందుకు ఉందనే ప్రశ్నలకు ఆధారాలు లేవు.


డేటా ఎందుకు స్థిరీకరించరు?

ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ప్రకటించిన ఉద్యోగాలు, వాస్తవంగా భర్తీ అయిన వేర్వేరు ఉద్యోగాలు, వాటిని సృష్టించిన కాలం, ప్రస్తుత ఉద్యోగార్థుల పరిస్థితి, వారిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు, పర్మినెంట్‌ ఉద్యోగాలు, తాత్కాలిక ఉద్యోగాలు, యువత చదివిన రంగాలకు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు మధ్య వ్యత్యాసం వంటి అంశాలతో ప్రభుత్వం స్పష్టమైన రికార్డును ఎందుకు తయారు చేయదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.


ఒకే గొడుగు కిందకి..

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్‌లను ఒకే మానవ వనరుల నైపుణ్య వ్యవస్థలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అయితే వీటన్నింటి డాటాను అధికారికంగా రికార్డు చేయడంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నదనే విమర్శలు ఉన్నాయి.


2.62 లక్షల రిజిస్ట్రేషన్లు

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్సేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ (డీఈఈటీ)ని ఏర్పాటు చేసింది. దీనిలో దాదాపు 1,58,393 మంది రిజిస్ట్రేషన్లు చేసుకోగా 4,323 ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటించారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌)లో 1.03 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే, దాదాపు 8 వేల ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటి భర్తీ కోసం జిల్లాల వారీగా జాబ్‌మేళాలు నిర్వహించారు.


గంపగుత్తానే..

జాబ్‌మేళాల ద్వారా రిక్రూట్‌ అయిన ఉద్యోగార్ధుల డేటా కూడా ప్రభుత్వం దగ్గర లేకపోవడం గమనార్హం. గంపగుత్తాగా ఆ రోజుకు ఇన్ని వందల మందికి ఉద్యోగాలు కల్పించాం అని ఓ ప్రకటన విడుదల చేయడమే తప్ప, ఆ ఉద్యోగాల్లో వాళ్లు నిలదొక్కుకున్నారా? ఎంతమంది మధ్యలోనే మానేసి వెళ్లిపోతున్నారు? ఏ వేతనాలకు వారు పని చేస్తున్నారు? అనే లెక్కలేవీ ప్రభుత్వం దగ్గర లేవు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్