ఎఫ్‌ఆర్‌ఎస్‌లో 100 శాతం హాజరు నమోదు చేయాలి
సామగ్రి పంపిణీలో జాప్యం వద్దు
అదనంగా ఉన్న సామగ్రిని అవసరమున్న గురుకులాలకు సర్దుబాటు చేయాలి
వెంటనే పెండింగ్ యూనిఫాంలు, ఇతర సామగ్రి పంపిణీ పూర్తి చేయాలి : ఎస్సీ గురుకులాల కార్యదర్శి రవి గుగులోతు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గురుకుల విద్యార్థుల హాజరును ప్రతిరోజూ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)లో 100 శాతం నమోదు చేయాలని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి రవి గుగులోతు ఆదేశించారు. హాజరు నమోదులో ఎలాంటి జాప్యం ఉండరాదని, వైద్యపరమైన కారణాలతో గైర్హాజరయ్యే విద్యార్థులకు నిబంధనల మేరకు మినహాయింపు ఇవ్వాలని సూచించారు. ఆదివారం జోనల్ అధికారులు, జిల్లా సమన్వయకర్తలు, ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన జూమ్ సమావేశంలో యూనిఫాంలు, విద్యార్థుల సామగ్రి సరఫరా–పంపిణీ, ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు, ప్రొవిజన్ల ఇండెంట్ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు.
ఎస్ఈఆర్‌పీ ద్వారా సుమారు 1.44 లక్షల మంది విద్యార్థులకు రెండో జత యూనిఫాంలు కుట్టించి అందించినట్టు అధికారులు తెలిపారు. అయితే గురుకులాల నుంచి నమోదైన పంపిణీ వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించిన కార్యదర్శి, జెడ్ ఓ లు, డీసీవోలు, డీఆర్‌డీవోలు, అదనపు డీఆర్‌డీవోలతో సమన్వయం చేసుకుని అందుబాటులో ఉన్న యూనిఫాంలను సేకరించి విద్యార్థులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. సోమవారం (నేడు) లోగా పెండింగ్ పంపిణీని పూర్తి చేసి, పంపిణీ శాతాన్ని గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాల వారీగా యూనిఫాం వస్త్రం కొరతను గుర్తించి అవసరమైన పరిమాణానికి ఇండెంట్ సమర్పించాలని ఆదేశించారు. రెండో జత యూనిఫాంలకు అవసరమైన తెల్లటి వస్త్రం లభ్యతను పరిశీలించి, కొరత ఉంటే పీఎంయూకు వెంటనే తెలియజేయాలని సూచించారు. వస్త్రం కొరత కారణంగా కుట్టు ప్రక్రియలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. టైలు, బెల్టులు, ఐడీ కార్డులు తదితర సామగ్రి 100 శాతం సరఫరా చేసినట్లు లిడ్క్యాప్ అధికారులు తెలిపిన నేపథ్యంలో, జెడ్ ఓ లు, డీసీవోలు సంబంధిత ఎంఈవోలు, అధికారులతో సమన్వయం చేసుకుని సరఫరా, పంపిణీ స్థితిని తనిఖీ చేయాలని కార్యదర్శి ఆదేశించారు.
ఒక గురుకులంలో అవసరానికి మించి బ్యాగులు లేదా ఇతర సామగ్రి ఉంటే, కొరత ఉన్న ఇతర గురుకులాలకు వాటిని సర్దుబాటు చేయాలని సూచించారు. సరఫరాదారు కారణంగా అదనపు రవాణా ఖర్చులు ఏర్పడితే, వాటిని సంబంధిత సరఫరాదారు బిల్లుల నుంచి మినహాయించాలని ఆదేశించారు. నల్ల సాక్స్, తెల్ల సాక్స్, ట్రంక్ బాక్సులు గోడౌన్‌లో అందుబాటులో ఉన్నట్టు సరఫరాదారు తెలిపిన నేపథ్యంలో, సంబంధిత అధికారులు స్టాక్‌ను తనిఖీ చేసి అవసరమైన సామగ్రిని వెంటనే గురుకులాలకు పంపాలని సూచించారు. సరఫరాలో సహకారం లేకపోతే విషయాన్ని తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
గురుకులాల్లో విద్యార్థుల వాస్తవ హాజరు, అడ్మిషన్ల సంఖ్యకు అనుగుణంగా సామగ్రి వినియోగాన్ని సమీక్షించాలని రవి సూచించారు. విద్యార్థుల హాజరు తక్కువగా ఉన్న సంస్థల్లో ఇండెంట్ ప్రకారం అదనంగా మిగిలే సామగ్రిని గుర్తించి, అవసరమున్న ఇతర సంస్థలకు సర్దుబాటు చేయాలని జోనల్ అధికారులను ఆదేశించారు.
ఏ గురుకులంలోనూ అవసరానికి మించి సామగ్రి నిల్వ ఉండకుండా, కొరత ఉన్న సంస్థలకు సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల సామగ్రికి సంబంధించిన ఇండెంట్, సరఫరా, స్వీకరణ, పంపిణీ వివరాలను కొత్త యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అందిన అన్ని రకాల సామగ్రి వివరాలను కూడా యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఎక్సెల్ ద్వారా వివరాలు పంపడం వల్ల సమయం ఎక్కువగా పడటంతో పాటు జాప్యం, పొరపాట్లకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కొత్త యాప్ ద్వారా సమాచారం వేగంగా, కచ్చితంగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. యాప్‌లో ఉన్న సాంకేతిక సమస్యలను సోమవారం (నేడు) పరిష్కరించాలని ఆదేశించారు.
2027–28 విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యార్థుల సామగ్రి ఇండెంట్‌ను వాస్తవ విద్యార్థుల సంఖ్య, సంస్థల అవసరాల ఆధారంగా సిద్ధం చేసి సోమవారం (నేడు)లోగా సమర్పించాలని కార్యదర్శి ఆదేశించారు. ప్రతి సంస్థ తన అవసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఇండెంట్ పంపాలని సూచించారు. గురుకులాల నెలవారీ ప్రొవిజన్ల ఇండెంట్‌ను ప్రతి నెల 5వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించారు. ఇకపై స్థానికంగా ప్రొవిజన్లు తీసుకోకుండా, నిర్దేశిత విధానం ప్రకారం మాత్రమే సరఫరాలు చేపట్టాలని స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)