Magazines

ఇంటర్‌ జూనియర్‌ లెక్చరర్లపై వివక్ష ఎందుకు?

1 గంట క్రితం

education
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 2 నిమిషాల చదవడం

ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి చూస్తున్న శాఖలోనే అధ్యాపకులకు తిప్పలు

నవతెలంగాణ-సిటీబ్యూరో

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న 2023 బ్యాచ్‌ అధ్యాపకుల పట్ల విద్యాశాఖ అధికారులు తీవ్ర వివక్ష చూపిస్తున్నారు. విధుల్లో చేరి నాలుగో ఇంక్రిమెంట్‌ తీసుకునే గడువు సమీపిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు రెండో ఇంక్రిమెంట్‌ను విడుదల చేయకపోవడం శోచనీయం. ఇతర శాఖల ఉద్యోగులకు వర్తింపజేసిన విధంగానే జూనియర్ లెక్చరర్లకు సైతం వెంటనే ఇంక్రిమెంట్లు మంజూరు చేసి, ప్రొబేషన్‌ పీరియడ్‌ను డిక్లేర్‌ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంక్రిమెంట్లు ఆపకుండా ఇవ్వాలని కోర్టు తీర్పు ఉన్నా అమలు చేయకుండా అధికారులు నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి చూస్తున్న శాఖలోనే అధ్యాపకులకు ఇలాంటి ఇబ్బందులు రావడం గమనార్హం. టీచర్లు, అధ్యాపకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతి సమస్యను పరిష్కారం చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి చెబుతూ వస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3100 మంది జూనియర్‌ ‌లెక్చరర్లతో పాటే రెగ్యులర్‌ అయిన పాలిటెక్నిక్‌ అధ్యాపకులకు, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడో ప్రొబేషన్‌ పీరియడ్‌ను ఖరారు చేసింది. అంతేకాకుండా 2024 డీఎస్సీ ద్వారా విధుల్లో చేరిన స్కూల్ టీచర్లకు కూడా ప్రభుత్వం తాజాగా రెండో ఇంక్రిమెంట్‌ విడుదల చేసింది. మిగతా శాఖల ఉద్యోగులెవరికీ లేని సాంకేతిక ఇబ్బందులు, నిబంధనల కొర్రీలు కేవలం ఇంటర్మీడియట్ విద్యలో పనిచేస్తున్న అధ్యాపకులకే ఎందుకు ఎదురవుతున్నాయనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. కావాలనే విద్యాశాఖలోని కొందరు అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డికి సమస్యను తీసుకెళ్లకుండా చేస్తున్నారని తెలిసింది.

కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోండి

గౌరవ న్యాయస్థానం వెలువరించిన తీర్పును ఇంటర్మీడియట్ కమిషనరేట్ అధికారులు తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని జేఎల్‌‌లు కోరుతున్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా 2023 బ్యాచ్‌ అధ్యాపకుల ఇంక్రిమెంట్లు, ప్రొబేషన్ డిక్లరేషన్‌పై ఎలాంటి జాప్యమూ లేకుండా స్పష్టమైన ప్రొసీడింగ్స్‌ జారీ చేయాలన్నారు. కళాశాలల్లో లెక్చరర్లు ఎదుర్కొంటున్న పెండింగ్‌ సమస్యలపై కమిషనర్‌కు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించి.. హామీ ఇస్తున్నా సమస్య పరిష్కరం కావడం లేదని జేఎల్‌‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


పరిష్కరించకపోతే పోరాట బాట తప్పదు!

ప్రభుత్వ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, ఉత్తమ ఫలితాల సాధన కోసం శ్రమిస్తున్న అధ్యాపకుల న్యాయమైన హక్కులను నిరాకరించడం తగదని తెలంగాణ గెజిటెడ్‌ జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ (టీజీజేఎల్‌ఏ-475) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేపీ శోభన్‌బాబు చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అధ్యాపకులను సమీకరించి భవిష్యత్‌ కార్యాచరణకు, ఆందోళన బాటకు సిద్ధమవుతామని అసోసియేషన్ రాష్ట్ర నాయకత్వం తరపున ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్