Magazines

పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలతో దేశం అధోగతి పాలు దేశం అధోగతి పాలు

58 నిమిషాల క్రితం

The country is in a state of decline due to the anti-people policies of those in power.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 3 నిమిషాల చదవడం

ఈ విధానాలపై రాజీలేని పోరాటం
సామినేని రామారావు హత్య కేసులో

అసలైన హంతకులను అరెస్ట్ చేయాలి

కేసును సిట్ తో దర్యాప్తు చేయించాలి

కరవు నివారణా చర్యలు చేపట్టాలి

సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా ప్లీనంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు,

జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు

నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

​కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు దేశాన్ని అభివృద్ధి పరంగా తీవ్ర అధోగతి పాలు చేస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు విమర్శించారు. ఆదివారం ఖమ్మంలోని మంచికంటి భవన్‌లో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయంగా కార్పొరేట్ వ్యవస్థకు నాయకుడిగా ఉన్న ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి, భారతదేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారపోస్తూ, వారి ఏకచత్రాధిపత్యాన్ని ప్రోత్సహిస్తూ విద్య, వైద్యం, వ్యవ సాయ రంగాల నడ్డి విరిచే చర్యలను సమర్థిస్తోందన్నారు. తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న విద్యా ర్థులపై దౌర్జన్యంగా అణచివేతకు పాల్పడుతోందని, విద్యా ర్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎస్ఎఫ్ఐ మొదటగా ప్రశ్నించిందని గుర్తుచేశారు. ​ఓట్ల నమోదు ప్రక్రియ (సర్)ను దేశంలోని ఓటర్ల తొలగింపునకు కుట్రగా వాడారని, ఈ క్రమంలో దేశంలో సుమారు 13 కోట్ల మంది ఓటర్లను, తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల వరకు ఓట్లను తొలగించారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను సీపీఐ(ఎం) ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన, ఓటర్ల తొలగింపుపై మొదటగా సీపీఐ(ఎం) అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలను సమాయత్తం చేసి, అఖిల పక్షాల ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించిందని గుర్తుచేశారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన నిలబడి ఆందోళనలు చేయడంలో పార్టీ సఫలీకృత మైందన్నారు. రాబోవు పట్టభద్రుల ఎన్నికల్లో మద్దతిస్తున్న అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఉద్ఘాటించారు. త్వరలో నల్లగొండలో జరగనున్న రైతు మహాసభలకు భారీ ఎత్తున జన సమీకరించి, సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.​ సీపీఐ(ఎం) నాయ కులు సామినేని దారుణ హత్యోదంతంలో కాంగ్రెస్‌కు చెందిన మంత్రి అనుసరిస్తున్న రాజకీయాలపై తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందని స్పష్టంచేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ ఇటువంటి హత్యా రాజకీయాలను నిలదీస్తూ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కరవు నివారణా చర్యలు చేపట్టాలి : నున్నా

జిల్లాలో ఎల్‌‌నినో పరిస్థితుల కారణంగా కరువు తీవ్రం గా ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరువు మండలాల్లోని రైతాంగాన్ని. వ్యవసాయ కూలీలను, ప్రజలను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కరువు పేరుతో బియ్యం, నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రంగా పెంచుతూ, బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని చెప్పారు. అధిక ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని, ఈ కరువు పరిస్థితిలో ధరల నియంత్రణ చర్యలను ప్రభుత్వం చేపట్టాలని కోరారు. అన్ని రకాల వస్తువులను ప్రజలకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రేషన్ షాపుల ద్వారా ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యం, 14 రకాల నిత్యావసర వస్తువులు అందించాలని కోరారు. నవంబర్ 15వ తేదీన నల్లగొండ పట్టణంలో జరుగుతున్న ఏఐకేఎస్‌ ‌జాతీయ మహాసభ సందర్భంగా లక్ష మందితో జరిగే బహిరంగ సభలో ఖమ్మం జిల్లా నుండి పదివేల మంది పాల్గొంటున్నారని చెప్పారు. రైతు సభను జయప్రదం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు సామినేని రామారావు హత్యపై సరైన దర్యాప్తు చేయకుండా, అసలైన దోషులను శిక్షించకుండా జిల్లా పోలీస్ కమిషనర్, కొంతమంది పోలీస్ యంత్రాంగం కట్టుకథ అల్లి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయ హత్యను ఆర్థిక హత్యలుగా సృష్టిస్తున్నారని, ఇది పోలీస్ యంత్రాంగానికి సరైన పద్దతి కాదన్నారు. సిట్‌‌ను వెంటనే రంగంలోకి దింపి, హత్యకు పాల్పడిన అసలైన దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. రామారావు భార్య పెట్టిన కేసు నిందితులను వెంటనే అరెస్టు చేసి వారిని విచారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీస్ అధికారులను, రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాచర్ల భారతి. బుగ్గవీటి సరళ, బండి పద్మ. బండి రమేష్, వై.విక్రం, మాదినేని రమేష్, యర్రా శ్రీనివాసరావు, భూక్య వీరభద్రం, బొంతు రాంబాబు, మడుపల్లి గోపాల్ రావు, మెరుగు సత్యనారాయణ, పిట్టల రవి, పార్టీ సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్రావు, ఎం.సుబ్బారావు, చింతల చెరువు కోటేశ్వరరావు, పీడీఎఫ్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్