Magazines

అన్నదాత విల విల..

20 గంటల క్రితం

అన్నదాత విల విల..
avatar
balaji

ప్రచురించబడింది నవం 06, 2026 | 2 నిమిషాల చదవడం

గుండెలవిసేలా రోదిస్తున్న రైతన్నలు

ఖమ్మంలో మురసు మిగిల్చిన నష్టం

వేలాది ఎకరాల్లో పంట నీటిపాలు

కంటితుడుపుగా పంటల సర్వే

ఆదుకోవాలని రైతు సంఘం డిమాండ్

20,450 ఎకరాల్లో వరి, 2,266 ఎకరాల్లో దెబ్బతిన్న పత్తి


​నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రకృతి విపత్తుల సుడిగుండంలో చిక్కుకొని అన్నదాతల గుండెలు పగిలిపోతున్నాయి. ఉమ్మడి ​ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విరుచుకుపడిన మురసు తుఫాన్ విపరీతమైన నష్టాన్ని మిగిల్చింది. ​అష్టకష్టాలు పడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చేతికొచ్చే సమయానికి విరుచుకుపడిన తుఫాన్ విలయం విత్తనం నుంచి దిగుబడి వరకు శ్రమించిన రైతు జీవితాన్ని తుడిచిపెట్టేసింది. ఎల్‌‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను తట్టుకుని శ్రమించిన రైతన్నను వర్షం తుడిచిపెట్టేసింది. చేను నిండా కన్నీళ్లే నిండి, ఊళ్లకి ఊళ్లే దిక్కుతోచని నైరాశ్యంలో కూరుకుపోగా, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతు కుటుంబాలు నిస్సహాయంగా రోదిస్తున్నాయి. ఇప్పటికైనా యంత్రాంగం నిద్రమత్తు వదిలి, ప్రాథమిక సర్వేలకే పరిమితం కాకుండా తక్షణమే క్షేత్రస్థాయిలో పూర్తి సహాయక చర్యలు చేపట్టి రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను రైతన్నలు వేడుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రాథమిక సర్వే లెక్కల ప్రకారమే అపారమైన పంట నష్టం జరిగినట్టు తేలింది.

జిల్లా వ్యాప్తంగా సుమారు 9,416 మంది రైతులకు చెందిన 20,450 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నట్టు ప్రాథమిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే 957 మంది రైతులకు చెందిన 2,266 ఎకరాల్లో పత్తి పంటకి నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఈ గణాంకాల కంటే చాలా తీవ్రంగా ఉంది. కేవలం వరి, పత్తి మాత్రమే కాకుండా జిల్లాలో విస్తారంగా సాగు చేసే మిర్చి, ఇతర వాణిజ్య, ఉద్యానవన పంటలకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. నీరు ముంచెత్తడంతో వేర్లు కుళ్ళిపోయి మిర్చి, తోటల పంటలు ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. పెట్టిన వేల రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైంది. ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఏ ఊరిలో చూసినా, ఏ రైతు నోట విన్నా విపత్తు మిగిల్చిన గాయాల గురించిన కథనాలే వినిపిస్తున్నా యి. కాపాడుకున్న పంట కాస్త కండ్లముందే కొట్టుకుపోతుంటే రైతాంగం తల్లడిల్లిపోతోంది.

పత్తి, మిర్చి రైతులకు కోలుకోలేని దెబ్బ

​ఈ ప్రకృతి వైపరీత్యంలో అత్యధికంగా దెబ్బతిన్నది వరి సాగు చేసిన రైతులే. పండించి చేతికి అందివస్తుందనుకున్న వరి వెన్నులు నీటిపాలు కావడంతో నూర్పిడికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఈతకొడుతున్న వరి కంకులు రైతు గుండెను పిండేస్తున్నాయి. ఇంకోవైపు ‘తెల్ల బంగారం’గా పిలుచుకునే పత్తి పంట వర్షార్పణమై నల్లగా మాడిపోయింది. ఎకరానికి రూ. 30,000 నుంచి 50,000 వరకు పెట్టుబడి పెట్టి పురుగుమందులు కొట్టి సాకిన పత్తి చేన్లు ఇప్పుడు ఎండిపోయిన పుల్లల్లా మిగిలాయి. మిర్చి పంటతో పాటు కూరగాయలు, ఉద్యానవన పంటలు వేసిన రైతులు పూర్తిగా నష్టపోయారు.

​​రైతుల్లో అప్పుల భయం

పంట చేతికొస్తే అప్పులు తీర్చుకోవచ్చని ఆశించిన అన్నదాతలకు ఇప్పుడు అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదు. బ్యాంకు రుణాలు, ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న అధిక వడ్డీ అప్పులు రైతులకు భారంగా మారాయి. భారీ పెట్టుబడులతో సాగు చేసిన పంటలు ఒక్కరోజులోనే నీటిపాలవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు,రైతులు డిమాండ్‌ ‌చేస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్