Magazines

నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాల్సిందే

50 నిమిషాల క్రితం

The four labour codes must be repealed.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 2 నిమిషాల చదవడం

డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో చలో ఢిల్లీని జయప్రదం చేయండి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్

నవతెలంగాణ-కరీంనగర్

దశాబ్దాల పోరాటాలతో కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌‌ల పేరుతో కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ విమర్శించారు. కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌‌లోని సీఐటీయూ జిల్లా కార్యాలయం ముకుందలాల్ మిశ్రా భవన్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి నాయకత్వ, క్యాడర్ శిక్షణా తరగతుల రెండో రోజు ‘లేబర్ కోడ్‌‌లు-కార్మిక వర్గంపై ప్రభావం’ అనే అంశంపై భూపాల్ బోధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను హరించి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.42 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. దేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు, త్యాగాల ఫలితంగా 29 కార్మిక చట్టాలను సాధించుకుందని గుర్తుచేశారు. ఈ చట్టాల ద్వారా లభిస్తున్న పరిమిత ప్రయోజనాలను కూడా దూరం చేయాలనే ఉద్దేశంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని విమర్శించారు. 2019లో వేతనాల కోడ్, 2020లో పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్లను రూపొందించిందన్నారు. వీటి ద్వారా కార్మిక సంఘాల హక్కులు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణా తరగతులకు ప్రిన్సిపల్‌గా జి. రాజేశం వ్యవహరించగా, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు యు. శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్, జె. రాజమల్లు, ఎం. శ్రీలత, సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్