‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రీ-సమ్మిట్‌గా ఐఆర్‌సీ
ఈ నెల 19న ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ, సీఎం రేవంత్‌రెడ్డి
అది పెట్టుబడుల ఆకర్షణకు దోహదపడాలి తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటేలా నిర్వహణ
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) 85వ సదస్సు తెలంగాణ ప్రగతికి వేదికలా మలచాలనీ, పెట్టుబడుల ఆకర్షణకు దోహదపడేలా చూడాలని అధికారులు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. ఆ సదస్సును ఈ నెల 19న హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారనీ, ఆ సదస్సును తెలంగాణ సంస్కృతిని చాటేలా నిర్వహిస్తామని తెలిపారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఐఆర్‌సీ ప్రీ సమ్మిట్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆస్పత్రుల పనులపై ఆరా తీశారు. ఆల్వాల్ టిమ్స్ ఆస్పత్రి, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేసి, ఈ ఏడాదిలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే ఉస్మానియా జనరల్ ఆస్పత్రి,నిమ్స్ విస్తరణ, నూతన హైకోర్టు భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఐఆర్‌సీ సదస్సుకు హాజరయ్యే అతిథులకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, పర్యాటక ప్రాంతాలను పరిచయం చేసేలా హైటెక్స్ ప్రాంగణంలో సుమారు 400 ఎగ్జిబిషన్ స్టాళ్లతో పాటు ప్రత్యేకంగా ‘తెలంగాణ పెవిలియన్’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాలుగు రోజుల పాటు జరిగే సదస్సులో ప్రతిరోజూ తెలంగాణ ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రత్యేక కళా ప్రదర్శనలు నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజూ కనీసం గంట పాటు తెలంగాణ కళాకారుల ప్రదర్శనలుండేలా చూడాలనీ, అతిథులకు రాష్ట్ర ప్రత్యేకతను గుర్తు చేసేలా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే జ్ఞాపికలు అందించాలని సూచించారు.
హైదరాబాద్ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇతర ప్రధాన ప్రజా రవాణా కేంద్రాల్లో ఆకర్షణీయమైన హోర్డింగులు, ప్రత్యేక విజువల్ ప్రకటనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లోని విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లలోనూ ఐఆర్‌సీ సదస్సుతో పాటు తెలంగాణ అభివృద్ధిని పరిచయం చేసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. తెలంగాణలో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను వివరించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఐఆర్‌సీ నిర్వహణ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టతో పాటు భవిష్యత్ పెట్టుబడుల ఆకర్షణకు సంబంధించిన కీలకమైన అవకాశమని స్పష్టం చేశారు. ఐఆర్‌సీ వేదికగా రాష్ట్ర రోడ్ నెట్వర్క్, రైల్వే ప్రాజెక్టులు వస్తాయనీ, అవి రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలు రాయిగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి ఇలంబర్తి, స్పెషల్ సెక్రటరీ గంగాధర్, మోర్త్ రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్, ఎన్‌హెచ్‌ఏఐ రీజినల్ ఆఫీసర్ శివశంకర్, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్లు లింగారెడ్డి (అడ్మిన్), బి.వి.రావు, వసంత్ నాయక్, ధర్మారెడ్డి, నర్సింగ్‌రావు, రాజేందర్, రాజేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)