Magazines

‌‘సర్‌’ వ్యతిరేక ఉద్యమంలో బీఆర్‌ఎస్‌ ఎక్కడ?

46 నిమిషాల క్రితం

Where does the BRS stand in the anti-‘Sir’ movement?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 3 నిమిషాల చదవడం

దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఏకమైనా కానరాని గులాబీ జెండా
ప్రజలను కదిలించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు లేని వైనం

బీజేపీని ప్రశ్నించడంలో వెనుకబాటు

కేసులంటే భయమా? లోపాయికారి ఒప్పందమా?

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం వరకే పరిమితం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌)‌పై ఆందోళనలు ‌దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్నాయి. అర్హులైన ఓట్ల తొలగింపును నిరసిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి వరుస కార్యక్రమాలను చేపడుతున్నది. ‘ఓట్‌ ‌బచావో... దేశ్‌‌ బచావో’పేరుతో ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో లక్షలాది మంది పోటెత్తారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి కేంద్రం తీరును తప్పుపట్టాయి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (‌సీఈసీ) జ్ఞానేశ్‌‌కుమార్‌ ‌రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశాయి. దేశవ్యాప్తంగా 13.2 కోట్ల మంది ఓటు హక్కును కాలరాయడం సరైంది కాదని హెచ్చరించాయి. సర్‌‌కు వ్యతిరేకంగా దేశమంతా నిరసనలు వ్యక్తమవుతున్నా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ‌మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రతిపక్షాలు ఐక్యంగా చేస్తున్న కార్యక్రమాల్లో గులాబీ జెండా కానరావడం లేదు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌, మాజీమంత్రి హరీశ్‌‌రావు సర్‌‌పై ఎందుకు మాట్లాడ్డం లేదని కాంగ్రెస్‌ ‌ప్రశ్నిస్తున్నది. రాష్ట్రంలోనూ 73,39,235 మంది ఓటర్ల వివరాలు గైర్హాజరు, అడ్రస్‌ ‌మార్పు, మరణించడం, డూప్లికేట్‌ (ఏఎస్‌‌డీడీ) జాబితాలో ఉన్నాయి. రాష్ట్రంలో 43 లక్షల ఓట్లు తొలగించే ప్రమాదముందని తెలుస్తున్నది. అయినా బీఆర్‌ఎస్‌ సర్‌‌కు వ్యతిరేకంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలను నిర్వహించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజాస్వామిక హక్కు అయిన ఓట్లు తొలగిపోయి ప్రజలు ఆందోళన చెందుతుంటే బీఆర్‌ఎస్‌ ‌మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నది. ప్రజలను కదిలించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మాత్రం సిద్ధం కావడం లేదు.

బీఆర్‌ఎస్‌ ‌తీరుపై వ్యతిరేకత

సర్‌‌పై ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో బీఆర్‌ఎస్‌ ‌తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆ పార్టీ వ్యవహరించకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తున్నది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నపుడు కేంద్రంతో సఖ్యతగానే ఉన్నది. బీజేపీ తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అనేక నిర్ణయాలను సమర్థించింది. అంటే రాజకీయాలకు అతీతంగా సమాఖ్య స్ఫూర్తితో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉండాలని నాడు చెప్పింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా బీజేపీకి అనుకూలంగానే ఉంటోందన్న విమర్శలు వస్తున్నాయి. బీజేపీ నిర్ణయాలను ప్రశ్నించడంలో బీఆర్‌ఎస్‌ ‌వెనుకబడి ఉందన్న అభిప్రాయం వినిపిస్తున్నది.

కేసులు ఉండడం వల్లేనా...

బీఆర్‌ఎస్‌ ‌తొమ్మిన్నరేండ్ల పాలనలో చేసిన నిర్ణయాలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. దాంతోపాటు ‌ఛత్తీస్‌‌ఘడ్‌ ‌నుంచి విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించిన అంశం కూడా విచారణలో ఉన్నది. ఫార్ములా ఈ కారు రేసు, ఫోన్‌ ‌ట్యాపింగ్‌, ధరణి పేరుతో భూముల కుంభకోణం ఇలా అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి. అందుకే బీజేపీని వ్యతిరేకించడంలో బీఆర్‌ఎస్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నది. కేసులంటే భయమా? లేదా బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఏమైనా ఉందా?అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విమర్శలు

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడం లేదంటూ బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నిత్యం ఆందోళనలు చేపడుతున్నది. ఎల్‌‌నినో వల్ల వచ్చిన కరువుపైనా ఆ పార్టీ రాజకీయం చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. ప్పపంచమంతా ఎల్‌‌నినో వల్ల కరువు పరిస్థితులు వచ్చినా బీఆర్‌‌ఎస్‌ ‌మాత్రం కాంగ్రెస్‌ ‌వల్లే కరువు వచ్చిందంటూ ప్రచారం చేస్తున్నది. ఇటీవల గోదావరిఖనిలో సింగరేణి కార్మికుల గర్జన, ఆదిలాబాద్‌‌లో రైతు గర్జన కార్యక్రమాలను నిర్వహించింది. బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హాజరై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కానీ కేంద్రం ఇచ్చిన వాగ్ధానాలు, వాటిని విస్మరించిన అంశాల గురించి మాత్రం ప్రశ్నించడం లేదు. ఆదిలాబాద్‌‌లో సిమెంట్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)ని పునరుద్ధరించేది కేంద్రమే అయినా ఒత్తిడి పెంచేందుకు ఎలాంటి కార్యక్రమం తీసుకోకపోవడం గమనార్హం. రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోయినా, విభజన హామీలను అమలు చేయకపోయినా కేంద్రాన్ని బీఆర్‌ఎస్‌ ప్రశ్నించడం లేదు. దీంతో ఆ రెండు పార్టీల మధ్య అవగాహన ఒప్పందం ఉందనే అభిప్రాయం బలపడుతున్నది. అందులో భాగంగానే సర్‌‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ ‌పోరాటాలు చేయడం లేదని అర్థమవుతున్నది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్