Magazines

వరండానే తరగతి గది!

2 గంటల క్రితం

veranda
avatar
balaji

ప్రచురించబడింది నవం 21, 2026 | 2 నిమిషాల చదవడం

వంటగది లేదు..పనిచేయని హ్యాండ్‌వాష్‌ బేసిన్లు

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధనకు తప్పని తిప్పలు

సరిపడా తరగతి గదుల్లేక విద్యార్థుల ఇబ్బందులు

కాగితాలకే పరిమితమైన యూడైస్ నివేదికలు


నవతెలంగాణ-అశ్వారావుపేట

ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని పాలకులు గొప్పలు చెబుతున్నా, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మాత్రం మారడం లేదు. గదుల కొరతతో విద్యార్థులు వరండాల్లోనే చదువులు వెళ్లదీస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక వంటగది లేక ఆరుబయటే మధ్యాహ్న భోజనాన్ని తయారు చేస్తున్నారు. మరి కొన్ని పాఠశాలల్లో వంటగదులు లేక ఇంటి వద్దే వంట చేసి మధ్యాహ్న భోజనం తయారు చేసి తీసుకొస్తున్నా రు. మరోపక్క పనిచేయని హ్యాండ్‌వాష్ బేసిన్లు. ఐదు తరగతులకు కలిపి ఒక్కరే ఉపాధ్యా యుడు... ఇలా అనేక సమస్యలతో ఊరుబడులు కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ లోపాలన్నీ యూడై స్ పోర్టల్‌లో నమోదవుతున్నా క్షేత్రస్థాయిలో సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. శుక్రవారం ‘నవతెలంగాణ’ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించగా ఈ దుస్థితి వెలుగుచూసింది.

వరండాలోనే నాలుగు తరగతులు

ఎంపీయూపీఎస్‌ పండువారిగూడెంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు నిర్వహించాల్సి ఉండగా, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం తో ప్రస్తుతం నాలుగు తరగతులే నిర్వహిస్తున్నా రు. మొత్తం 51 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. తరగతి గదులతో పాటు వరండా కలిగిన భవనం శిథిలావస్థకు చేరడంతో వరండాలోనే నాలుగు తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాలలోని వంటగది సైతం శిథిలావస్థకు చేరిందని ఉపాధ్యాయురాలు కృష్ణకుమారి తెలిపారు.

ఏకోపాధ్యాయుడికి తప్పని తిప్పలు

జీపీఎస్‌ వాగొడ్డుగూడెంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 17 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండు గదులు ఉన్నప్పటికీ ఒక్క ఉపాధ్యాయుడే విధులు నిర్వహిస్తున్నారు. ఒకేసారి ఐదు తరగతులకు బోధించడం ఆయనకు సవాలుగా మారింది. పాఠశాలలో చేతిపంపునకు మోటారు ఏర్పాటు చేసినప్పటికీ అది పనిచేయడం లేదు. ఈ గ్రామం నుంచి నలుగురు విద్యార్థులు ప్రయివేట్‌ పాఠశాలలకు వెళ్తుండగా, వారిలో ఇద్దరిని ఈ విద్యాసంవత్సరంలో ఒప్పించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. మరో ఇద్దరిని వచ్చే విద్యాసంవత్సరంలో చేర్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సంఖ్య పెంచాలని లక్ష్యాలు నిర్దేశిస్తున్న విద్యాశాఖ .. ఉన్న విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలోనూ బోధన పర్యవేక్షణలోనూ విఫలమవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా కొత్తగా విద్యాశాఖలోకి ఇంటర్‌‌నూ కలిపి ఒకే గొడుకు కిందకు తెస్తే సమస్యలు ఏ రకంగా తీరతాయన్న ప్రశ్నలూ వినిపిస్తున్నాయి. ఇక యూడైస్‌ నివేదికల్లో అవసరాలు నమోదు చేయడంతోనే బాధ్యత ముగియకుండా, వాటి ఆధారంగా నిధులు కేటాయించి తరగతి గదులు, వంటగదులు, తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు కల్పించాలనీ, ఏకోపాధ్యాయ పాఠశాలలకు అదనపు ఉపాధ్యాయులను నియమించడంతో పాటు శిథిల భవనాలకు మరమ్మతులు చేపట్టాలని పలువురు డిమాండ్‌ ‌చేస్తున్నారు.


రెండు గదుల్లో ఐదు తరగతులు

రామన్నగూడెం పాఠశాలలో 
మొత్తం 33 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే తరగతుల నిర్వహణకు కేవలం రెండు గదులే ఉండటంతో బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రధానోపాధ్యాయులు వి.ప్రసాదరావు తెలిపారు. ఎంపీపీఎస్‌ దిబ్బగూడెం (ఆర్‌)లో 32 మంది విద్యార్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్నా రు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ఐదు తరగతులకు ఒకే గది మాత్రమే అందుబాటులో ఉంది. దీనికి తోడు పాఠశాలలో వంటగది లేదు. దీంతో ఇంటి వద్దే వంట చేసి మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలకు తీసుకొస్తున్నారు. మరోవైపు పాఠశాల భవనంలోని ఒక గది శిథిలావస్థకు చేరిందని ప్రధానోపాధ్యా యులు రామారావు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్