Magazines

మియాపూర్ భూముల్ని విక్ర‌యిస్తాం

3 గంటల క్రితం

lands
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 3 నిమిషాల చదవడం

ఆ నిధులు విద్యాభివృద్ధికి వినియోగిస్తాం

దీనిపై మంత్రివ‌ర్గ ఉప‌సంఘం అధ్య‌య‌నం : ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

ఈ భూముల్ని కొల్ల‌గొట్టేందుకు కేసీఆర్‌, 
ఆయ‌న బంధువులు ప్ర‌య‌త్నించారంటూ ఆరోప‌ణ‌లు


న‌వ‌తెలంగాణ బ్యూరో - హైద‌రాబాద్
మియాపూర్ లో రూ. 50 వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికి చెందుతాయంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వ‌టం ప‌ట్ల ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సందర్భంగా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానానికి ఆయన ధ‌న్య‌వాదాలు తెలిపారు. శుక్ర‌వారం ఢిల్లీలో ఎంపీలు చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాద‌వ్ త‌దిత‌రుల‌తో క‌లిసి సీఎం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మియాపూర్ భూములను విక్ర‌యిస్తామ‌ని తెలిపారు. త‌ద్వారా వ‌చ్చే నిధుల‌ను నీటిపారుదల, విద్యా, వైద్య తదితర రంగాలకు కేటాయిస్తామ‌ని చెప్పారు. ఈ అంశంపై మంత్రివ‌ర్గంలో చ‌ర్చిస్తామ‌న్నారు. వనరుల సమీకరణకు నియమించిన మంత్రివర్గ ఉప సంఘం మియాపూర్ భూముల విక్రయం.. వచ్చే ఆ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై అధ్యయనం చేస్తుందని వెల్ల‌డించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక రూ.1.50 లక్షల కోట్ల విలువైన భూములు రక్షించామ‌ని సీఎం వివ‌రించారు.

మియాపూర్ తోపాటు తెలంగాణ‌ లోని విలువైన భూముల్ని కొల్ల‌గొట్టేందుకు కేసీఆర్‌, ఆయ‌న బంధువులు ప్ర‌య‌త్నిం చారంటూ ఆరోపించారు. మియాపూర్ కు సంబంధించి కేసీఆర్‌... ఆయ‌న బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ద్వారా క‌బ్జాకు ప్రయత్నించారని విమ‌ర్శించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షునిగా ఈ కబ్జా వ్యవహారాలపై పోరాడడంతోనే కక్ష గట్టి త‌న‌ను జైలుకు పంపారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఐఎంజీ భూముల‌ను భ‌లేరావు కుటుంబ సభ్యులతో కుమ్మక్కై కేటీఆర్ కొట్టేయాలని చూస్తే న్యాయపోరాటంతో అడ్డుకున్నామ‌న్నారు. కంచె గచ్చిబౌలి, మామిడిపల్లి భూములను కొట్టేసేందుకు బీఆర్ ఎస్ నాయకులు ప్రయత్నిస్తే న్యాయపోరాటంలో గెలిచామ‌ని గుర్తు చేశారు. గుర్రంగూడ అటవీ భూములను కేటీఆర్ అనుచరులు కబ్జా చేయ‌టానికి ప్రయత్నిస్తే సుప్రీం కోర్టులో పోరాడామ‌ని, అది అటవీ భూమి అంటూ సుప్రీం కోర్టు తెల్చి చెప్పిందని వివరించారు.

మంచిరేవుల లో 143 ఎకరాల భూమిని కేటీఆర్ రాయలసీమ బిల్డర్స్ తో కలిసి కబ్జాకు ప్రయత్నిస్తే దాన్ని కూడా ర‌క్షించామ‌ని తెలిపారు. అందులో పోలీసుల పిల్లలకోసం స్కూల్ నిర్మించామ‌ని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 400 ఎకరాల అటవీ భూమిని బీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కు నజరానాగా అప్పగిస్తే సుప్రీం కోర్టులో పోరాడి రక్షించామ‌ని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం ఆ పార్టీ నేత‌ల భూ ఆక్రమణలను అడ్డుకున్నామని వివ‌రించారు. హరీశ్‌రావు మామ హనుమంతారావు కబ్జా చేసిన భూములు సర్వే చేయకుండా అధికారులను అడ్డుకుంటున్నారని, దీంతో ఆయ‌న కోర్టు కు వెళ్లి స్టే తెచ్చుకున్నారని చెప్పారు. మ‌రోవైపు భూ ఆక్రమణపై బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై అనేక తప్పుడు ఆరోపణలు చేశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో ప్ర‌భుత్వం శాసనసభ లో చర్చించి చర్యలకు దిగితే తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

మియాపూర్ భూములపై ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే ఎందుకు బీఆర్ఎస్ నాయకులు స్పందించడం లేదని నిల‌దీశారు. కనీసం రెవెన్యూ అధికారులను సైతం ఆ పార్టీ నాయకులు అభినందించడం లేదని విమ‌ర్శించారు. పద్మాలయ స్టూడియో, ల్యాంకో భూములపై ఉమ్మడి రాష్ట్రంలో కేసులు వేసిన కేసీఆర్, హరీశ్‌రావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోలేదని ప్ర‌శ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి పై కేసులు వేశారో వారితోనే కేసీఆర్, హరీశ్ రావు లాలూచీ పడ్డారని దుయ్య‌బ‌ట్టారు. మియాపూర్ భూములపై ఇప్పటికైనా కుట్రలు మానుకోవాలంటూ కేటీఆర్‌, హ‌రీశ్‌రావుల‌కు సీఎం హిత‌వు ప‌లికారు. ఆ భూముల విషయంలో దామోదర్ రావుకు ముందుగానే విలాసవంతమైన కార్లు లంచంగా ఇచ్చార‌ని ఆరోపించారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ కు నగదు రూపంలో ముడుపులు ముట్టాయ‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం ఈ భూముల రక్షణకు ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించింద‌ని తెలిపారు. తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో ఆ భూముల రక్షణకు సరైన చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించామ‌న్నారు.


భూముల ఆక్రమణలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలంటూ ముఖ్య‌మంత్రి ఈ సంద‌ర్భంగా బీఆర్ ఎస్ నేత‌ల‌కు స‌వాల్ విసిరారు. త‌న ఫామ్ హౌస్ కు ద‌గ్గ‌ర్లోని రెండు గ్రామాల మధ్య వివాదాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకున్నారని విమ‌ర్శించారు. అక్కడి ఆక్రమణలను తేల్చి శ్రీకాంతాచారి పేరిట అమరవీరుల కాలనీ నిర్మిస్తామ‌ని హెచ్చ‌రించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్