ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) నిరంకుశ పక్షపాత వైఖరిపై చెలరేగిన దుమారం మూడో మోడీ సర్కారు హయాంలో విశ్వసనీయత కోల్పోయిన వ్యవస్థలపై విస్పోటనమే. రాజ్యాంగ పరంగా సీఈసీ కేంద్రంగా నడుస్తున్నప్పటికీ నిజానికి ఇది ఎన్నికల వ్యవస్థకూ దాన్ని రాజకీయ రాజ్యాంగ సాధనంగా చేసుకున్న కేంద్రసర్కారు మొత్తానికి వర్తిస్తుంది. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం ద్వారా ఇది బయటకు రావడమూ, వెనువెంటనే సుప్రీంకోర్టులో కూడా చర్చ కావడమూ ఒక ఎత్తు. బీజేపీ పట్ల మెతకగా వుంటా యని పేరున్న పార్టీలే పాలక ఎన్డీయే భాగస్వామ్య పక్షాలూ ప్రక్షాళన కోరడం మరోఎత్తు. సర్ అమలుకు వచ్చిన నాటినుంచి నూటికి నూరుపాళ్లు సమర్థిస్తున్న ఏకైక పక్షమైన బీజేపీనే ఈ సమయంలో సీఈసీనీ ఎన్నికల వ్యవస్థనూ భుజాన వేసుకున్న ఏకైక పార్టీగా ముందుకు రావడం మరో కోణం. సీఈసీకి రాజినామాకు డెడ్‌లైన్ విధించి జంతర్ మంతర్ 2.0 తప్పదని సీజేపీ హెచ్చరించడం ఇంకో కోణం. ఈ సమయంలో అసలు మౌలిక ప్రజాస్వామ్య లక్షణాల పరిరక్షణ కోణంలో గాక సీఈసీ నియామకం బిల్లు, ఈసీ పని పద్ధతులు రాజ్యాంగ నిబంధనల వంటి అంశాలకే పరిమితమై మాటల గారడీ చేస్తున్న మీడియా కథనాలు మరో కోణం. ఎందుకంటే ఇంత సంలచనంలోనూ ఈసీ నుంచి సాంకేతిక ప్రకటనలూ షరామామూలుగా విడుదలవు తుండటం గమనించదగింది.
దేశవ్యాపిత సంచలనం
మొదటగా ఈ వార్త దావానలంలా వ్యాపించడంలో మొదట చెప్పుకోవలసింది ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రిపోర్టర్ రితికా చోప్రాను. బహుశా చాలాకాలం తర్వాత మీడియాలో ఒక షాకింగ్ కథనం వెలువరించిన ఘనత ఆమెకే దక్కుతుంది. గత కొంతకాలంగా సర్‌పైన ఆమె వరస పరిశోధన కొనసాగిస్తూ వచ్చింది. పది నెలల్లో 14 సార్లు, ఒకేరోజు నాలుగుసార్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్వీందర్ సింగ్ సంధు, వివేక్ జోషీలు అభ్యంతరాలను తోసిపుచ్చారన్నది ఆమె బయటపెట్టిన అంశం. ఆధారాలతో సహా వెల్లడించిన ఈ వాస్తవాలను ఎవరూ కాదనలేరు. దాంతో భిన్నాభిప్రాయాలు సాధారణ మేనన్న సమర్థనతో బయటపడటానికి సీఈసీతో పాటు బీజేపీ నేతలు కూడా ప్రయత్ని స్తున్నారు. కానీ, బయట ప్రతిపక్షాల ఉద్యమం, రాష్ర్టాలను పాలించే ప్రభుత్వాలూ, మాజీ సీఈసీలు కూడా అదే విషయమై పోరాడుతున్న నేపథ్యం ఇక్కడ కీలకమైంది. యోగేంద్ర యాదవ్, పరకాల ప్రభాకర్ వంటి నిపుణులు అచ్చంగా ఆ అంశంపైనే అపారమైన అధ్యయనం చేస్తూ దేశమంతటా పోరాడుతున్నారు. సుప్రీంకోర్టులో ఒకటికి పదిసార్లు కేసులు నడిచాయి.
పార్లమెంటులోనూ ప్రకంపనలు రేగాయి. సుఖ్వీర్, వివేక్‌లు అభ్యంతరం పెట్టిన అంశాలు బయట జరిగే పోరాటాలలో ప్రతిధ్వని స్తున్నవే. రాజీవ్ కుమార్ పదవీ విరమణ తర్వాత జ్ఞానేష్ కుమార్ నియామకం జరిగిన తీరే అభ్యంతరకరం. దానికి ముందు ఈసీలు అరుణ్ గోయెల్, అశోక్‌లావాసాలు ఆశ్చర్యకరంగా నిష్ర్కమించారు. సుఖ్వీందర్ సంధు, వివేక్ జోషీలు కూడా పాలక కూటమి ఎంపిక చేసినవారే. కనుక ఎన్నికల సంఘం కథ మొత్తం అడుడగడుగునా మలుపులతోనే నడుస్తున్నది. సీఈసీ ఎంపిక ప్రక్రియలో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) వుండాలన్న కోర్టు సూచనను కూడా పార్లమెంటుపేరతో ఏకపక్షంగా తోసిపుచ్చి ప్రధాని, ఆయన నియమించిన మరో కేంద్రమంత్రికి చోటు కల్పించారు. వారే ఇద్దరున్నాక ప్రతిపక్ష నాయకుడు వున్నా అలంకారమన్నట్టే తయారైంది.
జ్ఞానేశ్ నేపథ్యం
జ్ఞానేష్ కుమార్‌ను వివిధ శాఖల మధ్య వేగంగా పైకి నెట్టిన తీరు, హోంమంత్రి అమిత్ షా నమ్మకస్తుడైన అధికారిగా ఆయన నిర్వహించిన పాత్ర కూడా క్రమపద్ధతిలోనే నడిచాయి. మోడీ అమిత్ షాలతో కలసి సీఈసీ కుట్ర పన్నారని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించడానికి కారణమదే కావచ్చు. అయితే 2023లో పార్లమెంటు ఈ బిల్లు ఆమోదించిన రోజునే సభలోకి ఆగంతకులు వచ్చి పొగ వదలడం, ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. సస్పెండ్ కాని రాహుల్‌గాంధీ సభలో దీనిపై ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఒక మీడియా వ్యాఖ్యానం చేయడం కూడా చర్చను పక్కదోవ పట్టించే ప్రయత్నంగానే కనిపిస్తుంది. సీఈసీ రాజీనామా చేయాలని ‘హిందూ’ సూటిగా సంపాదకీయమే రాసింది. ఈసీ వివరణ ఇవ్వాలనీ, ప్రతిష్ట కాపాడుకోవాలని ఈనాడు రాసింది. అసలు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఈ కథనాన్ని తీసుకురావడం కార్పొరేట్ విభజనలో భాగమేనని కూడా వాదనలున్నాయి. ఇద్దరు ఈసీలు ఒక నిర్ణయం తీసుకుని బయటపెట్టారంటే వారు కూడా భరించలేనంత దారుణంగా పరిస్థితి తయారైందని సిద్ధార్థ వరదరాజన్ వంటి మీడియా ప్రముఖులు వివరిస్తున్నారు. ఇదే పత్రిక రెండేండ్ల కిందట సర్‌పై విమర్శలను తూర్పారపడుతూ సంపాదకీయమే రాసింది. ఇప్పుడు కూడా ‘న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఈ కథనాన్ని తనదిగా స్వీకరించలేదు. పత్రికలూ, వెబ్‌సైట్లు ఛానళ్లలో కొన్ని అటూ ఇటూ తిప్పి దీన్ని తక్కువ చేయడానికి తంటాలు పడుతున్నాయి. అభిశంసన ప్రక్రియ చాలా జటిలమైంది గనక ఆయనకేమీ కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కొద్ది వారాల కిందట విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటిదారి పట్టిన తీరును వీరు మర్చిపోతున్నారా? రాజకీయాలలో సాంకేతికాంశాలే ఎప్పుడూ కాపాడలేవు. ఇప్పుడు తమ భిన్నాభిప్రాయాలు బయటపెట్టినంత మాత్రాన తానేమీ మిగిలిన ఇద్దరు ఈసీలను వీరులుగా భావించడం లేదని యోగేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. గతంలో కమిషనర్‌గా వున్న అశోక్ లావాసా 2022లో సీఈసీ అయివుండేవారు. పది సందర్భాల్లో ఆయన అప్పటి సీఈసీ రాజీవ్‌కుమార్ చర్యలకు అభ్యంతరం పెట్టారు. అయితే మాట చెల్లకపోవడంతో ఆసియా డెవలప్ మెంట్ బ్యాంక్ వీపీగా పదవి తీసుకుని న్రిష్క్కమించారు. ఒకవేళ జ్ఞానేష్ గనక వైదొలగితే సీనియారిటీని బట్టి సుఖ్వీందర్ సింగ్ ఆ స్థానంలోకి రావలసి వుంటుంది.
ఎన్డీయేలో ప్రకంపనలు
సీఈసీకి సంబంధించి కీలకమైన రాజకీయ పార్టీల నుంచి వస్తున్న స్పందనలు కూడా అదే అభిప్రాయం కలిగిస్తాయి. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలైన లోక్‌జనశక్తిపార్టీ(ఎల్‌జెపి రామ్ విలాస్)తెలుగు దేశం, రాష్ర్టీయ లోక్‌మోర్చాల నేతలు పలు రూపాల్లో విభిన్న స్పందనలు వెలిబుచ్చారే గానీ బీజేపీలా పూర్తిగా సమర్థించేందుకు సిద్ధపడలేదు. ఎన్నికల ప్రక్రియలపై సీఈసీ జ్ఞానేశ్ వెంటనే సమగ్రమైన, సవివరమైన వివరణ ఇవ్వాల్సిందేనని కేంద్రమంత్రి చిరాగ్‌పాశ్వాన్ గట్టిగా కోరారు. ఎన్నికల సంఘం స్వతంత్రమైన రాజ్యాంగ సంస్థ కాబట్టి వాస్తవాలు చెప్పకపోతే విశ్వసనీయత దెబ్బతింటుందన్నారు. గతంలోనూ జెన్‌జీ ఆందోళనలపై నిర్బంధం విషయంలో పాశ్వాన్ సామ్రాట్ చౌదరి విధానాలను తప్పుపట్టారు. మరోపెద్ద భాగస్వామ్య పార్టీ జేడీయూ ఉమ్మడి సివిల్ కోడ్ విషయంలో ఇప్పటికే భిన్నాభ్రిపాయాలు వెలిబుచ్చింది. ఇక తెలుగుదేశం లోక్‌సభా పక్ష నాయకుడు లావు కృష్ణదేవరాయలు కూడా వివరణ ఇవ్వాలని కోరారు. కాకపోతే సర్ ప్రక్రియ ఏపీ వరకూ సక్రమంగా జరిగిందని ఆయన కితాబునివ్వడం కొసమెరుపు. ఆర్‌ఎల్‌ఎంకు చెందిన కేంద్రమంత్రి కుష్మానా కూడా ఈసీ వివరణ కోరారు. ఇప్పటివరకూ ఈసీ పేరిట అధికారిక ప్రకటనలు వస్తున్నా అవి ఎవరు ఇచ్చింది స్పష్టత లేదు. ఒక విధంగా ఏకపక్ష దోరణికి కొనసాగింపుగానే వుంటున్నాయి.
జగన్, నవీన్‌పట్నాయక్‌ల విమర్శ
వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా సీఈసీ విశ్వసనీయత పారదర్శకత కాపాడుకోవాలని కోరారు. 2023 సీఈసీనియామక చట్టాన్నే పున:సమీక్ష చేయవలసివుందని గట్టిగా సూచించారు. ఇక సర్ ప్రక్రియకు సంబంధించి ఏపీలో తమ అభిమానుల లక్షల ఓట్లు తొలగించబడ్డాయని కూడా విమర్శించారు. దీని కొనసాగింపుగా మాట్లాడిన వైసీపీ నాయకులు సీఈసీ నిరంకుశంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. వైసీపీ నేతలు అందులోనూ జగన్ కేంద్రం నిర్ణయాలపై సమస్యలపై ఇంత సూటిగా మాట్లాడటం అరుదు. కొద్దిరోజుల కిందట కూడా జెన్‌జీ ఆందోళనలు ‘బొద్దింకలు’ పుట్టుకరావడం వంటి అంశాలు ఆయన ప్రస్తావించడం పరిశీలకులను ఆకర్షించాయి. బీఆర్‌ఎస్ కూడా సర్‌లో సామూహిక ఓట్ల తొలగింపును ప్రస్తావిస్తూ సీఈసీపై విమర్శలు చేసింది.
ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కూడా సీఈసీ నిర్వాకాలను నిలదీశారు. సర్‌లో ఓట్ల తొలగింపును తప్పు పట్టారు. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మొదటిసారిగా ఈ పరిణామం తర్వాత సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీకి ఫోన్ చేసినట్టు మీడియా నివేదించింది. తాజా పరిణామం ఎంత ప్రభావం చూపుతున్నదో ఈ ఉదాహరణలన్నీ చెబుతున్నాయి. ఏది ఏమైనా తాము అందరినీ కలుపుకుని అభిశంసల దిశలో వెళతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. సీఈసీ రాజీనామా చేయకపోతే గాంధీ జయంతి నుంచి జంతర్ మంతర్ 2.0 ప్రారంబిస్తామని సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ప్రకటించడం కూడా ఆసక్తి కలిగించింది(కాకపోతే సర్ విరమించే వరకూ రాజకీయ పార్టీలు ఎన్నికలను బహిష్కరించాలని ఆయన అన్నమాటకు ఎలాంటి మద్దతు రాలేదు సరికదా కొంత అభ్యంతరం వ్యక్తమైంది).
తీవ్ర ఉద్యమం దిశగా
ఇన్నిటి మధ్యనా బీజేపీ మాత్రం సీఈసీని, సర్‌నూ సమర్థించేందుకు అనుకూల మీడియాను పురికొల్పడమే గాక కొన్ని కథనాలు వదులు తున్నప్పటికీ ఈ సునామి చల్లారే అవకాశం కనిపించడం లేదు. సీఈసీని మాత్రమే గాక మొత్తం ఎన్నికల వ్యవస్థనే ప్రక్షాళన చేయాలని వామపక్షాలు గట్టిగా చెబుతున్నాయి. దేశ వ్యాపిత ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సర్కారు అజెండాకు కూడా ఈ సునామీకి దారితీస్తే ఆశ్చర్యపోవలసింది లేదు. విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థ, న్యాయవ్యవస్థ, అధికార వ్యవస్థ పార్లమెంటు చట్టసభలు, మీడియా, అన్నింటా ఇంత తీవ్ర సంఘర్షణలు ప్రజ్వరిల్లుతుండడం యువత, వివిధ వర్గాల ప్రజలూ రంగంలోకి వస్తుండడం అందుకు
నిదర్శనం.
తెలకపల్లి రవి







కామెంట్‌లు (0)