‘అది సభో, సంబరమో! పెండ్లో, చావో! ఊరేగింపో.. పుట్టలు పుట్టలుగా కదిలే తరంగాలు... సాంస్కృతిక మోతలో... సంతోషాల పరుగు పందేల లో.. నిలువునా కూలిపోవడమూ ఒక ఆనందమే! కన్నీళ్లతో కుమిలిపోవడమూ ఒక ఉత్సవమా?’ అంటూ నిశబ్దంగా శబ్దిస్తాడు కవి. అయినా ఈ రణగొణ ధ్వనులలో ఎవరికి వినపడుతుంది చెప్పు. ఉత్సవాలైనా, ఊరేగింపులైనా, పండగలైనా పబ్బాలైనా మన ఆనందాలను, సంతోషాలను వ్యక్తం చేసే సామూహిక సందర్భాలుగా ఉండాలి. ఆనందాలు మరింత రెట్టింపు కావాలి గానీ, నిండా దుఃఖ సాగరంలోకి నెట్టివేయడాన్ని, ఆరోగ్యాలను చెడగొట్టడంగానీ చేయవద్దు కదా! ఎందుకింత విపరీత ధోరణులతో ఉత్సవాల ధ్వనులు పెరుగుతున్నాయి! పూర్వం కూడా ఉత్సవాలున్నాయి. పాటలున్నాయి. నృత్యాలున్నాయి. కోలాటాలున్నాయి. భజన బృందాలున్నాయి. కళా సమూహాలున్నాయి. కానీ ఇంత కాలుష్యంగా లేవు. దూసుకొస్తున్న మృత్యుగీతాల్లా మనుషుల గుండెలపై దాడి చేస్తున్నాయి నేడు. ధ్వని కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఇది ప్రమాదకరంగా మారింది. ప్రాణాలనూ తీస్తున్నది.
ఇది ఉత్సవాల కాలం. నిన్ననే గణేష్ నిమజ్జన శోభాయాత్రలు రాష్ట్రం అంతానే కాదు, దేశమంతా జరిగాయి. తొమ్మిది రోజులుగా ప్రతివీధిలోనూ ప్రతి మండపాలలో పూజలూ, పాటలు, మైకులు హోరెత్తిపోయాయి. ఇక ఈ మండపాలలో ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమం, పాటలు, డ్యాన్సులతో యువత విజృంభించింది. కొన్నిచోట్లయితే డీజే సౌండ్లతో విపరీత ధ్వని కాలుష్యాన్ని పెంచాయి.
వినాయక చవితి, నిమజ్జనాలతో అయిపోవు. రేపు దసరా వస్తున్నది. దేవీనవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి. ఆ తర్వాత బతుకమ్మ ఉత్సవాలూ వస్తాయి. ఇవన్నీ సాంస్కృతికంగా మనం ఎప్పుడూ నిర్వహించుకొనే పండుగలే! కానీ ఇవ్వాళ ఈవెంట్లుగా సెలెబ్రేషన్ పేరుతో వ్యాపారాత్మకంగా మారాయి. అంతేకాదు, బల ప్రదర్శనకు సందర్భాలుగా కూడా మార్చుకున్నారు. ముఖ్యంగా ఈ ఉత్సవాలలో వదులుతున్న శబ్ద కాలుష్యం వల్ల జరుగుతున్న అనర్థం విపరీతంగా పెరుగుతున్నది. దీనిని కట్టడి చేయడం సాధ్యం కావటం లేదు. ఇటీవల జగిత్యాలలో శోభాయాత్ర సందర్భంగా డీజే పాటలతో డ్యాన్స్ చేస్తూనే గుండెలు గుభేలుమనే శబ్దం వల్ల గుండెపోటుతో మృతిచెందిన సంఘటన జరిగింది. ఇదే సందర్భంలో హైదరాబాద్ రాంనగర్‌కు చెందిన ఒక యువకుడు డీజే సౌండ్ బాక్స్ ముందు డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. తాడేపల్లిగూడెంలోనూ అలానే జరిగింది. ఇక పెద్దపెద్ద శబ్దానికి పాఠశాలలోని ఆరోతరగతి అమ్మాయి హార్ట్ ఫెయిల్ అయి కన్నుమూసింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
సాధారణంగా మన కర్ణభేరి 60 నుంచి 70 డెసిబెల్స్ శబ్దం వరకు తట్టుకోగలుగుతాయి. ఇప్పుడు వీళ్లు ఉపయోగించే డీజే అంటే డిస్క్ జాకీ సౌండ్ 100 నుంచి 110 డెసిబెల్స్ వరకు తీవ్రంగా ఉంటున్నాయి. వీటిని తట్టుకోవడం చాలా కష్టం. మరి ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నవాళ్లకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. చిన్నపిల్లలకయితే వినికిడి సమస్యలు తలెత్తుతాయి. చెవిటివాళ్లుగా మారిపోనూవచ్చు. వృద్ధులకు గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
తలనొప్పులు, చిరాకు, నిద్రలేమి, గుండె దడ, ఏకాగ్రతలు కోల్పోతారు. అధికమైన శబ్దాలు శరీరంలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు విడుదలలై శరీరంలో షుగరు, బీపీ ఒక్కసారిగా పెరుగుతాయని, దుమ్ము, ధూళి, పొగతో కూడిన శబ్ద కాలుష్యంతో ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులున్నవారు తీవ్ర ఇబ్బందులు పడతారని, ఇటీవల డీజేల వల్ల తలెత్తిన సమస్యలతో వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో డీజే సౌండ్స్ వాడకూడదని బ్యాన్ చేసినప్పటికీ యథావిధిగా కొనసాగిస్తున్నారు.
సంప్రదాయం, సంస్కృతి అని చెబుతూ పర్యావరణానికి, మనుష్యుల జీవనానికి హాని కలిగించే ఈ విపరీత చర్యలను అరికట్టవలసి ఉంది. నిరుద్యోగులుగా ఉన్న యువత, ఉపాధి సరిగా లేక, సమాజంపై తీవ్ర అసంతృప్తితో తిరగబడుతున్న వాళ్లూ ఈ సందర్భాలను, తమ విచ్ఛలవిడితనాలకు ఉపయోగిస్తూ భక్తి ముసుగు తగిలిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో జరపాల్సిన ఉత్సవాలు, చివరికి వికృత చేష్టలతో, అరాచక విధానాలతో జరుగుతున్నాయి. భక్తి పేరున చందాలు వసూలు చేయడమూ పెరిగింది. రాత్రింబవళ్లు తాగి తందనాలా-డే ప్రదేశాలుగా వీటిని మార్చడం, కొన్నిచోట్ల అశ్లీలతలు చోటు చేసుకోవటం మనం గమనిస్తూనే ఉన్నాము. వీటన్నింటిని ప్రోత్సహిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే శక్తులు కూడా ఇందుకు దోహద పడుతున్నాయి. ఏ ఉత్సవమైనా మానవ సమూహానికి హానికరం కారాదు. మట్టి విగ్రహాలని, చిన్న విగ్రహాలని వాడాలని పర్యావరణవేత్తలు ఎంతచెప్పినా పెడచెవిన పెడుతున్నారు. శబ్ద, వాయు, నీటి కాలుష్యాలను అరికట్టాల్సిన బాధ్యత అవసరం ప్రభుత్వంపైనా, సమాజంపైనా ఉందన్నది గుర్తెరగాలి. ఉత్సవాలు ఆనందాన్ని నింపాలి. దుఃఖాల్ని కాదు.
గుండె గుభేల్
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 3 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)