పేదల భూముల విషయంలో తొందరపాటు చర్యలు వద్దు: భూక్యా జాన్సన్ నాయక్
నవతెలంగాణ-జన్నారం
జన్నారం మండలం మురిమడుగు గ్రామంలో అటవీశాఖ ఏర్పాటు చేస్తున్న ట్రెంచ్‌ల హద్దుల వివాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులను బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏళ్లుగా గ్రామంలో నివాసం ఉంటూ తమ జీవనాధారమైన భూముల్లో సాగు చేసుకుంటున్న పేదలు, రైతు కుటుంబాలకు అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అటవీ భూముల హద్దుల పేరుతో జేసీబీల ద్వారా ట్రెంచ్‌లు ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ పేదలు, రైతుల జీవనాధారమైన భూముల విషయంలో అధికారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఏళ్లుగా అక్కడే నివసిస్తూ వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబాల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరారు. చట్టపరమైన ప్రక్రియను పూర్తిగా పాటించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులను కోరారు. గ్రామస్తుల హక్కులు, జీవనాధారాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని జాన్సన్ నాయక్ తెలిపారు. మురిమడుగు గ్రామస్తుల సమస్య పరిష్కారమయ్యే వరకు వారి తరఫున చట్టబద్ధంగా పోరాడుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ వినయ్ కుమార్ కాజాల్ ఖాన్, సాయి ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)