Magazines

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమించాలి

2 గంటల క్రితం

sattupally
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం


- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ 

- మండల కమిటీ ఆధ్వర్యంలో అయిలమ్మ జయంతి వేడుక 

నవతెలంగాణ-సత్తుపల్లి 

​తెలంగాణ వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు సాగించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం సత్తుపల్లిలోని ప్రజా సంఘాల కార్యాలయంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ... నాడు భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఐలమ్మ సాగించిన వీరోచిత పోరాటం తెలంగాణ ప్రజా ఉద్యమాలకు దార్శనికతను, గొప్ప స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పేదలు, రైతులు, వ్యవసాయ కూలీల హక్కుల కోసం ఆమె పోరాడారని గుర్తుచేశారు.


​ఐలమ్మ పోరాటం కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని, అణగారిన వర్గాల ఆత్మగౌరవం, భూమి, జీవన హక్కుల కోసం సాగిన సమష్టి పోరాటమని పేర్కొన్నారు. సామాజిక అన్యాయాలపై మహిళలు సైతం విప్లవాత్మకంగా పోరాడగలరని ఐలమ్మ తన జీవితంతో నిరూపించారన్నారు. నేటికీ సమాజంలో పేదలు అనేక తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి పేదవానికి ఇళ్ల స్థలాలు, ఉపాధి అవకాశాలు, సాగు భూమి, పింఛన్ల పంపిణీ వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలను ఐక్యం చేసి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఐలమ్మ ఆశయ సాధనకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని ఆయన కోరారు.


​ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు, బండి వేలాద్రి, కావూరి వెంకటేశ్వరరావు, రాములు, రామకృష్ణ, ఆంజనేయులు, బాలస్వామి, రాము, లక్ష్మి, విజయ్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్