నవతెలంగాణ-మల్హర్ రావు
వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన బొడ్డెమ్మ వేడుకలు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో మహాలయ బహుళ పంచమి గురువారం పెత్తర అమావాస్యకు ముందు ప్రారంభమవుతాయి. బొడ్డెమ్మ ఆటలతో పల్లెల్లో కన్నె పిల్లల సంబరాలు ప్రారంభమయ్యాయి. బొడ్డెమ్మల సందడితో గ్రామాల్లో సందడి కనువిందు చేస్తుంది. గౌరీదేవి రూపంగా పూజించే బొడ్డెమ్మను 1)పీఠ బొడ్డెమ్మ, 2)గుంట బొడ్డెమ్మ ,3) పందిరి బొడ్డెమ్మ, 4) బాయి బొడ్డెమ్మ,5)అంతరాల బొడ్డెమ్మగా ఐదు రకాలుగా కొలుస్తారు బొడ్డెమ్మను తీరొక్క పూలతో పూజించి తొమ్మిది రోజుల తర్వాత చెరువు, బావుల్లో నిమజ్జనం చేస్తారు.పాలు నీళ్లు పసుపు కుంకుమతో పుట్టమన్నుకు వెళతారు. కన్నెపిల్లలు ఉదయాన్నే లేచి శుభ్రంగా కొత్త బట్టలు ధరించి పాలు నీళ్లు పసుపు కుంకుమ పువ్వులు తీసుకుని పుట్ట దగ్గరికి చేరుకొని పాలు నీళ్లు చల్లి పసుపు కుంకుమ సమర్పించి పూలతో పుట్టను పూజించి అలంకరించి భక్తిశ్రద్ధలతో అన్నదమ్ముల సహాయంతో పుట్ట మన్నును తవ్వుకొని తీసుకొస్తారు.
ఆ తర్వాత ఒక చెక్క పీట పై మూడు లేదా ఐదు లేదా తొమ్మిది దొంతరులు(మెట్లు, అరలు)గా బొడ్డెమ్మను తయారు చేస్తారు.ఎర్ర మట్టితో రాదిచ్చి(అలికి) పసుపు కుంకుమలతో రంగురంగుల బొట్లు పెట్టి తీరొక్క పూలతో అలంకరించి శిఖరం పైన ప్రదేశంలో ఒక కలశాన్ని పెట్టి బియ్యం పోసి కొత్త వస్త్రం తమలపాకులతో అలంకరించి పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఇంటి ముందు వాకిలిలో అలికి ముగ్గులు వేస్తారు.లేదా గ్రామాల్లో దేవాలయం ప్రాంగణంలో ప్రధాన కూడళ్ల వద్ద అలంకరించిన బొడ్డెమ్మను పెట్టి చిన్న, కన్నె పిల్లలు మహిళలు బొడ్డెమ్మ చుట్టూ చేరి తిరుగుతూ తమ ఆటపాటలతో పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ భక్తిశ్రద్ధలతో గౌరమ్మను పిలుస్తారు పూజిస్తారు.
బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్.. బిడ్డ లెందారే కోల్.. అంటూ బొడ్డెమ్మ బిడ్డ పేరు నీల గౌరూ ఆమె నిత్య మల్లె చెట్టు పెట్టి నిత్యం నీళ్లు పోసేదట అని బొడ్డెమ్మ చుట్టూరా తిరుగుతూ పాడుకుంటూ ఉంటారు. ఎంగిలిపూల బతుకమ్మకు ఒక రోజు ముందు వరకు ఈ వేడుకలు కొనసాగిస్తారు. తొమ్మిది రోజులు భక్తి శ్రద్దలతో పూజించి చతుర్దశి నాడు సాయంత్రం యధావిధిగా బొడ్డెమ్మను పూజించి పాటలు పాడి ప్రతిరోజు వేసిన బియ్యాన్ని ప్రసాదంగా వండి నైవేద్యం సమర్పించి తర్వాత అలికి అలంకరించిన బొడ్డెమ్మను తొమ్మిది రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకొని చివరి రోజు చెరువులో లేదా బావుల్లో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం తర్వాత వచ్చే అమావాస్యను పితృ అమావాస్యగా పిలుస్తారు. ఆ రోజు పెద్దలకు బియ్యం ఇస్తారని ప్రజల నమ్మకం.






కామెంట్‌లు (0)