Magazines

ఇదేనా డబుల్‌ ఇంజిన్‌ అభివృద్ధి?

55 నిమిషాల క్రితం

'double-engine'
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 2 నిమిషాల చదవడం

యూపీలో రూ.88 కోట్ల ఫ్లైఓవర్‌పై భారీ గుంత
మూడు రోజుల వర్షానికే రోడ్డుకింద సొరంగం తరహా ఖాళీ
వాహనదారుల్లో ఆందోళన.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌


లక్నో : బీజేపీ గొప్పగా చెప్పుకునే డబుల్‌ ఇంజిన్‌ సర్కారులున్న రాష్ట్రాల్లో అభివృద్ధి మేడిపండు చందంగా ఉంది. నాణ్యతకు రాజీ పడుతూ ప్రజల భద్రతను గాలికొదిలేస్తున్నాయి బీజేపీ ప్రభుత్వాలు. ఇందుకు యూపీలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ రూ.88 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లైఓవర్‌పై మూడు రోజుల భారీ వర్షానికే సొరంగాన్ని తలపించే భారీ గుంత ఏర్పడటం కలకలం రేపింది. రైల్వే మార్గంపై నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ రోడ్డుకింద మట్టి కుంగిపోవడంతో పెద్ద ఖాళీ ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో బీజేపీ పాలనతో అభివృద్ధి పనుల్లో నాణ్యతలేమి, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ రాజీ ధోరణి, ప్రజా ధనం దుర్వినియోగం సుస్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహ్రాయిచ్‌ నుంచి ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారి 730పై ఈ ఫ్లైఓవర్‌ ఉంది. వరుసగా మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షాల తర్వాత రోడ్డుపై ఈ సమస్య బయటపడింది. ఫ్లైఓవర్‌ మీదుగా నిత్యం వాహనాలు, పాదచారులు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమైంది.

ప్రమాదాన్ని గుర్తించిన ఓ వ్యక్తి వెంటనే అక్కడ ఓ చెక్క ముక్కకు ఎర్రచొక్కా కట్టి హెచ్చరికగా ఉంచాడు. దీంతో వాహనదారులు, పాదచారులు అప్రమత్తమయ్యారు. అనంతరం ఈ దృశ్యాలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.వర్షపు నీరు రోడ్డుకిందకు వెళ్లడంతోనే మట్టి కుంగిపోయిందని నిర్మాణ సంస్థ తెలిపింది. విజయ్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ చీఫ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఆశిష్‌ మాట్లాడుతూ.. భారీ వర్షాలకు ముందు ఆ ప్రాంతంలో చిన్న పగులు కనిపించిందన్నారు. వరుసగా మూడు రోజులు వర్షం కురవడంతో ఆ పగులు ద్వారా నీరు లోపలికి వెళ్లి, రోడ్డుకింద ఉన్న మట్టి కుంగిపోయిందని వివరించారు. ప్రభావిత ప్రాంతం సుమారు వంద మీటర్ల మేర ఉందనీ, అయితే ముందుజాగ్రత్తగా మరమ్మతులు చేపడుతున్నామని తెలిపారు. సమాచారం అందిన వెంటనే జాతీయ రహదారుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మరమ్మతులు ప్రారంభించారు. అయితే రూ.88 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఫ్లైఓవర్‌పై భారీ వర్షాల అనంతరం ఇంత పెద్ద ఖాళీ ఏర్పడటంపై నాణ్యత, నిర్మాణ పర్యవేక్షణ, నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్