Magazines

‌సీఈసీపై దేశ‌వ్యాప్త పోరు

1 గంట క్రితం

Nationwide struggle against the CEC
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 4 నిమిషాల చదవడం


2 నుంచి 8 వ‌ర‌కు అన్ని జిల్లాల్లో ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ పాద‌యాత్ర‌లు

ఈనెల రెండో వారంలో రాష్ట్రప‌తికి విన‌తి..
దేశ‌వ్యాప్తంగా ఐదు భారీ బ‌హిరంగ స‌భ‌లు.. నవంబర్ 1న ఢిల్లీలో భారీ ర్యాలీ

6న ఈసీ కార్యాలయానికి ఎంపీల సంయుక్త మార్చ్‌

సుప్రీంకోర్టులో ఉన్న ‘సర్‌’ కేసుల‌న్నీ పరిష్క‌రించాలి :ఇండియా బ్లాక్ స‌మావేశంలో నిర్ణ‌యం


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మోడీ ప్రభుత్వ కీలుబొమ్మగా ఎన్నికల వ్యవస్థను దెబ్బతీస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళ‌నకు ఇండియా బ్లాక్‌ పిలుపునిచ్చింది. ఈనెల 6న ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయానికి ప్రతిపక్ష ఎంపీలు సంయుక్త మార్చ్ చేప‌ట్ట‌నున్నారు. 2 నుంచి 8 వరకు అన్ని జిల్లాల్లో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ (సేవ్ డెమోక్రసీ)’ పాదయాత్రలు నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబర్ రెండో వారంలో ప్రతిపక్ష నాయకులు రాష్ట్రపతిని కలిసి 'ఓట్ల దొంగతనం'తో సహా పలు అంశాలపై చర్చించ‌నున్నారు. బుధవారం నాడిక్క‌డ‌ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఇండియా బ్లాక్‌ సమావేశం జ‌రిగింది. సుమారు మూడున్నర గంటలపాటు జ‌రిగిన ఈ స‌మావేశంలో ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై అన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ‘ఓటు చోరీ’, ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌పై చ‌ర్చించి, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించాయి. దేశంలోని ఐదు ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఐదు భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించాల‌ని, నవంబర్ 1న ఢిల్లీలో ఒక భారీ ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీని నిర్వహించాలని ఇండియా బ్లాక్ స‌మావేశం నిర్ణయించింది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ‘సర్‌’, ఎన్నిక‌ల వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన అన్ని పిటిషన్లను సకాలంలో పరిష్కరించాలని డిమాండ్ చేసింది. 2027లో ఐదు ప్రధాన రాష్ట్రాల్లో కీలక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒక్క ఓటరు హక్కు కూడా ఉల్లంఘ‌న‌కు గురికాకుండా చూసేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడాలని ఇండియా బ్లాక్ పిలుపునిచ్చింది. భవిష్యత్‌ ఎన్నికలకు ‘సర్‌’ర్‌కు ముందు ఉన్న ఓటర్ల జాబితాను ఉపయోగించాలని ఇండియా బ్లాక్ నేత‌లు డిమాండ్‌ చేశారు.


దేశం ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటోంది : 
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
దేశం ఒక అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఫాసిస్టు సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రణలో ఉన్న బీజేపీని ఒక సాధారణ రాజకీయ పార్టీగా పరిగణించకూడదు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ సహాయంతో దేశంలోని మొత్తం ఎన్నికల వ్యవస్థను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. జ్ఞానే‌శ్‌కుమార్ జోక్యాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో చిన్న, పెద్ద సంస్థలు ఏకమై పెద్ద ఎత్తున ఆత్మరక్షణకు సిద్ధంగా ఉండాలి. రాజకీయ పార్టీలతో పాటు, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న సామాజిక, మానవ హక్కుల కార్యకర్తలు, కళాకారులు, మేధావుల మద్దతు కూడా కోరాలి. ఆందోళన కార్యక్రమాలను నియంత్రించడానికి కేంద్రీకృత వ్యవస్థతో పాటు, పార్టీల మధ్య సమన్వయం కోసం ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలి. ప్రతిపక్ష నాయకులు రాష్ట్రపతిని కలిసి ఈ అంశాలతో సహా పలు విషయాలపై చర్చించాలి’ అని అన్నారు.


ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్యపోరాటాలకే ప్రథమ ప్రాధాన్యత : 
మమతా బెనర్జీ
ఆత్మరక్షణ కోసం విస్తృత కూటమిని ఏర్పాటు చేయాలన్న ఎంఎ బేబీ వైఖరితో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీ చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్య పోరాటాలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల‌ని, తాను, త‌న‌ పార్టీ ఎలాంటి అహం లేకుండా ఐక్య పోరాటాలకు అండగా నిలుస్తామ‌ని తెలిపారు. కాంగ్రెస్ తదుపరి ప్రధానమంత్రి కావాలనుకుంటే, దానిని ఎవరూ వ్యతిరేకించరని అన్నారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తోందని బదులిచ్చారు.

భారత ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ఇండియా బ్లాక్ నాయకులు వ్యక్తిగతంగా కట్టుబడి ఉన్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత‌ రాహుల్ గాంధీ

‘సర్‌’ను రద్దు చేయాలి : మల్లికార్జున ఖర్గే
ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌ పేపర్లను వినియోగించాలని ఇండియా బ్లాక్‌ నేతలు డిమాండ్‌ చేశార‌ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. స‌మావేశం అనంత‌రం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ సీఈసీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్‌) వల్ల దాదాపు 13.3 కోట్ల మంది ఓటర్లు‌ తమ ఓటుహక్కు కోల్పోయారని, ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని అన్నారు. ఈ ప్రక్రియను రద్దు చేసి పాత ఓటర్ల జాబితానే కొనసాగించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత స్థానంలో రహస్య విధానాన్ని అనుమతించబోమని చెప్పారు. ‘ఒక్క వ్యక్తి-ఒక్క ఓటు-ఒక్క విలువ’ అనే ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం బలహీనపడకూడదని పేర్కొన్నారు.


దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి : రాహుల్‌‌గాంధీ
భారత ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు ఇండియా బ్లాక్ నాయకులు వ్యక్తిగతంగా కట్టుబడి ఉన్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత‌ రాహుల్ గాంధీ అన్నారు. దేశ‌ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని నాయకులందరూ కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘వారు ఎంత పెద్ద వారైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్న‌ వారైనా.. వారి కంటే దేశ ప్రజాస్వామ్యం గొప్పది’ అని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి జరుగుతోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నారని ఇండియా బ్లాక్‌ నేతల సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైందని తెలిపారు. ప్రతిపక్ష నేతలంతా రాజ్యాంగానికి సమష్టి రక్షకులుగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ సమావేశంలో సుమారు 19 పార్టీలకు చెందిన నాయకులు, ఎం‌పీలు హాజరయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జైరాం రమేష్, కెసి వేణుగోపాల్ (కాంగ్రెస్), జాన్ బ్రిట్టాస్ (సీపీఐ(ఎం)), పి సంతోష్ కుమార్ (సీపీఐ), దీపాంకర్ భట్టాచార్య, రవి రాయ్ (సీపీఐ ఎంఎల్), జోస్ కె మణి (కేరళం కాంగ్రెస్-ఎం), తేజస్వి యాదవ్ (ఆర్జేడీ), హరేంద్ర సింగ్‌ మాలిక్ (సీపీఎస్‌‌పీ-సీపీ), ఒమ‌ర్‌ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), వైకో (ఎండీఎంకె), ఎన్‌.కె ప్రేమచంద్రన్ (ఆర్ఎస్‌పీ), సాదిఖలీ షిహాబ్ తంగల్ (ముస్లిం లీగ్), తిరుమావళవన్ (విసికె), జి. దేవరాజన్ (ఫార్వర్డ్ బ్లాక్), అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఒబ్రెయిన్‌ (తృణమూల్ కాంగ్రెస్), ఫ్రాన్సిస్ జార్జ్ (కేరళం కాంగ్రెస్ జోసెఫ్), సీనియర్ న్యాయవాది, స్వతంత్ర ఎంపి కపిల్ సిబల్ తదితరులు పాల్గొన్నారు. శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే, జెఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ కూడా ఆన్‌లైన్‌లో సభను ఉద్దేశించి ప్రసంగించారు.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్