Magazines

‌మా భూములను సర్వేనెంబర్‌ 325లో కలిపారు

55 నిమిషాల క్రితం

Our lands were merged into Survey Number 325.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 2 నిమిషాల చదవడం

ఎర్రవల్లిలో ధరణి పేరిట రికార్డులు తారుమారు
సర్వే చేసి మా భూములు ఇప్పించండి పొంగులేటికి శివారు వెంకటాపూర్‌‌ గ్రామస్తుల వేడుకోలు
భూసమస్యపై సమగ్ర విచారణకు హామీ రికార్డులు, గ్రామనక్షా, క్షేత్రస్థాయి సర్వేతో వాస్తవాలు తేలుస్తాం : మంత్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని ‌మర్కూక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామ రైతులకు న్యాయం చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్‌లో రికార్డుల మార్పులతో తమ తాత, ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను ఎర్రవల్లిలోని 325 సర్వేనెంబర్‌‌లో కలిపారని వివరించారు. సర్వే చేసి తమ భూములను తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌‌లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డిని శివారు వెంకటాపూర్‌ ‌గ్రామస్తులు కలిసి విన్నవించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి అర్హులైన వారికి న్యాయం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శివారు వెంకటాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్లు 38, 41, 47, 85, 88, 100లోని దాదాపు 134 ఎకరాల వ్యవసాయ భూముల్లో వారి తాత, ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రికార్డులను తారుమారు చేయడం ద్వారా తమ భూములపై హక్కులు లేకుండా చేశారనీ, తమ పొలాలు తమకు కాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి అమలుకు ముందు తమ వద్ద ఉన్న పాస్‌బుక్కులు, గ్రామ నక్షా పటాలను కూడా రైతులు మంత్రికి చూపించారు. ఆనాటి ప్ర‌భుత్వంలో అధికారులు కొత్త పాస్‌బుక్కులు ఇస్తామని చెప్పి తమ వద్ద ఉన్న పాత పాస్‌బుక్కులను తీసుకున్నారనీ, కొత్త పాస్‌బుక్కులు ఇవ్వకుండా తమను మోసం చేశారని వారు మంత్రికి వివరించారు. నాటి ప్రభుత్వ హయాంలో ఓవర్ మ్యాపింగ్ పేరుతో శివారు వెంకటాపూర్ గ్రామ వ్యవసాయ భూములను ఎర్రవెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 325లో కలిపి నక్షా రూపొందించారని తెలిపారు. దీనివల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందని రైతులు వాపోయారు. శివారు వెంకటాపూర్‌‌లోనూ సర్వే జరపాలి ప్రస్తుతం ఎర్రవెల్లిలోని సర్వే నెంబర్ 325లో ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే తరహాలోనే శివారు వెంకటాపూర్ గ్రామంలోనూ సమగ్ర సర్వే నిర్వహించాలని గ్రామస్తులు మంత్రిని కోరారు. గ్రామ సరిహద్దులను స్పష్టంగా గుర్తించి, రికార్డులు–పాత పాస్‌బుక్కులు–గ్రామ నక్షా–క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి ఎవరికి చెందిన భూమి వారికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన శివారు వెంకటాపూర్ గ్రామ రైతులకు ఇప్పటివరకు ఎలాంటి పరిహారం అందలేదని వివరించారు. దేవాసుకుంట, ముత్తిలింగం కుంటలను కూడా పాండురంగా రిజర్వాయర్‌లో విలీనం చేశారని తెలిపారు. రిజర్వాయర్ నిర్మాణం, భూముల మ్యాపింగ్, రికార్డుల మార్పుల కారణంగా తమ గ్రామ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ​అర్హులకు అన్యాయం జరగనివ్వం : పొంగులేటి రైతుల సమస్యలను విన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలను నిర్ధారిస్తామని స్పష్టం చేశారు. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వబోమనీ, ఎవరి భూమి వారికి దక్కేలా చట్టపరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేశ్‌ కుమార్, స‌ర్వే, ల్యాండ్ సెటిల్‌మెంట్స్ క‌మిష‌న‌ర్ రాజీవ్‌గాంధీ హ‌నుమంతు, శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన తుమ్మల సత్యనారాయణ, శేరి పోషయ్య, శేరి శ్రీకాంత్, పుట్ట విఠల్, పుట్ట దయానంద్, బచ్చలి జహంగీర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్