400 ఓట్ల ఆధిక్యంలో ప్రెసిడెంట్ అభ్యర్థి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం(హెచ్.సీ.యూ)లో మంగళవారం జరిగిన విద్యార్థి సంఘాల ఎన్నికల ఫలితాల్లో ఎస్ఎఫ్ఐ భాగస్వామిగా ఉన్న కూటమి ముందుంజలో ఉంది. మొత్తం 47 రౌండ్ల ఓట్ల లెక్కింపునకు గానూ 35 రౌండ్లు పూర్తయ్యే సమయానికి అధ్యక్షుడి పోస్టుకు ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి దిల్‌షదా సమీప ఏబీవీపీ కూటమి అభ్యర్థి కంటే 370 నుంచి 400 వరకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ పోస్టుకు సంబంధించి మరో 12 రౌండ్లలో ఓట్లను లెక్కించాల్సి ఉంది. అదే విధంగా ప్రధాన కార్యదర్శి పోస్టులోనూ ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి ప్రతీక్ సమీప ఏబీవీపీ కూటమి అభ్యర్థిపై 130 ఓట్ల లీడ్ లో కొనసాగుతున్నారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీ, కల్చరల్ సెక్రెటరీ, స్పోర్ట్స్ సెక్రెటరీ తదితర పోస్టుల కోసం ఏఐఎస్ఏ, ఏఎస్ఏ, డీఎస్ యూ, ఎస్ఎఫ్ఐ, టీఎస్ఎఫ్ ఒక కూటమిగా బరిలో దిగింది. ఏబీవీపీ ఎస్ఎల్వీడీతో జత కట్టింది. మరో వైపు పీడీఎస్ యూ, ఎంఎస్ఎఫ్, ఫ్రాటర్నిటీ, ఎన్ఎస్ఐయూ మరో కూటమిగా పోటీలో నిలిచాయి. ప్రధాన పోటీ ఎస్ఎఫ్ఐ కూటమికి, ఏబీవీపీ కూటమికి మధ్య కొనసాగుతోంది. 30వ రౌండ్ పూర్తయ్యే సరికి ఉపాధ్యక్ష పదవికి ఏబీవీపీ అభ్యర్థి ఒక ఓటుతో, జాయింట్ సెక్రెటరీ పదవికి ఏఐఎస్ఏ అభ్యర్థి 1,315 ఓట్లతో, 20వ రౌండ్ పూర్తయ్యే సరికి కల్చరల్ సెక్రెటరీ పదవికి ఏబీవీపీ కూటమి అభ్యర్థి 864 ఓట్లతో, స్పోర్ట్స్ సెక్రెటరీ పదవి కోసం పోటీ పడిన ఏబీవీపీ అభ్యర్థి 883 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. ప్రెసిడెంట్ పోస్టుకు 12 రౌండ్లు లెక్కించాల్సి ఉండగా, మిగిలిన పోస్టులకు 27 రౌండ్లు లెక్చించాల్సి ఉంది.







కామెంట్‌లు (0)