నవతెలంగాణ - హైదరాబాద్ : ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ నేపథ్యంలో ‘ఇండియా’ కూటమి నేడు ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో ఎన్నికల సంఘం, ఎస్‌ఐఆర్ అంశాలపై ఉమ్మడి కార్యాచరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో సుమారు 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ సంఖ్య, తొలగింపులపై ప్రతిపక్షాల వాదనలు వివాదాస్పదంగా ఉన్నాయి. ఎన్నికల కమిషన్‌లోని అంతర్గత విభేదాలకు సంబంధించిన మీడియా కథనాలు కూడా ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేశాయి. ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, తొలగించిన పేర్లను పునరుద్ధరించాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలపై కూటమి ఉమ్మడి పోరాట కార్యాచరణను ఖరారు చేయనుంది.
పార్లమెంటులో సీఈసీని తొలగించే ప్రక్రియకు సంబంధించిన కొత్త నోటీసు, దేశవ్యాప్త ఆందోళనలపై కూడా చర్చించే అవకాశం ఉంది. సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు, సమాజ్‌వాదీ పార్టీ, వామపక్షాలు, ఎన్‌సీపీ (ఎస్‌పీ), శివసేన (యూబీటీ) తదితర పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు.






కామెంట్‌లు (0)