నవతెలంగాణ-హైదరాబాద్: లైక్స్, వ్యూస్ కోసం సోషల్ మీడియాలో ఇంట్లోని బంగారం, నగదు, ఖరీదైన వస్తువులను చూపించడం ఎంత ప్రమాదకరమో తమిళనాడులో జరిగిన ఓ చోరీ హెచ్చరిస్తోంది. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ సమీపంలోని తమ్మట్టుకొణంలో యూట్యూబర్ దంపతుల ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, వజ్రాభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి. వీటి విలువ దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది.
వ్యాపారి కమ్ యూట్యూబర్ వినోద్‌కుమార్, యూట్యూబర్ మధుమిత దంపతులు గురువారం సాయంత్రం కుటుంబంతో కలిసి బయటకు వెళ్లారు. రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి వెనుక తలుపు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. బెడ్‌రూమ్‌లోని బీరువాను కూడా ధ్వంసం చేసి అందులోని విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు.
ఇదిలా ఉండగా .... మధుమిత గతంలో సోషల్ మీడియాలో బంగారు ఆభరణాలు, నగదు కట్టలను చూపిస్తూ పలు వీడియోలు పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లోని బంగారం, నగదు చూపించడంతోపాటు కుటుంబం ఎక్కడికి వెళ్తోంది, బంగారం కొనుగోలు చేస్తున్న విషయాలను కూడా పోస్టుల్లో పంచుకున్నారు. దీంతో సోషల్ మీడియా పోస్టులకు ఈ చోరీతో ఏమైనా సంబంధం ఉందా ? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటి వెనుక తలుపును కట్టింగ్ మెషీన్‌తో తెరిచి దొంగలు ప్రవేశించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ రికార్డులను పరిశీలిస్తున్న పోలీసులు.. దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
లైక్స్, వ్యూస్ కోసం మన ఇంటి వివరాలు, విలువైన వస్తువులు, ప్రయాణ సమాచారాన్ని బహిరంగంగా పంచుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారం ఎవరి కళ్లలో పడుతుందో, ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు కదా మరి..!






కామెంట్‌లు (0)