Magazines

ట్రంప్‌‌నకు ‘మధ్యంతర’ పరీక్ష!

1 గంట క్రితం

Trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026 | 5 నిమిషాల చదవడం

ఎలాంటి అక్రమాలు జరగకపోతే, వెలువడిన సర్వేల మేరకు డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీ మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో కొన్ని సర్వేలు బొక్కబోర్లా పడ్డాయి గనుక కొన్ని చోట్ల భిన్న ఫలితాలు రావచ్చు. ఇజ్రాయిల్ ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు నాయకత్వంలోని లికుడ్ పార్టీ కూటమికి సంపూర్ణ మెజారిటీకి అవసరమైన 61 స్థానాలకు గాను 53 మాత్రమే వచ్చాయి. నెతన్యాహుకు రాజకీయంగా మద్దతుగా నిలిచిన ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీకి కూడా ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు పరీక్షగా మారాయి. నవంబరు 3న జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌లోని మొత్తం 435 స్థానాలకు, ఎగువ సభ సెనెట్‌లో వందకు గాను 33 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. భారతీయ కాలమానం ప్రకారం నవంబరు 4వ తేదీ ఉదయం వరకు వివిధ ప్రాంతాల్లో పోలింగ్ పూర్తవుతుంది. ముందుగానే ఓట్లు వేసే అవకాశం ఉండటంతో సోమవారం నాటికి ఆరు కోట్లకు పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు.

గత ఎన్నికలతో పోలిస్తే ముందస్తు ఓటింగ్ గణనీయంగా పెరిగింది. ప్రజాప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తారని ప్రధాన సర్వేలన్నీ వివిధ తేడాలతో వెల్లడించాయి. సెనెట్‌లో కూడా మెజారిటీ రావచ్చని కొన్ని చెబుతుండగా, మరికొన్ని చోట్ల తీవ్ర పోటీ ఉన్నందున చెప్పలేమని పేర్కొన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో రిపబ్లికన్లకు 218, డెమోక్రాట్లకు 214 స్థానాలున్నాయి. ఉన్న స్థానాలను నిలబెట్టుకొని అదనంగా నాలుగు సాధిస్తే డెమోక్రాట్లకు మెజారిటీ వస్తుంది. సెనెట్‌లో రిపబ్లికన్లకు 53, డెమోక్రాట్లకు 45, వారికి మద్దతుగా ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు. అక్కడ మెజారిటీ సాధించాలంటే డెమోక్రాట్లు అదనంగా నాలుగు స్థానాలు గెలుచుకోవాలి. అమెరికాలో కూడా మన దేశంలో మాదిరిగానే కుహనా సర్వే సంస్థలు రంగంలోకి దిగి ఓటర్లను గందరగోళానికి గురిచేశాయి.

న్యూయార్క్ టైమ్స్ వంటి అగ్రశ్రేణి మీడియా సంస్థలు సైతం కొన్ని తప్పుడు సర్వేలను నమ్మి చేతులు కాల్చుకున్నాయి. రెండు పార్టీల తరఫున తప్పుడు సర్వేలు వెలువడుతున్నాయని అనేక మంది అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. అమెరికాలో ఇటువంటి సర్వే సంస్థలపై చర్య తీసుకొనేందుకు ప్రత్యేక చట్టాలు లేకపోవటం సమస్యగా మారింది. అమెరికాలో ఓటు హక్కు కలిగిన వారు తమ పేర్లను నమోదు చేయించుకోవాలి. మొత్తం 25 కోట్ల మందికి ఓటు హక్కు ఉండగా, 21 కోట్లకు పైగా నమోదు చేసుకున్నట్లు వివిధ సమాచారం పేర్కొంటు న్నది. ముందస్తు ఓటింగ్‌తో పాటు మెయిల్ ద్వారా కూడా ఓట్లు వేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పార్టీలు ఖర్చు చేస్తున్నాయి. రెండు పార్టీల తరఫున సుమారు 1,160 కోట్ల డాలర్లు ఖర్చవుతున్నట్లు అంచనా. ఎలన్ మస్క్ వంటి బడా కార్పొరేట్లు రిపబ్లికన్ పార్టీకి భారీగా విరాళాలు అందించారు. టెక్సాస్ సెనెట్ సీటు కోసం కూడా వందల కోట్ల డాలర్ల స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

సంపన్నుల డబ్బు ఎన్నికల ప్రచారాన్ని శాసిస్తున్నది. ఎన్నికల ప్రచారంలో ఖర్చు కూడా ఈ పోటీ తీవ్రతను తెలియజేస్తోంది. ఇరు పార్టీలూ కలిపి సుమారు 11.6 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు అంచనాలు వెలువడ్డాయి. రిపబ్లికన్లకు మద్దతుగా ఎలాన్ మస్క్ 450 మిలియన్ డాలర్ల వరకు విరాళాలు ఇచ్చినట్లు ప్రచారంలో ప్రస్తావన వచ్చింది. టెక్సాస్ సెనేట్ పోటీలోనే సుమారు 500 మిలియన్ డాలర్ల ఖర్చు నమోదైందని చెబుతున్నారు. మరోవైపు, ఓటర్ల అభిప్రాయాలను ప్రతిబింబించాల్సిన సర్వేలు కూడా రాజకీయ ప్రచారానికి ఆయుధాలుగా మారుతున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. తప్పుడు సర్వేలు, నిరాధార ప్రచారం ఓటర్లను గందరగోళానికి గురిచేస్తాయి. అమెరికాలోనూ ఇలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నా, ఆచరణలో కఠిన నియంత్రణ కనిపించడం లేదు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత ముఖ్యమో, ఆ ఓటును ప్రభావితం చేసే సమాచార నిజాయితీ కూడా అంతే ముఖ్యం. వాషింగ్టన్ పోస్ట్ అధ్యయనం ప్రకారం, ట్రంప్ తొలి పదవీకాలంలో రోజుకు సగటున 21 తప్పుడు వాదనలు చేశారు. అమెరికా అధ్యక్షులలో డోనాల్డ్ ట్రంప్‌ను మించిన అబద్ధాలకోరులేరు అన్న విమర్శ ఉంది.

వాషింగ్టన్ పోస్టు అధ్యయనం ప్రకారం తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లలో రోజుకు సగటున 21 అబద్ధాలు చెప్పాడు. తొలి సంవత్సరం రోజుకు ఆరు, తరువాతి మూడు సంవత్సరాల్లో వరుసగా 16, 22, 39 చొప్పున అబద్ధాలు చెప్పినట్లు తేలింది. 2020 నవంబరు రెండున ఏకంగా 503 అసత్యాలు వల్లించాడు. రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అదే ధోరణి కొనసాగుతున్నది. ఓటమి ఎదురైతే ఎలా వ్యవహరిస్తారనే దానిపై నవంబరు 2న ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డెమోక్రాట్లు కాంగ్రెస్‌లో మెజారిటీ సాధిస్తే తాను ‘మిస్టర్ వీటో’గా మారతానని, వారు పంపే బిల్లులన్నింటినీ వీటో చేస్తానని ప్రకటించాడు. కొంతకాలం తరువాత వారే తనతో ఒప్పందాలకు వస్తారని కూడా అన్నాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల సభ తీసుకొచ్చే నిర్ణయాలను అధ్యక్ష అధికారంతో అడ్డుకుంటాననే సంకేతాన్ని ఈ వ్యాఖ్యలు ఇచ్చాయి. ఈ ఏడాది మధ్యంతర ఎన్నికల్లో కొట్టొచ్చినట్లు కనిపించిన మరో అంశం రిపబ్లికన్ పార్టీ సాగిస్తున్న కమ్యూనిస్టు, ముస్లిం వ్యతిరేక ప్రచారం.

ఎరుపు-ఆకుపచ్చ కూటమి అంటూ డెమోక్రటిక్ పార్టీని చిత్రిం చారు. పురోగామి భావజాలం ఉన్న అభ్యర్థులను ముందుగానే కమ్యూ నిస్టులుగా ముద్రవేస్తున్నారు. ముస్లిం లైతే కొందరిని ఉగ్రవాదులుగా చిత్రించారు. మిషిగన్ రాష్ట్ర సెనెట్ డెమోక్రటిక్ అభ్యర్థి అబ్దుల్ ఎల్ సయద్‌ను కమ్యూనిస్టు, రాడికల్ వామపక్ష సోషలిస్టు, హింసాత్మక జీహాదీ అంటూ రిపబ్లికన్లు నిందిం చారు. సయద్ అభ్యర్థిగా ఎన్నికైన తరువాత ముస్లిం వ్యతిరేక ప్రచారం ఇరవై రెట్లు పెరిగిందని ఒక సంస్థ అధ్యయనం వెల్లడించింది. జూన్ ఒకటి నుంచి ఆగస్టు మూడు మధ్య రోజుకు సగటున 155 పోస్టులు ఉంటే, ఆగస్టు నాలుగు నుంచి పదవ తేదీ మధ్య రోజుకు 3,099 పోస్టులు నమోదయ్యాయి. జనవరి ఒకటి నుంచి 38,280 ముస్లిం వ్యతిరేక పోస్టులు వెలువడగా వాటిలో అత్యధికం సయద్‌ను లక్ష్యంగా చేసుకున్నవే. ఎక్స్ వేదిక ప్రధానంగా ఈ ప్రచారానికి ఉపయోగపడింది. అతను గెలిస్తే సెనెట్‌కు ఎన్నికైన తొలి ముస్లింగా చరిత్ర సృష్టిస్తాడు. ట్రంప్ అతన్ని జీహాదీ అంటూ దూషించటమే గాక, మెటల్ డిటెక్టర్‌తో పరీక్షించి సభలోకి పంపాల్సిన ఏకైక సెనెటర్ అవుతాడని నిందించాడు.

అందుకు సయద్, మీరంతా లై డిటెక్టర్ మీద కూర్చుంటే నేను మెటల్ డిటెక్టర్ నుంచి వెళ్లటానికి అభ్యంతరం లేదని తిప్పికొట్టాడు. సోమాలీ-అమెరికన్ల గురించి కూడా ట్రంప్ నోరు పారవేసు కున్నాడు. షరియా కుట్రదారుల నుంచి అమెరికా పార్లమెంటును విముక్తం చేయాలంటూ రిపబ్లికన్ నేతలు విషం వెళ్లగక్కారు. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారంలో భాగంగా గతంలో అమెరికా ప్రభుత్వమే డాక్యుమెంటరీలు నిర్మించి ప్రజల మెదళ్లను ఖరాబు చేసేందుకు చూసింది. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నది. అమెరికా విలువలకు కమ్యూనిస్టు, ముస్లిం అభ్యర్థుల నుంచి ముప్పు వచ్చిందని ఒక పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. బ్యాలెట్ పత్రాలపై జీహాదీలు, కమ్యూనిస్టులు తమ రంగులను దాచిపెట్టారని ట్రంప్ ఎన్నికల ప్రచార సభలో అన్నాడు. డెమోక్రటిక్ పార్టీని స్వయం ప్రకటిత కమ్యూనిస్టులు, ఇస్లామిస్టులు స్వాధీనం చేసుకున్నారని టెక్సాస్ రిపబ్లికన్ అభ్యర్థి టెడ్ క్రజ్ ఆరోపించాడు. కమ్యూనిజం-కామన్‌సెన్స్ మధ్య జరుగుతున్న పోరాటంగా స్పీకర్ మైక్ జాన్సన్ అభివర్ణించాడు. విధివైపరీత్యం (నమ్మేవారికి) ఏమిటంటే ఎంతగా సోషలి జం, కమ్యూనిజాలపై రిపబ్లికన్లు, వారికి మద్దతుగా మీడియా, ఇతర సంస్థలు విషం గక్కుతున్నాయో అంతగా అమెరికాలో ఆ భావజాలం పట్ల సానుకూలత పెరుగుతున్నది.

గాలప్ సంస్థ సర్వే ప్రకారం సోషలిజం పట్ల సానుకూలత 43 శాతానికి చేరింది. పెట్టుబడిదారీ విధానం పట్ల 55 శాతం, బడా వాణిజ్య సంస్థలపై 35 శాతం అనుకూలత ఉంది. గతంతో పోలిస్తే బడా వాణిజ్య సంస్థలు, స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడిదారీ విధానం పట్ల ఆదరణ తగ్గగా సోషలిజం పట్ల పెరిగింది. డెమోక్రాట్లలో సోషలిజం పట్ల సానుకూలత 50 నుంచి 66 శాతానికి, రాజకీయాలతో సంబంధం లేనివారిలో 37 నుంచి 45 శాతానికి పెరిగింది. రిపబ్లికన్లలో మాత్రం 15 శాతం వద్ద మార్పు లేదు. యువతలో సోషలిజం పట్ల 57 శాతం, పెట్టుబడిదారీ విధానం పట్ల 43 శాతం సానుకూలత ఉంది. 55 ఏళ్లు దాటినవారిలో పెట్టుబడిదారీ విధానానికి ఎక్కువ మద్దతు ఉంది. పురుషుల్లో ఎక్కువ మంది పెట్టుబడిదారీ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. ఏడాదికి లక్ష డాలర్లకు పైగా ఆదాయం ఉన్నవారు పెట్టుబడిదారీ విధానం వైపు, అంతకంటే తక్కువ ఆదాయం ఉన్నవారు సోషలిజం వైపు మొగ్గుచూపుతున్నారని సర్వే వెల్లడించింది. సర్వేలు వెల్లడించినట్లు డెమోక్రటిక్ పార్టీలోనే గాక రాజకీయాలతో నిమిత్తం లేనివారిలో కూడా సోషలిజం పట్ల సాను కూలత పెరుగుతున్నది. ఈ కారణంగానే డెమోక్రటిక్ పార్టీలో మితవాదులు, కమ్యూనిస్టు వ్యతిరేకులను పక్కకు నెట్టి ఉన్నంతలో పురోగామివాదులను అభ్యర్థులుగా ఎన్నుకుంటు న్నారు. వారందరినీ కమ్యూనిస్టులుగా చిత్రించి అడ్డుకోవాలని రిపబ్లికన్ పార్టీ చూస్తోంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా అడ్డుకోలేరో ఆర్థికంగా దిగజారుతున్నపుడు సమాజంలో పురోగామి శక్తుల పట్ల ఆదరణను రిపబ్లికన్లు, ట్రంపే కాదు, వారి బాబొచ్చినా ఆపలేరు!


ఎం. కోటేశ్వరరావు 8331013288

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్