పండగయినా పబ్బమయినా
యుద్ధమయినా, కరోనా రోగమయినా మేము వీధుల్లో
సదా సిద్ధంగా వుంటాం!
నరకంలాంటి నగర ట్రాఫిక్‌లో
ఈదుకుంటూ కస్టమర్లను
గమ్యం చేరుస్తుంటాం!
కోరిన కోర్కెలు తీర్చే మాంత్రికుడిలా
అడిగిన మరుక్షణం
పంచభక్ష్యపరమాన్నాలను
నోటికాడికి అందిస్తుంటాం!
కనబడని చెయ్యేదో ఆడించే నాటకంలో
కీలుబొమ్మల్లా మా ప్రమేయం లేకుండానే
పరుగులు తీస్తుంటాం!
కుల,మత,ప్రాంత,వయో బేధాల్లేకుండా నిరుద్యోగులు, చిరుద్యోగులు, విద్యార్థులు
మాలో అందరూ వుంటారు
అర్ధరాత్రి అపరాత్రి లేకుండా
చాకిరీ చేస్తుంటారు!
నగరం నిర్మానుష్యమైన వేళ
అందరూ నిద్రిస్తున్నా
మేము కండ్లలో ఒత్తులేసుకుని
కాల్ కోసం ఎదురుచూస్తుంటాం!
దేశం వెలిగిపోతోంది
అఛ్ఛేదిన్ వస్తాయి,
కోట్లాది ఉద్యోగాలిస్తామంటే,
మా చదువులకోసంపడ్డ కష్టం
ఫలిస్తుందని ఆశపడ్డాం!
కాని‘స్వయం ఉపాధి’ పేరిట
ఇలా రోడ్డున పడేసి
ఇరవైనాలుగు గంటలూ
చండుకు తింటారనుకో లేదు!
అంబానీ, అదానీలే కాదు
మేముమనుషులమే!
ఈ దేశ పౌరులమే!
ఈ దేశ సంపదలో మాకూ
సమాన వాటా వుందని
ఇప్పుడిప్పుడే ఉద్యమిస్తున్నాం!
విజయం సాధించేదాకా విశ్రమించం!!
- సత్య భాస్కర్,9848391638






కామెంట్‌లు (0)