Magazines

సీఎం సహా మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటించాలి

1 గంట క్రితం

ministers should visit the field level.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 3 నిమిషాల చదవడం

క్యాబినెట్‌లో కూర్చుంటే రైతుల కష్టాలు అర్థం కావు

ఎండిన పంటలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు

​కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షం నిర్వహించాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు

​నల్లగొండ జిల్లా చర్లపల్లిలో కరువు పరిస్థితులను పరిశీలించిన సీపీఐ(ఎం) బృందం
​నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

​ ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని కోరారు. నల్లగొండ జిల్లా నల్లగొండ పట్టణంలోని 14వ డివిజన్ చర్లపల్లిలో ఎండిపోయిన పంట పొలాలను గురువారం సీపీఐ(ఎం), రైతు సంఘం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం బివి. రాఘవులు మాట్లాడుతూ.. ‘‘చర్లపల్లి గ్రామంలో ప్రధానంగా వరి, పత్తి పంటలు సాగు చేశారు. వరిపంట పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని చోట్ల పంట పూర్తిగా ఎండిపోయింది. తాలు తప్ప గింజ కనిపించడం లేదు. మరో తడుపు నీరందితే పంట చేతికొచ్చేది. రైతులకు చివరికి పైసా కూడా చేతికి రాని పరిస్థితి ఏర్పడింది. చిన్న, సన్నకారు రైతులు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోతే వారి జీవితాలు ఎంత హృదయవిదారకంగా ఉంటాయో ఇక్కడి పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది” అని అన్నారు. పత్తి చేలు పైకి పచ్చగా కనిపిస్తున్నప్పటికీ ఆకులన్నీ వాడిపోయాయని, మరో వారం వర్షం లేకపోతే పత్తి పైర్లు కూడా పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందని రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పట్లో మళ్లీ వర్షాలు పడతాయనే గ్యారెంటీ కూడా లేదన్నారు.

క్యాబినెట్‌లో చర్చిస్తే రైతుల వాస్తవ పరిస్థితులు అర్థం కావు..

“రాష్ట్రంలో ఎల్‌‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై చర్చించేందుకు క్యాబినెట్ సమావేశం కానున్నట్టు పత్రికల్లో వచ్చింది. అక్కడ కూర్చొని చర్చిస్తే వాస్తవ పరిస్థితులు పూర్తిగా అర్థం కావు. సీఎం సహా మంత్రులందరూ జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 315 మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు ఉంది. వాతావరణ శాఖ ఇచ్చే సమాచారం మాత్రమే సరిపోదు.” అని రాఘవులు సూచించారు. తాగునీటి సమస్యతోపాటు రైతుల కష్టాలపైనా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి

“కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు నిధులు కోరినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ మొత్తం ఎంతవరకు సరిపోతుందో కూడా ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందో లేదో స్పష్టత లేదు. అన్ని రాజకీయ పార్టీలూ కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే రాష్ట్రానికి నిధులు సాధించే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వనరుల నుంచి తక్షణ సహాయంగా రైతులకు ఎంత మొత్తాన్ని ఖర్చు చేయబోతున్నారో కూడా ప్రకటించాలి” అని రాఘవులు డిమాండ్ చేశారు. రైతు సంఘాలతో కూడా చర్చించాలని సూచించారు.

నల్లగొండను ​కరువు జిల్లాగా ప్రకటించాలి : జూలకంటి రంగారెడ్డి

సాగు విస్తీర్ణంలో ఈసారి సగం పంటలే సాగయ్యాయని, అందులోనూ సగం పూర్తిగా ఎండిపోయాయని, నల్లగొండ జిల్లాను కరువు జిల్లాగా, తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ ‌చేశారు. వరి సాగుకు ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు, ఇతర వాణిజ్య పంటలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టారని, పంటలు చేతికి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ పర్యటనలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరపల్లి వెంకటేశ్వర్లు, పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, సయ్యద్ హాశం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్