Magazines

"శాంతి" నవనీతం

46 నిమిషాల క్రితం

యుద్ధాల మంటల్లో
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 3 నిమిషాల చదవడం

యుద్ధాల మంటల్లో మనుషులు మాడిపోతున్నా, అధికార దాహంతో దేశాల మధ్య చిచ్చు పెడుతున్న పాలకులు శాంతి ప్రవచనాలు వల్లిస్తున్నారు. బలవంతుడిదే న్యాయమనే ధోరణి ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతున్న వేళ.. బాధితులకు న్యాయం అందించడమే నిజమైన శాంతికి పునాది అని తన జీవితంతో చాటిన నవనీతం పిళ్లైకి నోబెల్‌ శాంతి పురస్కారం లభించడం స్ఫూర్తిదా యకం. ఈ గౌరవం ఆమె ఒక్కరికే కాదు.. జాతి, మతం, లింగం, అధికార భేదాలు లేకుండా మానవ హక్కుల కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ దక్కిన గుర్తింపు.

దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో భారత తమిళ మూలాలున్న కుటుంబంలో పుట్టిన నవనీతం పిళ్లై బాల్యం వర్ణవివక్ష నీడలోనే గడిచింది. చర్మ రంగును బట్టి మనుషుల హక్కులను నిర్ణయించే అమానవీయ వ్యవస్థను ఆమె దగ్గరగా చూశారు. ఆ అనుభవమే అన్యా యాన్ని ఎదిరించే న్యాయవాదిగా ఆమెను తీర్చిదిద్దింది. న్యాయవిద్యను అభ్యసించి, వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్తలకు అండగా నిలిచారు. నెల్సన్‌ మండేలా సహచరులు సహా రాజకీయ ఖైదీల తరఫున వాదించారు. వర్ణవివక్ష పాలనలో అణచివేతకు గురైనవారి పక్షాన నిలవడం సులభమైన విషయం కాదు. అయినా బెదిరింపులకు వెరవకుండా న్యాయాన్నే ఆయుధంగా చేసుకున్నారు.

ఆమె ప్రయాణం అక్కడితో ఆగలేదు. దక్షిణాఫ్రికా ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా, రువాండా అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో, అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా కూడా సేవలందించారు. రువాండా మారణహో మానికి సంబంధించిన విచారణల్లో లైంగిక హింసను యుద్ధ నేరంగానే కాకుండా, నిర్దిష్ట పరిస్థితుల్లో మారణహోమంలో భాగంగా కూడా పరిగణించవచ్చనే అంతర్జాతీయ న్యాయసూత్రం బలపడటంలో ఆమె పాత్ర కీలకం. యుద్ధాల్లో తుపాకీ తూటాలకు బలైనవారితోపాటు, లైంగిక హింసకు గురైన మహిళల వేదనకు కూడా న్యాయస్థానాల్లో చోటు కల్పించడం ఆమె కృషిలో ముఖ్యమైన మలుపు. బాధితుల గాయాలకు న్యాయం కొంతైనా ఉపశమనం కలిగించగలదని ఆమె నిరూపించారు.

నోబెల్‌ శాంతి పురస్కారం వెనుక కూడా ఇదే మౌలిక భావన ఉంది. ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ వీలునామా ప్రకారం 1901లో తొలిసారి ఈ పురస్కారాన్ని అందించారు. దేశాల మధ్య సోదరభావాన్ని పెంపొందించడం, యుద్ధాలను నివారించడం, శాంతియుత పరిష్కారాలకు కృషి చేయడం దీని ప్రధాన ఉద్దేశం. 2026లో నవనీతం పిళ్లైకి లభించినది 125వ నోబెల్‌ శాంతి పురస్కారం. యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు, మారణహోమాలకు పాల్పడినవారు బాధ్యత నుంచి తప్పించుకోకుండా చూడటం ద్వారా శాంతి, అంతర్జాతీయ న్యాయవ్యవస్థను బలోపేతం చేసినందుకు ఈ గౌరవం దక్కింది. శాంతి అంటే యుద్ధం ఆగిపోవడమే కాదు.. బాధితులకు న్యాయం జరగడం, నేరస్థులకు శిక్ష పడటం, బలవంతులైనా చట్టానికి అతీతులు కారనే నమ్మకం నిలవడం కూడా.

ఈ పురస్కారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయన యుద్ధోన్మాద ధోరణిని మరోసారి బయటపెట్టాయి. తానే ఎనిమిది యుద్ధాలను ఆపానని, తనకే నోబెల్‌ రావాలని చెప్పుకోవడమే కాకుండా, పిళ్లై ఎవరో ప్రపంచానికి తెలియదన్న ధోరణిలో మాట్లాడారు. శాంతి పురస్కారాన్ని కూడా వ్యక్తిగత కీర్తి కోసం ఆశించే ఆయన వైఖరి అభ్యంతరకరం. యుద్ధాలు, సైనిక బెదిరింపులు, ఆధిపత్య రాజకీయాలతో ప్రపంచాన్ని అస్థిరతలోకి నెట్టే శక్తివంతమైన పాలకులే శాంతి గురించి గొప్పలు చెప్పడం విరోధాభాసం. యుద్ధాల వల్ల ప్రాణాలు కోల్పోయేది సామాన్యులే; ఇళ్లు, జీవనోపాధి కోల్పోయి శరణార్థులయ్యేది ప్రజలే. అయినా యుద్ధ నిర్ణయాలు తీసుకునే పాలకులు తమ బాధ్యతను అంగీకరించడానికి బదులు, కీర్తి కోసం పోటీ పడుతున్నారు. పిళ్లై జీవితమే ఈ ధోరణికి భిన్నమైన సమాధానం.

నవనీతం పిళ్లై సాధించిన గౌరవం వ్యక్తిగత విజయంగా మాత్రమే చూడకూడదు. అంతర్జాతీయ చట్టాలను బలహీనపరిచి, న్యాయస్థానాలను ప్రశ్నిస్తూ, శక్తిమంతుల నేరాలను పట్టించుకోకుండా ఉండాలనే ధోరణులు పెరుగుతున్న తరుణంలో ఆమెకు లభించిన గుర్తింపు ఒక హెచ్చరిక. అధికారంలో ఉన్నవారి ఇష్టమే చట్టమైతే బలహీనులకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? న్యాయం లేని చోట శాంతి నిలవదు. మానవ గౌరవాన్ని కాపాడటానికి జీవితాన్ని అంకితం చేసిన పిళ్లై పోరాటం ఈ సత్యాన్ని గుర్తుచేస్తోంది. ఆమెకు లభించిన నోబెల్‌ పురస్కారం యుద్ధాలపై కీర్తి కిరీటాలు కోరుకునేవారికి కాదు.. అన్యాయాన్ని ఎదిరించి, బాధితుల పక్షాన నిలిచేవారికే చరిత్రలో నిజమైన గౌరవం దక్కుతుందని చాటుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్