Magazines

నేడు నేలను కాపాడితేనే రేపు ఆహారం!

55 నిమిషాల క్రితం

soil
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రపంచం నేడు ఆహార కొరతతోపాటు ఆహారాన్ని పండించే నేలలు, మంచినీటి వనరుల క్షీణతను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించాల్సిన అవసరం ఒకవైపు, సారాన్ని కోల్పోతున్న నేలలు, తగ్గుతున్న నీటి వనరులు మరోవైపు వ్యవసాయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 95 శాతానికి పైగా నేలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆధారపడి ఉంది. అయినప్పటికీ నేలకోత, రసాయనాల అధిక వినియోగం, అడవుల నరికివేత, అనారోగ్యకరమైన సాగు పద్ధతులు, పట్టణ విస్తరణ కారణంగా భూసారం క్షీణిస్తోంది. నేలలో సేంద్రియ పదార్థాలు, తేమ నిల్వ సామర్థ్యం తగ్గడం పంటల దిగుబడులపై ప్రభావం చూపుతోంది. నేల ఆరోగ్యం దెబ్బతింటే ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడుతుంది. 2050 నాటికి ప్రపంచ జనాభా సుమారు 970 కోట్లకు చేరుకోనుందని ఐక్యరాజ్య సమితి అంచనా. ఆహార అవసరాలు పెరుగుతున్న ప్పటికీ, పారిశ్రామిక ప్రాజెక్టులు, రహదారులు, పట్టణ విస్తరణ కారణంగా సారవంతమైన సాగుభూములు ఇతర అవసరాలకు మళ్లుతున్నా యి. అదే సమయంలో వ్యవసాయం, పరిశ్రమలు, పట్టణాల మధ్య నీటి కోసం పోటీ పెరుగుతోంది. కరువులు, అస్థిర వర్షపాతం పంటల ఉత్పత్తిని ప్రభావితం చేస్తూ ఆహార ధరలు పెరిగే ప్రమాదాన్ని సృష్టిస్తున్నాయి. తెలంగాణలో అనిశ్చిత వర్షపాతం, సాగునీటి కొరత, భూగర్భ జలాలపై ఒత్తిడి రైతులకు సవాళ్లుగా మారుతున్నాయి.

పెరుగుతున్న సాగు ఖర్చులు, అప్పుల భారం, గిట్టుబాటు ధరలు లేకపోవడం రైతుల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయి. పంట నష్టాల సమయంలో పరిహారం, పంటల బీమా, గిట్టుబాటు ధరలు కల్పించి రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వడం అత్యవసరం. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి నేలలో సేంద్రియ పదార్థాలను పెంచడం, పంట మార్పిడి, సమతుల్య ఎరువుల వినియోగం, నేలకోత నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలి. వర్షపు నీటిని సంరక్షించడం, చెరువులు, కుంటలను పునరుద్ధరిం చడం, నీటిని పొదుపుగా వినియోగించే సాగు పద్ధతులను ప్రోత్సహించాలి. సారవంతమైన వ్యవసాయ భూములను కాపాడటంతోపాటు కరువును తట్టుకునే పంట రకాలను ప్రోత్సహించాలి. ఆహార వృథాను తగ్గించడం, నీటిని పొదుపుగా వినియోగిం చడం ప్రజల బాధ్యత కూడా. అక్టోబర్‌ 16 ప్రపంచ ఆహార దినోత్సవం కేవలం వేడుకగా మిగిలిపో కూడదు. ఆకలి సమస్యకు ఆహార ఉత్పత్తి పెంపు ఒక్కటే పరిష్కారం కాదు. సహజ వనరుల సంరక్షణ, సారవంతమైన భూముల పరిరక్షణ, రైతుల ఆర్థిక భద్రతకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రైతు బతికితేనే వ్యవసాయం నిలుస్తుంది.. వ్యవసాయం నిలిస్తేనే ప్రజలకు ఆహారం అందుతుంది. నేడు నేలను కాపాడితేనే రేపటి తరాలకు ఆహార భద్రత సాధ్యమవుతుంది.


డా. కత్తెరసాల శ్రీనివాస్, 8121184095

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్