నవతెలంగాణ – సిర్పూర్ (టి)
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల ప్రణాళికపై మండల కేంద్రంలోని రైతు వేదికలో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివిధ శాఖల పనితీరు, అమలు వివరాలను అధికారులు సమీక్షించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి గిరీష్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా లబ్ధిదారులకు అందించిన పథకాల పురోగతిని వివరించారు. హౌసింగ్ ఏఈ అనిల్ ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనుల స్థితిగతులను వెల్లడించారు. ఐకెపి ఏపీఎం మహేష్ మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి రుణాలు అందించడంతో పాటు బస్సు కొనుగోలు కోసం నిధులు జమ చేసిన విషయాన్ని తెలిపారు.
మిషన్ భగీరథ ఏఈ గ్రామాల్లో త్రాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు చేపడుతున్న పనులను వివరించగా, తహసీల్దార్ రహీముద్దీన్ రెవెన్యూ శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్యాడి సెంటర్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాల గురించి తెలిపారు. మండల అభివృద్ధి అధికారి సత్యనారాయణ వివిధ సంక్షేమ పథకాల అమలును సమీక్షించారు. విద్యుత్ శాఖ అధికారులు సేవల పురోగతిని వివరించగా, మండల విద్యాధికారి సదాశివుడు విద్యా వ్యవస్థ అభివృద్ధిపై మాట్లాడారు. కాగజ్నగర్ డీఎస్పీ వహియోద్దీన్ పోలీస్ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను వివరించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ది పొందిన లబ్ధిదారులు మాట్లాడారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



