– తేజస్వి సూర్యపై కోదండరాం నిప్పులు
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ అస్తిత్వాన్ని, అమరుల త్యాగాలను కించపరిచేలా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు చేశారని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏమాత్రం సందర్భం లేకుండా, కనీస అవగాహన లేకుండా తెలంగాణ ఏర్పాటును బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులతో ముడిపెట్టడం శోచనీయమని మండిపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం, అత్యున్నత ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఏర్పాటైన రాష్ట్రాన్ని కించపరచడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు.
తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నాటి బీజేపీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ గౌరవించి, మద్దతు తెలిపిన విషయాన్ని కోదండరాం ఈ సందర్భంగా గుర్తు చేశారు. సొంత పార్టీ సీనియర్ నేతలు తీసుకున్న నిర్ణయాలను కూడా అర్థం చేసుకోకుండా తేజస్వి సూర్య మాట్లాడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతుంటే పక్కనే ఉన్న కేంద్ర మంత్రులు ఆయన్ని నిలువరించకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు ఈ వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని బట్టి చూస్తే, వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని అర్థమవుతోందని విమర్శించారు. తేజస్వి వ్యాఖ్యలను తక్షణమే పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని, ఆయనపై బీజేపీ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



