తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్
నవతెలంగాణ – ఉప్పునుంతల
రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన అనేక దీర్ఘకాలిక సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని ఉప్పునుంతల మండల తాహసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కారం అయినప్పటికీ, మరెన్నో సమస్యలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయని పేర్కొంది.
ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను పలు మార్లు సీఎస్, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని జేఏసీ నాయకులు తెలిపారు. దీంతో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించడంతో పాటు న్యాయబద్ధమైన డిమాండ్లను అమలు చేయాలని జేఏసీ ఛైర్మన్ వి. లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా భోజన విరామ సమయంలో ఆర్డీఓలు, మండల తహశీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. అచ్చంపేటలో కూడా ఇదే విధంగా వినతిపత్రం అందజేశారు.
జేఏసీ ప్రధాన డిమాండ్లు
జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు చేయాలి
రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
– హెల్త్ కార్డ్స్ తక్షణమే అమలు చేయాలి
– సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానం పునరుద్ధరించాలి
– పెండింగ్ డీఏలు విడుదల చేయాలి
– 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి
– ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
– ఉద్యోగ, ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు చేపట్టాలి
– సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు డీటీ రమేష్, జగదీశ్వర్, ప్రభాకర్ రెడ్డి, మల్లారెడ్డి, రాజేష్, చంద్రశేఖర్, అశోక్, నర్మదతో పాటు రెవెన్యూ ఉద్యోగుల సంఘం, జీపీఓల సంఘం నాయకులు పాల్గొన్నారు.



