Saturday, April 18, 2026
E-PAPER
Homeజాతీయంనెగ్గిన ప్రతిపక్షం

నెగ్గిన ప్రతిపక్షం

- Advertisement -

– ఓడిన మోడీ, అమిత్‌షా సర్కార్‌.. పార్లమెంటులో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
– లభించని మూడింట రెండొంతుల మెజారిటీ
– మహిళా రిజర్వేషన్ల పేరుతో డీలిమిటేషన్‌ బిల్లులు పెట్టిన కేంద్రం
– పారని బీజేపీ కుయుక్తులు
– ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యులు 528
– బిల్లుకు అనుకూలం 298, వ్యతిరేకం 230
– ఆమోదానికి కావాల్సిన సంఖ్య 352
– మిగిలిన బిల్లులు ఉపసంహరించుకున్న కేంద్రం
– ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మోడీషా ద్వయానికి పరాభవం
– నేడు కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎన్నో రాజకీయ కుయుక్తులతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకపార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలు ఐక్యంగా తిప్పికొట్టాయి. రెండ్రోజులు జరిగిన ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలను రెచ్చగొట్టి, విభజించి బిల్లును ఆమోదింపచేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. లోక్‌సభలో మూడింట రెండొంతుల మద్దతు లభించకపోవడంతో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్‌ లో 528 మంది సభ్యులు పాల్గొనగా, బిల్లుకు అనుకూలంగా 298 మంది ఓటు వేశారు. వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో పార్లమెంటులో మూడింట రెండొంతుల మంది సభ్యులు అనుకూలం గా ఓటు వేయాల్సి ఉంది. అంటే 352 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. కానీ అనుకూలంగా కేవలం 298 మంది మాత్రమే ఓటు వేయడంతో బిల్లు వీగిపోయింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు-2026, డీలిమిటేషన్‌ (పునర్విభజన) బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులపై రెండు రోజుల పాటు లోక్‌ సభలో చర్చ జరిగింది. బిల్లులపై జరిగిన చర్చలో గురువారం 84 మంది, శుక్రవారం 49 మంది సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమాధానం ఇచ్చారు. ఆ తరువాత కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదం కోసం సభ ముందు ఉంచారు. అనంతరం స్పీకర్‌ ఓంబిర్లా బిల్లుపై ఓటింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు. లోక్‌ సభ సెక్రెటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ ఓటింగ్‌ జరిగే ప్రక్రియ, ఓటు వేసే విధానంపై సభ్యులకు వివరించారు. అనంతరం ఓటింగ్‌ జరిగింది. మొత్తం 528 మంది ఓట్లు వేయగా, బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయని స్పీకర్‌ ఓంబిర్లా ప్రకటించారు. దీంతో బిల్లు వీగిపోయినట్టు ప్రకటించారు. ఈ క్రమంలో మిగతా రెండు బిల్లులు డీలిమిటేషన్‌ (పునర్విభజన) బిల్లు-2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటించారు.

పారని మోడీ, అమిత్‌ షా ఎత్తుగడలు
మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డుపెట్టి నియోజకవర్గాలను తమకు అనుకూలంగా పెంచుకుని, 2029 ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నాలకు అడ్డుకట్టపడింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు అనే సెంటిమెంట్‌తో ప్రచారం చేసిన తమ రాజకీయ లక్ష్యం నెరవేర్చేందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వేసిన పాచికలు పారలేదు. వారి కుట్రలను ప్రతిపక్షం ఐక్యంగా అడ్డుకుంది. అంతేకాకుండా పార్లమెంట్‌ సాక్షిగా ఎన్డీఏ కుట్రలను ఎండగట్టింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పేరుతో తీసుకొచ్చిన డీలిమిటేషన్‌ బిల్లుల కుట్రలను బయటపెట్టింది. మహిళ రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే చరిత్ర హీనులవుతారని ప్రధాని మోడీ పదేపదే ప్రకటించారు. అయితే మహిళ రిజర్వేషన్‌ ముసుగులో తీసుకొచ్చిన డీలిమిటేషన్‌ బిల్లుల గురించి పెద్దగా చర్చలేకుండా చేశారు. ఈ కుట్రలను ప్రతిపక్షం ముక్తకంఠంతో వ్యతిరేకించి, బిల్లుల స్వరూపాన్ని దేశ ప్రజలకు వివరించింది. ఈ బిల్లులతో సమాఖ్యవాదంపై తీవ్రమైన దాడి జరుగుతుంది. అంతేకాకుండా రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లులు పార్లమెంటరీ వ్యవస్థను బుల్డోజ్‌ చేస్తాయి. ఈ బిల్లులతో దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్‌, ఒడిశాతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. అధికార పక్షం వలలో పడకుండా ప్రతిపక్షం జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరించింది. దీంతో మోడీ, అమిత్‌ షా పరివారం తోకముడిచింది. ఈ నేపథ్యంలో శనివారం కేంద్ర మంత్రివర్గ అత్యవసరంగా సమావేశం అవుతున్నది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో బిల్లుల అంశాలను ప్రస్తావించాలన్నదే బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

రాజ్యాంగంపై దాడిని నివారించాం :రాహుల్‌గాంధీ
మహిళా రిజర్వేషన్ల ముసుగులో ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకం. ప్రతిపక్షం ఐక్యంగా రాజ్యాంగంపై దాడిని నివారించింది. రాజ్యాంగ విరుద్ధమైన బిల్లులను ఓడించాం. ఇది మహిళా బిల్లు కాదని స్పష్టంగా చెప్పాం. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మేం వ్యతిరేకం కాదు. మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బిల్లు ముమ్మాటికీ మహిళా బిల్లు కాదు. ఇది భారత రాజకీయ నిర్మాణంపై దాడి. దేశ రాజకీయ నిర్మాణాన్ని మార్చే కుట్రను అడ్డుకున్నాం. 2023 మహిళా బిల్లును ఆమోదించేందుకు సిద్ధం. దాన్ని అమలు చేయండి. పూర్తిగా సహకరిస్తామని ప్రధాని నరేంద్రమోడీకి చెప్తున్నా.

ఢిల్లీని ఓడించాం- తమిళనాడు సీఎం స్టాలిన్‌
ఢిల్లీని ఓడించాం. ఇది ప్రజల విజయం. బీజేపీ రాజకీయ కుట్రలు బహిర్గతం అయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -