తొలిదశ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల చిట్టా
23 శాతం మంది నేరచరితులు
21 శాతం మంది కోటీశ్వరులు : ఏడీఆర్ నివేదికలో వెల్లడి
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలివిడతలో పోటీ చేస్తున్న ప్రతి నలుగురు అభ్యర్థుల్లో ఒకరిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు వారు ప్రకటించుకున్నారని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. విశ్లేషించిన 1,475 మంది అభ్యర్థుల్లో 345 మంది (23 శాతం) పై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 294 మంది (20 శాతం) తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొం టున్నారు. 19 మంది అభ్యర్థులపై హత్యకు సంబంధిం చిన కేసులు, 105 మంది అభ్యర్థులపై హత్యాయత్నానికి సంబంధించిన కేసులు ఉన్నాయని ప్రకటించుకున్నారని ఈ నివేదిక తెలిపింది. అదనంగా 98 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వీరిలో ఆరుగురు లైంగికదాడి కేసుల్లో నిందితులుగా ఉన్నారు.
ప్రధాన పార్టీలలో, క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల నిష్పత్తి బీజేపీలోనే అత్యధికంగా ఉంది. ఆ పార్టీకి చెందిన 152 మంది అభ్యర్థుల్లో 106 మంది (70 శాతం) తమపై కేసులు ఉన్నట్టు ప్రకటించుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో టీఎంసీ (63 మంది అభ్యర్థులు(43 శాతం)), కాంగ్రెస్ (39 మంది అభ్యర్థులు(26 శాతం)) నిలిచాయి. తీవ్రమైన క్రిమినల్ కేసుల విషయంలోనూ ఇదే తరహా ధోరణి కనిపించింది. బీజేపీ అభ్యర్థుల్లో 63 శాతం, టీఎంసీలో 32 శాతం, కాంగ్రెస్ అభ్యర్థుల్లో 22శాతం మంది తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
తొలిదశ ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలలో సుమారు 43 శాతం అంటే, మొత్తం 66 నియోజక వర్గాలను ఈ నివేదిక ”రెడ్ అలర్ట్ నియోజకవర్గాలుగా” గుర్తించింది. ఈ నియోజకవర్గాలలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించుకున్నారు. నేరచరిత్ర కలిగిన అభ్యర్థుల ఎంపికను సమర్థించుకోవాలని రాజకీయ పార్టీలను సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, పార్టీలు మాత్రం ప్రజాదరణ లేదా రాజకీయ ప్రేరేపిత కేసులు వంటి ”నిరాధారమైన” కారణాలనే చూపుతూనే ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది.
”ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనే ఆసక్తి రాజకీయ పార్టీలకు లేదని ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి,” అని ఆ నివేదిక తెలిపింది. ఆర్థిక పరంగా చూస్తే, 309 మంది అభ్యర్థులు (21 శాతం) కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తుల విలువ రూ. 1.34 కోట్లుగా నమోదైంది. సగటు ఆస్తుల విషయంలో టీఎంసీ అగ్రస్థానంలో ఉంది. ఈ పార్టీ అభ్యర్థులు సగటున రూ. 5.70 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ (రూ. 2.57 కోట్లు), కాంగ్రెస్(రూ. 2.06 కోట్లు) ఉన్నాయి. అత్యంత సంపన్న అభ్యర్థుల జాబితాలో టీఎంసీకి చెందిన జాకిర్ హుస్సేన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన రూ.133 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు. ఆ తర్వాతి స్థానాల్లో టీఎంసీకి చెందిన గౌతమ్ మిశ్రా (రూ.105 కోట్లకు పైగా) , కబీ దత్తా (రూ. 72 కోట్లకు పైగా) ఉన్నారు.్యంత తక్కువ ఆస్తులు కలిగిన ముగ్గురు అభ్యర్థులు రూ.1,000 కంటే తక్కువ విలువైన ఆస్తులను ప్రకటించారు. దుర్గాపూర్ పూర్బ నియోజకవర్గం నుంచి ‘ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ’ తరపున పోటీ చేస్తున్న రుబియా బేగం కేవలం రూ. 500 ఆస్తిని మాత్రమే ప్రకటించారు. ఆ తర్వాతి స్థానాల్లో ఎస్‌యూసీఐ(సీ)కి చెందిన అభ్యర్థులు మేదినీపూర్ నుంచి సుశ్రిత సారెన్ (రూ. 700), జల్పైగురి నుంచి జశోద బర్మన్ (రూ. 924) ఉన్నారు. ఈ ముగ్గురూ తమకు ఎటువంటి స్థిరాస్తులు లేవని ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ బరిలో కిమినల్స్
- Advertisement -
- Advertisement -



