Saturday, April 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్‌ తెరిచాం

హార్ముజ్‌ తెరిచాం

- Advertisement -

లెబనాన్‌లో కాల్పుల విరమణ ఉన్నంత కాలమే
ఇజ్రాయిల్‌-లెబనాన్‌ సీజ్‌ఫైర్‌ నేపథ్యంలో ఇరాన్‌ నిర్ణయం
టెహ్రాన్‌ : హార్ముజ్‌ జలసంధిని తెరిచినట్టు ఇరాన్‌ గురువారం ప్రకటించింది. లెబనాన్‌లో కాల్పుల విరమణ అమల్లో వుండే పదిరోజులూ హార్మూజ్‌ను పూర్తిగా తెరిచి వుంచుతామని, అన్ని వాణిజ్య నౌకల రాకపోకలను అనుమతిస్తామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరగ్చి తెలిపారు. ఇరాన్‌ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఓడరేవులు, సముద్ర జలాల సంస్థ ఇప్పటికే ప్రకటించిన సమన్వయ మార్గంలోనే ఈ రాకపోకలు వుంటాయని అరగ్చి ట్వీట్‌ చేశారు.

బలవంతంగా అంగీకరించిన ఇజ్రాయిల్‌
లెబనాన్‌తో కాల్పుల విరమణకు ఇజ్రాయిల్‌ బలవంతంగా అంగీకరించాల్సి వచ్చిందని ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసంగిస్తూ తెలిపారు. ఇది బలమైన దౌత్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు హిజ్బుల్లాపై, లెబనాన్‌లో ఇతర ప్రాంతాల్లో దాడి చేసేందుకు ఇజ్రాయిల్‌కు హక్కు లేదన్నారు. ఇరాన్‌ ఎన్నడూ అణ్వాయుధాలను కోరుకోదని, అలాగే ఈ ప్రాంతంలో అశాంతిని లేదా ఉగ్రవాదాన్ని కూడా కోరుకోదని చెప్పారు. చట్టపరమైన పరిధుల్లో తమ ప్రాదేశిక సమగ్రతను గౌరవంతో పరిరక్షించుకుంటూనే శాంతి కోసం ఇరాన్‌ కృషి చేస్తోందన్నారు. ఇరాన తన సూత్రాలు, సిద్ధాంతాలు, వైఖరుల విష యంలో ధృఢంగా వుంటుందని, ఎదుటి పక్షం కూడా దాన్ని అర్ధం చేసుకోవాలన్నారు. మిలటరీ కమాండర్లు, రాజకీయ నేతలు, శాస్త్రవేత్తలు, విద్యార్ధులు ఇలా అందరినీ హతమార్చుకుంటూ మందుకు పోవడం ద్వారా ఇరాన్‌ను, మొత్తంగా ఈ ప్రాంతాన్ని అమెరికా, ఇజ్రాయిల్‌లు గందర గోళం, అరాచకంలోకి నెట్టేశాయని ఆయన విమర్శించారు

పాక్‌పై ప్రశంసల జల్లు
ఇరాన్‌ గౌరవాన్ని పరిరక్షిస్తూనే దౌత్యానికి సన్నద్ధమయ్యేలా సాయం చేసినందుకు పాకిస్తాన్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా మధ్యవర్తిత్వ పాత్ర పోషించిన పాక్‌ను ప్రశంసించారు. టెహరాన్‌లో చర్చల సమయంలో పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇస్లామాబాద్‌లో ఇరాన ప్రతినిధి బృందానికి ఆతిధ్చమిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు విస్తరించుకోవాలని కోరుకుం టున్నామని చెప్పారు.

ఆంక్షల తర్వాత గల్ఫ్‌ను దాటిన మూడు ఇరాన్‌ ట్యాంకర్లు
అమెరికా ఆంక్షలు సోమవారం అమల్లోకి వచ్చిన తర్వాత హార్మూజ్‌ను దాటి మొదటిసారిగా మూడు ఇరాన్‌ చమురు ట్యాంకర్లు వచ్చాయని సముద్ర జల ట్రాకింగ్‌ సంస్థ కెప్లర్‌ తెలిపింది. మొత్తంగా 50లక్షల బ్యారెళ్ళ ముడి చమురును మోసుకుపోతున్న మూడు ట్యాంకర్లు బుధవారం హార్ముజ్‌ను దాటి ముందుకు సాగాయి. ఈ నెల ప్రారంభంలో ఖర్గ్‌ ద్వీపంలో ఇవి లోడింగ్‌ అయ్యాయి. కెప్లర్‌ డేటా ప్రకారం, ముడి చమురును తీసుకెళ్ళే ఇరాన్‌ ట్యాంకర్‌ ఏదీ కూడా ఈ నెల 10 నుంచి గల్ఫ్‌ను దాటలేదు.

హార్ముజ్‌పై బ్రిటన్‌-ఫ్రాన్స్‌ సమావేశం
హార్ముజ్‌పై చర్చించి అంతర్జాతీయ సంకీర్ణాన్ని ఏర్పాటు చేసేందుకు బ్రిటన్‌-ఫ్రాన్స్‌లు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నాయి. ఇందులో 40దేశాలు పాల్గొంటున్నాయి. బ్రిటన్‌ ప్రధాని స్టార్మర్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ అయేందుకు ఇల్సీ ప్యాలెస్‌కు చేరుకున్నారు. హార్మూజ్‌లో మందుపాతరలను తొలగించే కార్యక్రమాలతో సహా అన్ని అంశాలపై చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు.

యుద్ధం తర్వాత యుద్ధం… జీవితాలు విధ్వంసం
గత కొద్ది వారాలుగా దాడులు తర్వాత దాడులు, యుద్ధాలు కొనసాగుతుండడంతో దక్షిణ లెబనాన్‌లో ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఈ దాడుల్లో కీలక మౌలిక వసతులు కూడా నాశనమవడంతో పరిస్థితులు దారుణంగా వున్నాయి. ప్రస్తుతానికి దక్షిణ లెబనాన్‌లోని టెబ్‌నైన్‌ పట్టణంలో ఆస్పత్రి ఒక్కటే పనిచేస్తోంది. గత కొద్ది రోజులుగా జరిగిన పలు దాడుల్లో మెడికల్‌ వర్కర్లు అనేకమంది చనిపోయారు. అంబులెన్సులపై దాడులు సాగాయి. దాంతో ఈ ప్రాంతంలో వైద్య సేవలు స్తంభించాయి.

అమెరికా ఆయుధ సరఫరాల్లో ఆలస్యం
ఇరాన్‌తో యుద్ధం కారణంగా దాని ప్రభావం అమెరికా నుంచి యూరప్‌కు జరిగే ఆయుధ సరఫరాపై పడింది. కొన్ని యూరప్‌ దేశాలకు ముందుగా ఒప్పందం కుదిరిన ఆయు ధాల సరఫరాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని అమెరికా అధికారులు తెలిపారు. ఇది ప్రధానంగా ఇరాన్‌ యుద్ధం కొనసాగుతుండ టంతో అమెరికా ఆయుధ నిల్వలు తగ్గిపోవడం కారణంగా జరుగుతోందని సమాచారం. ఈ ఆలస్యం ముఖ్యంగా బాల్టిక్‌ ప్రాంతం, స్కాండినేవియా దేశాలను ప్రభావితం చేస్తుందని వారు తెలిపారు. ఈ ఆయుధాలు యూరప్‌ దేశాలు అమెరికా ఫారీన్‌ మిలిటరీ సేల్స్‌ (ఎఫ్‌ఎంఎస్‌) ప్రోగ్రామ్‌ ద్వారా కొనుగోలు చేసినవే అయినప్పటికీ.. అవి ఇంకా పంపిణీ కాలేదు. ఇటీవల అమెరికా అధికారులు ద్వైపాక్షిక సందేశాల ద్వారా ఈ సరఫరాలు ఆలస్య మవు తాయని యూరప్‌ అధికారులకు తెలియజేశారు.

యూరప్‌ దేశాల అసంతృప్తి
కాగా యూరప్‌ అధికారులు ఈ పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది తమ రక్షణ సిద్ధతను దెబ్బతీస్తోందని ఆందోళన చెందుతు న్నారు. ఎఫ్‌ఎంఎస్‌ ప్రోగ్రామ్‌ కింద ఆయా దేశాలు అమెరికా తయారీ ఆయుధాలను కొను గోలు చేస్తాయి. ఈ ప్రక్రియలో అమెరికా ప్రభు త్వం లాజిస్టిక్‌ సహాయం అందిస్తుంది. డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. యూరప్‌ దేశాలను అమెరికా ఆయుధాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసింది. అయితే ఈ తరహా సరఫరాల్లో తరచుగా ఆలస్యాలు జరుగు తుండటంతో యూరప్‌ దేశాల్లో అసంతృప్తి పెరు గుతోంది. దీంతో కొంత మంది అధికారులు యూరప్‌లోనే తయారయ్యే ఆయుధాలపై దృష్టి పెట్టడం ప్రారంభించారు. ఇరాన్‌ యుద్ధానికి ముందే, అమెరికా భారీగా తన ఆయుధ నిల్వలు వినియోగించింది. ముఖ్యంగా రష్యా 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత, అలాగే గాజాలో ఇజ్రాయిల్‌ సైనిక చర్యలు ప్రారంభమైనత తర్వాత కూడా అమెరికా భారీగా ఆయుధాలను వినియో గించింది.

ఇజ్రాయిల్‌ దాడుల్లో 2294 మంది బలి
లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడులకు ప్రజలు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. మార్చి 2 నుంచి జరుగుతోన్న దాడుల్లో లెబనాన్‌లో మృతుల సంఖ్య 2294కు చేరుకుంది. అలాగే 7,544 మంది గాయపడ్డారు. ఈ మేరకు లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.

శాశ్వత శాంతి కోసం చర్చలు
ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్‌ అవోన్‌తో మంచి చర్చలు జరిగాయని ట్రంప్‌ చెప్పారు. వారిని వైట్‌ హౌజ్‌కు ఆహ్వానించి శాశ్వత శాంతి కోసం చర్చలు జరపాలని ఆయన యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి వాన్స్‌, విదేశాంగ మంత్రి మాక్రో రూబియో, సైనిక ప్రధానాధికారి డాన్‌ కైనెలకు ఇజ్రాయిల్‌-లెబనాన్‌ మధ్య శాశ్వత శాంతి సాధించేందుకు పని చేయాలని ట్రంప్‌ ఆదేశించినట్టు చెప్పాయి. ఇటు ఇరాన్‌ కూడా కాల్పుల విరమణను స్వాగతించింది. పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరిందని వివరించింది.

ఇరాన్‌తో ఒప్పందానికి దగ్గరలో ఉన్నాం : ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఒప్పందానికి దగ్గరలో ఉన్నామని తెలిపారు. వచ్చే వారాంతంలో అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య చర్చలు జరగొచ్చని చెప్పారు. యుద్ధం త్వరగా ముగుస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ”ఏం జరగనుందో మనం చూడబోతున్నాం. ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నామని నేను అనుకుంటున్నాను” అని ట్రంప్‌ చెప్పారు. వైట్‌హౌజ్‌ బయట రిపోర్టర్లతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత లాస్‌ బేగాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘ఈ యుద్ధం చాలా త్వరలో ముగియాలి’ అని తెలిపారు.

గాలిలో కోటలు కడుతున్నారు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఉచిత చమురు, హార్ముజ్‌ జలసంధి వ్యాఖ్యలపై ఇరాన్‌ వ్యంగ్యంగా స్పందించింది. అవి గాలిలో కోటలు కట్టడం లాంటివని పేర్కొంది. చర్చల్లో ఎలాంటి వాస్తవ పురోగతీ లేదని సూచించింది. ఈ మేరకు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా సంస్థ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ (ఐఆర్‌ఐబీ) ట్రంప్‌ వ్యాఖ్యలకు సంబంధించి ఒక వీడియోను విడుదల చేసింది. ”మా చర్చలు చాలా విజయవంతంగా సాగుతున్నాయి. ఇదే జరిగితే త్వరలో ప్రకటిస్తాం. అప్పుడు మాకు ఉచితంగా చమురు, హార్ముజ్‌ జలసంధి లభి స్తాయి. అన్నీ బాగుంటాయి” అని ఆ వీడియోలో ట్రంప్‌ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇరాన్‌ మీడియా ఒక కవితాత్మకమైన వ్యాఖ్యను ఉపయోగించింది. ”గాలిలో కోటలు కట్టడం! పర్షియన్‌ సామెతలో కూడా ఇలాంటిదే ఉంది.. ‘ఒంటె పత్తి గింజల గురించి కలలు కంటుంది, కొన్ని సార్లు వాటిని మింగేస్తుంది, మరికొన్నిసార్లు ఒక్కొక్కటిగా తింటుంది”’ అని ప్రయోగించింది. వాస్తవానికి దూరంగా ఉన్న, అసాధ్యమైన ఆశలు పెట్టుకునే విషయంలో ఈ సామెతను వాడుతారు. కాగా పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామా బాద్‌ కేంద్రంగా అమెరికా, ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు విఫలమైన విషయం విదితమే. ఈ పరిణామాల అనంతరం అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఇరాన్‌ ఈ విధంగా స్పందించింది.

ఇకపై హార్ముజ్‌ను ఇరాన్‌ మూసివేయదు : ట్రంప్‌
హార్ముజ్‌పై ఇరాన్‌ కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత ట్రంప్‌ స్పందించారు. తన ట్రూత్‌సోషల్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ ఎన్నటికీ మూసివేయదనీ, అందుకు ఆ దేశం అంగీకరించిందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇకపై దీనిని ప్రపంచంపై ఒక ఆయుధంగా వాడదని సోషల్‌ మీడియా పోస్ట్‌లో ట్రంప్‌ వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -