Saturday, April 18, 2026
E-PAPER
Homeఆటలుకుర్రాళ్లపైనే ఫోకస్‌!

కుర్రాళ్లపైనే ఫోకస్‌!

- Advertisement -

మరో విజయంపై సన్‌రైజర్స్‌ గురి సూపర్‌కింగ్స్‌తో హైదరాబాద్‌ ఢీ నేడు

భీకర బ్యాటింగ్‌ లైనప్‌, 300 పరుగుల రికార్డు స్కోరు బాదగల సత్తా సన్‌రైజర్స్‌ సొంతం. అయినా, 220 ప్లస్‌ స్కోరును కాపాడుకోలేని బలహీన బౌలింగ్‌ లైనప్‌ సన్‌రైజర్స్‌దే అనే విమర్శలు. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఆ విమర్శలకు దీటుగా బదులిచ్చింది. వెటరన్‌ పేసర్లు ఉనద్కత్‌, హర్షల్‌ను పక్కనపెట్టి.. కుర్రాళ్లు ప్రఫుల్‌, సకిబ్‌లతో సరికొత్త ప్రయోగం చేసి సూపర్‌ సక్సెస్‌ సాధించింది. సొంతగడ్డపై నేడు సూపర్‌కింగ్స్‌తో తలపడనున్న సన్‌రైజర్స్‌ మరో విజయంపై కన్నేసింది. ఎం.ఎస్‌ ధోని హైదరాబాద్‌కు వచ్చినా.. అభిమానుల ఫోకస్‌ కుర్రాళ్లపైనే కనిపిస్తోంది!.

నవతెలంగాణ-హైదరాబాద్‌
ఉప్పల్‌ స్టేడియం మరో రసవత్తర సమరానికి సిద్ధమైంది. బలమైన బ్యాటింగ్‌కు తోడు ఆకర్షణీయ బౌలింగ్‌ లైనప్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భీకర ఫామ్‌లో ఉంది. వరుస విజయాలు సాధించినా, ఆత్మవిశ్వాసం లోపించిన చెన్నై సూపర్‌కింగ్స్‌ నేడు హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది. ఎం.ఎస్‌ ధోని రాకతో అభిమానులు సూపర్‌కింగ్స్‌ అంచనాలను భారీగా పెంచుకున్నారు. విధ్వంసక బ్యాటర్లు, ప్రతిభావంతులైన యువ పేసర్లు సన్‌రైజర్స్‌ అభిమానుల అంచనాలను అమాంతం పెంచేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ సీజన్లో ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించాయి. దీంతో ఇరు జట్లకు నేటి మ్యాచ్‌ ప్రతిష్టాత్మకంగా మారింది.

చూపులన్నీ ఆ ఇద్దరిపైనే
ప్రఫుల్‌ హింగే, సకిబ్‌ హుస్సేన్‌లపైనే అందరి దష్టి నెలకొంది. ఎటువంటి అంచనాలు లేకుండా రాయల్స్‌పై అరంగ్రేటం చేసిన ప్రఫుల్‌, సకిబ్‌లు చెరో 4 వికెట్లతో అసమాన ప్రదర్శన కనబరిచారు. కొత్త బంతితో, ఫీల్డింగ్‌ పరిమితుల నడుమ ఈ ఇద్దరి పేస్‌, స్వింగ్‌, వేరియేషన్స్‌ బ్యాటర్లను తికమక పెట్టాయి. పవర్‌ప్లేలో, డెత్‌ ఓవర్లలో హైదరాబాద్‌కు ఈ ఇద్దరు కుర్ర పేసర్లు కీలకం కానున్నారు. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న ఈ ఇద్దరు.. నేడు సూపర్‌కింగ్స్‌పై మెప్పిస్తారేమో చూడాలి. సంజు శాంసన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌ సహా ఆయుశ్‌ మాత్రెలకు సకిబ్‌, ప్రఫుల్‌ ద్వయం సవాల్‌ విసరనుంది. స్పిన్నర్‌ శివాంగ్‌ కుమార్‌, హర్ష్‌ దూబె సహా ఈషన్‌ మలింగ సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. ఇక బ్యాటింగ్‌ లైనప్‌లో అభిషేక్‌ శర్మ, ట్రావిశ్‌ హెడ్‌ జంట నిలకడగా రాణించాల్సి ఉంది. ఈ జోడీ కనీసం పవర్‌ప్లేలో మెరిస్తేనే సన్‌రైజర్స్‌ మిడిల్‌ ఆర్డర్‌ స్వేచ్చగా పరుగులు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇషాన్‌ కిషన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి మంచి ఫామ్‌లో ఉన్నారు. క్లాసెన్‌ నిలకడగా పరుగులు చేస్తున్నా.. విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడటంలో నిరాశపరుస్తున్నాడు. మిడిల్‌ ఆర్డర్‌లో క్లాసెన్‌ కదంతొక్కితే సన్‌రైజర్స్‌ 300 పరుగుల మైలురాయి అందుకోవటం పెద్ద సవాల్‌ కాబోదు. బౌలింగ్‌ విభాగంలో ప్రఫుల్‌, సకిబ్‌ రాణిస్తే… నాల్గో విదేశీ ఆటగాడిగా లివింగ్‌స్టోన్‌ తుది జట్టులో నిలిచే అవకాశాలు లేకపోలేదు.

ధోని ఆడతాడా?
ప్రాక్టీస్‌లో పిక్క గాయానికి గురైన ఎం.ఎస్‌ ధోని ఐపీఎల్‌లో తొలి రెండు వారాలు ఆటకు దూరమయ్యాడు. గాయంతో ఎం.ఎస్‌ ధోని సూపర్‌కింగ్స్‌ మ్యాచ్‌లకు గువహటి, బెంగళూరుకు జట్టుతో పాటు ప్రయాణించలేదు, చెపాక్‌లో మ్యాచ్‌లకు డ్రెస్సింగ్‌రూమ్‌లో కూర్చోలేదు. నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసిన ధోని.. నేడు సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ కోసం జట్టుతో పాటు హైదరాబాద్‌కు చేరుకున్నాడు. ధోని ఫిట్‌నెస్‌పై ప్రాంఛైజీ చెప్పిన 2 వారాల గడువు ముగియటంతో నేడు మహి బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండేండ్ల తర్వాత ధోని హైదరాబాద్‌కు రావటంతో అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. చెపాక్‌లో వరుస విజయాలు సాధించిన ఉత్సాహంలో ఉన్న సూపర్‌కింగ్స్‌ నేడు ఉప్పల్‌ స్టేడియంలో కఠిన పరీక్ష ఎదుర్కొనుంది. సంజు శాంసన్‌, ఆయుశ్‌ మాత్రె, డెవాల్డ్‌ బ్రెవిస్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, ఆల్‌రౌండర్‌ శివం దూబె ఫామ్‌లోకి రావాల్సి ఉంది. గత మ్యాచ్‌లో రాణించిన పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ గాయంతో సీజన్‌కు దూరం కావటం సూపర్‌కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ. సంజు శాంసన్‌ చివరగా ఉప్పల్‌లో ఆడిన టీ20లో సెంచరీ సాధించాడు. దీంతో నేడు సూపర్‌కింగ్స్‌ మరోసారి సంజు శాంసన్‌పైనే అధికంగా ఆధారడుతోంది. సర్ఫరాజ్‌ ఖాన్‌, శివం దూబెలు సైతం మెరిస్తే.. నేడు సన్‌రైజర్స్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. స్పిన్నర్లు నూర్‌ అహ్మద్‌, అకీల్‌ హుస్సేన్‌లు సన్‌రైజర్స్‌ టాప్‌ ఆర్డర్‌ను ఏ విధంగా నిలువరిస్తారో చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -