Saturday, April 18, 2026
E-PAPER
Homeఆటలుకోల్‌కథ మారలేదు

కోల్‌కథ మారలేదు

- Advertisement -

-టైటాన్స్‌ చేతిలో నైట్‌రైడర్స్‌ చిత్తు
-ఛేదనలో మెరిసిన శుభ్‌మన్‌ గిల్‌
కోల్‌కతా 180/10 గుజరాత్‌ 181/5


కోల్‌’కథ’ ఆరంభంలోనే ముగియనుంది!. సీజన్‌లో తొలి 6 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. సీజన్లో ఐదో ఓటమి ఖాతాలో వేసుకుంది. అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో నైట్‌రైడర్స్‌ 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. శుభ్‌మన్‌ గిల్‌ (86) అర్థ సెంచరీతో గుజరాత్‌ టైటాన్స్‌ అలవోక విజయం సాధించింది. బ్యాట్‌తో, బంతితో తేలిపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దారుణంగా నిరాశపరిచింది.

నవతెలంగాణ-అహ్మదాబాద్‌
గుజరాత్‌ టైటాన్స్‌ సీజన్లో మూడో విజయం సాధించింది. శుక్రవారం అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఆ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఛేదనలో కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (86, 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రాణించాడు. సాయి సుదర్శన్‌ (22, 16 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), జోశ్‌ బట్లర్‌ (25, 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) శుభ్‌మన్‌ గిల్‌కు సహకరించారు. 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ మరో 2 బంతులు ఉండగానే విజయాన్ని అందుకుంది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. కామెరూన్‌ గ్రీన్‌ (79, 55 బంతుల్లో 97 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో మెరిశాడు. టైటాన్స్‌ పేసర్‌ కగిసో రబాడ (3/29), మహ్మద్‌ సిరాజ్‌ (2/23) రాణించారు. ఛేదనలో చెలరేగిన శుభ్‌మన్‌ గిల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

చెలరేగిన శుభ్‌మన్‌
టైటాన్స్‌ లక్ష్యం 181 పరుగులు. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (86), సాయి సుదర్శన్‌ (22) తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించి ఛేదనకు గట్టి పునాది వేశారు. జోశ్‌ బట్లర్‌ (25) రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో దంచికొట్టాడు. సాయి సుదర్శన్‌, జోశ్‌ బట్లర్‌తో విలువైన భాగస్వామ్యాలు నిర్మించిన శుభ్‌మన్‌ గిల్‌.. టైటాన్స్‌ను గెలుపు దారిలో నడిపించాడు. ఆరు ఫోర్లు, 2 సిక్స్‌లతో 27 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన శుభ్‌మన్‌ గిల్‌కు మిడిల్‌ ఆర్డర్‌ నుంచి పెద్దగా సహకారం లభించలేదు. వాషింగ్టన్‌ సుందర్‌ (13) నిరాశపరిచాడు. ఆఖర్లో గిల్‌ సైతం నిష్క్రమించినా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (19), రాహుల్‌ తెవాటియ (7 నాటౌట్‌0, షారుక్‌ ఖాన్‌ (3 నాటౌట్‌) లాంఛనం ముగించారు. సాధించాల్సిన రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో నైట్‌రైడర్స్‌ బౌలర్లు ఒత్తిడి పెంచలేదు. వరుణ్‌ చక్రవర్తి (2/34), రమణ్‌దీప్‌ సింగ్‌ (1/5) రాణించారు.

ఎట్టకేలకు కామెరూన్‌ గ్రీన్‌
ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ (79) ఎట్టకేలకు వేలం ధరకు న్యాయం చేశాడు. కెప్టెన్‌ అజింక్య రహానె (0) ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్‌ కోల్పోయాడు. రఘువంశీ (8) సైతం నిరాశపరిచాడు. ఓపెనర్‌ టిమ్‌ సీఫర్ట్‌ (19) మెరుపులకు పవర్‌ప్లేలోనే తెరపడింది. 32/3తో కష్టాల్లో కూరుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను కామెరూన్‌ గ్రీన్‌ ఆదుకున్నాడు. రోవ్‌మాన్‌ పావెల్‌ (27)తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించిన కామెరూన్‌ గ్రీన్‌.. ఆ తర్వాత ఓ ఎండ్‌లో ఒంటరి పోరాటం చేశాడు. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన కామెరూన్‌ ఇన్నింగ్స్‌ ఆఖరు బంతిని వికెట్‌ కోల్పోయాడు. రమణ్‌దీప్‌ సింగ్‌ (17), కార్తీక్‌ త్యాగి (6) ఆఖర్లో రాణించారు. టైటాన్స్‌ బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ (2/23), అశోక్‌ శర్మ (2/45) రెండేసి వికెట్లు పడగొట్టగా.. కగిసో రబాడ (3/29) మూడు వికెట్ల ప్రదర్శన కనబరిచాడు.

సంక్షిప్త స్కోరు వివరాలు :
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ : 180/10 (కామెరూన్‌ గ్రీన్‌ 79, రోవ్‌మాన్‌ పావెల్‌ 27, కగిసో రబాడ 3/29, మహ్మద్‌ సిరాజ్‌ 2/23)
గుజరాత్‌ టైటాన్స్‌ : 181/5 (శుభ్‌మన్‌ గిల్‌ 86, జోశ్‌ బట్లర్‌ 25, సాయి సుదర్శన్‌ 19, వరుణ్‌ చక్రవర్తి 2/34)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -