Sunday, April 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమళ్ళీ మూతబడిన హార్ముజ్‌!

మళ్ళీ మూతబడిన హార్ముజ్‌!

- Advertisement -

ట్రంప్‌ ధోరణే కారణమన్న ఇరాన్‌
ఇలా మమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేయలేరు
ట్రంప్‌ హెచ్చరిక ఓటమి రుచి చూపిస్తాం : ఇరాన్‌ సుప్రీం లీడర్‌
ఇరాన్‌ గన్‌బోట్ల కాల్పులు..వెనక్కి మళ్ళిన భారత్‌ నౌకలు
ఇరాన్‌ రాయబారికి సమన్లు
చర్చలకు ఇంకా తేదీ ఖరారు కాలేదన్న ఇరాన్‌
టెహ్రాన్‌,వాషింగ్టన్‌ : హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మళ్ళీ మూసేసింది. లెబనాన్‌లో కాల్పుల విరమణ అమలయ్యేవర కు తెరిచి ఉంచుతామని చెప్పిన ఇరాన్‌ గంటల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇందుకు అమెరికా వైఖరే కారణమని విమర్శించింది. హార్ముజ్‌ను తెరిచినా, అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేవరకు ఇరాన్‌ ఓడరేవుల చుట్టూ అమెరికా దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్‌ ప్రకటించారు. దీంతో వెంటనే ఇరాన్‌ కూడా తమ నిర్ణయాన్ని మార్చుకున్నామని, హార్ముజ్‌పై ఆంక్షలు అమలవుతాయని ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్‌ జాయింట్‌ మిలటరీ కమాండ్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ”హార్ముజ్‌పై నియంత్రణ మళ్లీ పూర్వపు స్థితికి చేరుకుంది. సాయుధ బలగాల కఠిన నియంత్రణ, పర్యవేక్షణ కింద వుంది.” అని ప్రకటించింది. ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా బ్లాకేడ్‌ కొనసాగినంత కాలమూ హార్ముజ్‌ కూడా మూతబడే వుంటుందని హెచ్చరించింది.

హార్ముజ్‌తో బ్లాక్‌ మెయిల్‌ చేయలేరు !
హార్ముజ్‌ జలసంధితో అమెరికాను బ్లాక్‌మెయిల్‌ చేయవద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శనివారం హెచ్చరించారు. ”మేం వారితో మాట్లాడుతున్నాం, వారు మరోసారి జలసంధిని మూసేయాలనుకున్నారు. మీకు తెలుసు, ఏండ్ల తరబడి వారు ఇలా చేస్తున్నారు, వారు ఇలా మమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేయలేరు.” అని వైట్‌హౌస్‌లో ఓ కార్యక్రమంలో ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

ట్యాంకర్‌పై ఇరాన్‌ గన్‌బోట్లు కాల్పులు..
వెనక్కి మళ్ళిన రెండు భారత్‌ నౌకలు

హార్ముజ్‌ జలసంధి వద్ద ఐఆర్‌జీసీ బలగాలు కాల్పులు జరపడంతో భారత్‌కు చెందిన రెండు నౌకలు వెనక్కి తిరిగాయి. వీటిలో 20లక్షల బారెళ్ళ ఇరాక్‌ చమురును తీసుకెళుతున్న భారత్‌ జెండాతో గల సూపర్‌ ట్యాంకర్‌తో సహా మరో నౌక వుందని ట్యాంకర్‌ ట్రాకర్స్‌ డాట్‌ కామ్‌ తెలిపింది. అంతకుముందు హార్ముజ్‌ వద్ద ఒక ట్యాంకర్‌పై ఇరాన్‌ గన్‌బోట్లు శనివారం కాల్పులు జరిపాయని బ్రిటీష్‌ సముద్ర జలాల భద్రతా సంస్థ పేర్కొంది. ఒమన్‌కు ఈశాన్యంగా 37కిలోమీటర్ల దూరంలో ఉన్నపుడు ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ)కి చెందిన రెండు బోట్లు తమను సమీపించి కాల్పులు జరిపాయని ట్యాంకర్‌ కెప్టెన్‌ తెలిపారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే గన్‌బోట్లు దగ్గరకు వచ్చి ట్యాంకర్‌పై కాల్పులు జరిపాయని బ్రిటన్‌ సముద్ర వాణిజ్య కార్యకలాపాల కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ట్యాంకర్‌, సిబ్బంది అందరూ సురక్షితంగానే ఉన్నారని, ఈ కాల్పులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

23నౌకలను వెనక్కి పంపించాం
ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా బ్లాకేడ్‌ను అమలు చేస్తున్న ప్పటి నుండి ఇప్పటివరకు 23నౌకలను వెనక్కి ఇరాన్‌కు పంపిం చామని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ శనివారం తెలిపింది.
తదుపరి చర్చలకు తేదీ ఖరారు కాలేదు
ఇరాన్‌, అమెరికా తదుపరి శాంతి చర్చలకు ఇంకా తేదీ ఖరారు కాలేదని ఇరాన్‌ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్‌ ఖతిబ్‌జాదెబ్‌ శనివారం తెలిపారు. పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో జరిగిన మొదటి దఫా చర్చలు విఫలమయ్యాయి. ”ఫ్రేమ్‌వర్క్‌పై అంగీకారం కుదరనంతవరకు తేదీని ఖరారు చేయలేం” అని ఆయన జర్నలిస్టులకు చెప్పారు. ఉభయ పక్షాల మధ్య అవగాహనా పరిధికి సంబంధించిన వివరాలు ఖరారు చేయడంపైనే ప్రస్తుతం దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. ఈలోగా వైఫల్యానికి దారితీసి, తద్వారా మరోసారి ఉద్రిక్తతలు పెరగడానికి సాకుగా మారే ఏ చర్చలు లేదా సమావేశంలో పాల్గొనాలని మేం కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.

ట్రంప్‌ చాలా ట్వీట్లు చేస్తారు !
ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే మళ్ళీ దాడులేనంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించిన నేపథ్యంలో సయీద్‌ స్పందిం చారు. ”ట్రంప్‌ చాలా ట్వీట్లు చేస్తారు, అంత కంటే చాలా ఎక్కువగా మాట్లాడతారు, ఒకోసారి చాలా గందర గోళంగా వుంటాయి, మరోసారి పూర్తి పరస్పర విరుద్ధంగా వుంటాయి.” అని వ్యాఖ్యానించారు. టర్కీ దౌత్య వేదిక వార్షిక సమావేశం నేపథ్యంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. హార్మూజ్‌ విషయంలో అమెరికా తాననుకున్నది చేయలేదని, జలసంధిని దిగ్బంధించలేదని అన్నారు. జలసంధిని మళ్ళీ మూసేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఓటమి రుచి చూపడానికి సిద్ధంగా వున్నాం
అమెరికా బలగాలను ఓడించి, ఓటమి రుచి చూపడానికి ఇరాన్‌ నావికా దళాలు సిద్ధంగా వున్నాయని ఇరాన్‌ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన టెలిగ్రామ్‌ చానల్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘కొంగొత్త పరాజయాల చేదును శత్రువులకు చవి చూపించడానికి సాహసోపేతాలకు మారుపేరైన ఇరాన్‌ నావికాదళం సిద్ధంగా వుంది.” అని ప్రకటించారు.

రష్యా చమురు కొనుగోలుకు అమెరికా అనుమతి
ఆంక్షలను ఎదుర్కొంటూ సముద్రంలో ఉండిపోయిన రష్యా చమురు కొనుగోలుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నెల రోజుల పాటు అనుమతి ఇచ్చారు. ఇరాన్‌ యుద్ధం కారణంగా భగ్గుమన్న ఇంధన ధరలను అదుపులో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా తెలిపింది. నౌకలలో నింపిన రష్యా చమురును కొనుగోలు చేసేందుకు శుక్రవారం నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకూ…అంటే 30 రోజుల పాటు అనుమతి ఇచ్చామని అమెరికా ఆర్థిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో పోస్ట్‌ చేసిన డాక్యుమెంట్‌ వివరించింది.

భారత్‌ తీవ్ర నిరసన
ఈ ఘటన నేపథ్యంలో భారత్‌ శనివారం ఇరాన్‌ రాయబారి మహ్మద్‌ ఫతాలిని పిలిపించి, తమ తీవ్ర నిరసన తెలియచేసింది. కాగా ఫతాలి ఏ రీతిన స్పందించారనే విషయమై ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. హార్ముజ్‌ను వాణిజ్య కార్యకలాపాల రవాణాకు తెరిచామని శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో అనేక వాణిజ్య నౌకలు జలసంధి దాటేందుకు ప్రయత్నించాయి.

పాక్షికంగా గగనతలాన్ని తెరిచిన ఇరాన్‌
ఇరాన్‌ పాక్షికంగా తన గగనతలాన్ని శనివారం తెరిచింది. తమ దేశం తూర్పు ప్రాంతం మీదుగా అంతర్జాతీయ విమానాలు వెళ్ళేందుకు అనుమతించినట్లు పౌరవిమానయాన శాఖ తెలిపింది. కొన్ని విమానాశ్రయాలను ఈ ఉదయం తెరిచామని వెల్లడించింది. మూడు గంటలు గడిచినా ఒక్క అంతర్జాతీయ విమానం ఇరాన్‌ మీదుగా వెళ్ళలేదని ట్రాకర్‌ వెబ్‌సైట్‌ల ద్వారా తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -