Thursday, September 10, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిద్యకు, ఉపాధికి పొంతనేది?

విద్యకు, ఉపాధికి పొంతనేది?

- Advertisement -

నిటి ఆయోగ్‌ 2026 ఆగస్టు 18న ‘Reimagining Skilling for Viksit Bharat 2047’ పేరుతో విడుదల చేసిన నివేదిక దేశంలోని యువత పరిస్థితిని కండ్లకు కడుతోంది. 2021 నాటి నేషనల్‌ స్టాటిస్టికల్‌ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) గణాం కాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సున్న 8.7 కోట్ల మంది యువత చదువులోగానీ, శిక్షణలో గానీ, ఉపాధిలో గానీ లేరు. దేశంలో దాదాపు 35 కోట్ల మంది యువత ఉంటే, వారిలో సుమారు పాతిక శాతం ఏ విధమైన విద్య, శిక్షణ, ఉపాధికి దూరంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ గణాంకాలు 2021 నాటివి కావడం మరింత ఆందోళనకరం. ఈ ఐదేండ్లలో సాఫ్ట్‌వేర్‌ సహా అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గడం, అటెండర్‌, స్వీపర్‌ వంటి పోస్టులకు కూడా పోస్టుగ్రాడ్యుయేట్లు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి నిరాశాజనక పరిస్థితులు పేపర్‌ లీకులు వంటి అక్రమ మార్గాలకు కూడా కొంతమంది యువతను ప్రోత్సహించే ప్రమాదం ఉంది. 15–29 ఏళ్ల వయస్సు అత్యంత కీలకమైన దశ. ఈ సమయంలో విద్య, ఉన్నత విద్య లేదా ఉపాధికి దారితీసే శిక్షణ లభించకపోతే, తరువాత నైపుణ్యంతో కూడిన ఉపాధిలోకి ప్రవేశించడం కష్టమవుతుంది. 2021 నాటి డేటాను ఐదేళ్ల తర్వాత బహిర్గతం చేయడం ప్రభుత్వ వ్యవస్థలోని నిర్లక్ష్యాన్ని కూడా ప్రశ్నించేలా చేస్తోంది. యువత జీవితంలో ఐదేళ్లు చాలా విలువైన కాలం. ఆ సమయంలో వారికి సరైన దిశ చూపకపోతే, తరువాత ఇచ్చే శిక్షణ కూడా కోల్పోయిన అవకాశాలను పూర్తిగా భర్తీ చేయలేకపోవచ్చు. ఈ సమస్యను కేవలం నిరుద్యోగ గణాంకంగా కాకుండా, దేశ భవిష్యత్తుకు సంబంధించిన మానవ వనరుల సంక్షోభంగా చూడాల్సిన అవసరం ఉంది.

ఉద్యోగానికి గ్యారంటీలేని విద్య
నిటి ఆయోగ్‌ నివేదికలో మరో ముఖ్యమైన అంశం ఏమంటే, ‘నీట్‌’లో ఉన్న యువతలో 88 శాతం మంది గృహ సంబంధిత పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా మహిళలు ఉపాధి అవకాశాలు లేక ఇంటికే పరిమితమవుతున్న పరిస్థితి స్పష్టమవుతోంది. యువత చదువులు కొనసాగించకపోవడానికి ప్రధాన కారణాల్లో ఆర్థిక స్థోమత లేకపోవడం ఒకటని నివేదిక పేర్కొంది. అంతేకాదు, విద్యా వ్యవస్థకు మార్కెట్లో ఉన్న ఉపాధి అవకాశాలకు మధ్య తీవ్రమైన అంతరం ఉందని స్పష్టం చేసింది. డిగ్రీ పొందినంత మాత్రాన ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యం వస్తుందన్న గ్యారంటీ లేదని కూడా పేర్కొంది. అందువల్ల పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యను ప్రారంభించి, దాన్ని ఉన్నత విద్యతో అనుసంధానం చేయాలని సూచించింది. తొమ్మిదో తరగతి నుంచే ‘కౌశల్‌ ట్రాక్స్‌’ వంటి వొకేషనల్‌ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించాలని, ఎంఎస్‌ఎంఈల సహకారంతో వాటిని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రావాలని సూచించింది. శిక్షణ ఏదైనా చివరకు ఉపాధికి దారి చూపేదిగా ఉండాలి తప్ప, కేవలం సర్టిఫికెట్‌ ఇచ్చి వదిలేయకూడదన్నది నివేదిక సారాంశం. విద్యార్థి ఏ కోర్సు చదివినా, ఆ కోర్సు పూర్తయిన తర్వాత ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి, అందుకు అవసరమైన నైపుణ్యాలు ఏమిటి అనే సమాచారం కూడా విద్యా దశలోనే అందాలి. అప్పుడే విద్యకు, ఉపాధికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించగలం. చదువుకు మార్కెట్‌ అవసరాలకు సంబంధం లేకపోతే, విద్యార్థి ఎన్నో సంవత్సరాలు చదివినా చివరకు నిరుద్యోగిగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.

సర్టిఫికెట్‌ కాదు.. ఉపాధే అసలు ప్రమాణం
‘నూతన విద్యా విధానం–2020’ వృత్తి విద్యను ప్రోత్సహించాలని చెప్పినప్పటికీ, దేశంలోని ప్రతి పన్నెండు సెకండరీ పాఠశాలల్లో కేవలం ఒక పాఠశాలలో మాత్రమే వొకేషనల్‌ విద్య కొనసాగుతున్నట్లు నివేదిక చెబుతోంది. ఈ విద్యా విధా నంపై పర్యవేక్షణ కూడా అంతంతమాత్రంగానే ఉంది. అందుకే ఆరో తరగతి నుంచే ‘General Employability and Entrepreneurship Skills’, తొమ్మిదో తరగతి నుంచి ‘కౌశల్‌ ట్రాక్స్‌’ను అమలు చేయాలని నిటి ఆయోగ్‌ సూచిం చింది. 2024–25 నివేదిక ప్రకారం దేశంలో డిగ్రీ పూర్తి చేసిన వారిలో 8.25 శాతం మంది ఉపాధి లేకుండా ఉన్నారు. 25 ఏళ్ల లోపు పట్టభద్రుల్లో నిరుద్యోగుల శాతం ఏకంగా 39గా ఉంది. మరోవైపు ఇప్పటివరకు 7.67 కోట్ల మందికి శిక్షణ ఇచ్చామని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.34 వేల కోట్లు ఖర్చు చేసిందని నివేదిక పేర్కొంది. అయినప్పటికీ 8.7 కోట్ల మంది ‘నీట్‌’లో ఉండటం శిక్షణా కార్యక్రమాల ఫలితా లను ప్రశ్నిస్తోంది. శిక్షణ పొందిన వారి సంఖ్యను లెక్కించడం కంటే, ఆ శిక్షణ ద్వారా ఎంతమంది ఉపాధి పొందారు, ఎంత ఆదాయం సంపాది స్తున్నారు, తరువాత వారి ఉపాధి ఎలా అభివృద్ధి చెందుతోంది అన్నదే అసలు ప్రమాణంగా ఉండా లి. సరైన శిక్షణ, సర్టిఫికేషన్‌, ఉపాధి, ఆదా యం, క్రమబద్ధమైన ఎదుగు దల ఉన్నప్పుడే నిజమైన మానవ వనరులను తయారుచేసినట్ల వుతుంది. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి శిక్షణ ఇచ్చా మని చెప్పడం కంటే, ఆ శిక్షణతో ఎన్ని కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయో ప్రభుత్వం లెక్కించాలి. శిక్షణ పొందిన వ్యక్తికి సంబంధిత రంగంలో ఉద్యోగం లేదా స్వయం ఉపాధి లభించిందా లేదా అన్నదే ప్రతి పథకం విజయానికి ప్రధాన కొలమానంగా ఉండాలి.

ఎనభై శాతం శ్రామికశక్తికి భద్రత లేదు
నిటి ఆయోగ్‌ గణాంకాలు దేశంలోని శ్రామికశక్తి నిర్మాణాత్మక బలహీనతను కూడా వెల్లడిస్తున్నాయి. మొత్తం 65.4 కోట్ల శ్రామికశక్తిలో 58.4 శాతం స్వయం ఉపాధి, 21.7 శాతం రెగ్యులర్‌ వేతన ఉద్యోగులు, 19.8 శాతం క్యాజువల్‌ లేబర్‌గా ఉన్నారు. అంటే దాదాపు 80 శాతం మందికి స్థిరమైన, నిర్మాణాత్మక ఉపాధి లేదు. కేవలం 20 శాతం మంది మాత్రమే రెగ్యులర్‌ వేతన ఉద్యోగాల్లో ఉన్నారు. దేశంలో 27 కోట్ల మంది ఎలాంటి సామాజిక భద్రత లేకుండా ఉన్నారని నివేదిక చెబుతోంది. మహిళల్లో కేవలం మూడు శాతం మంది మాత్రమే ఫార్మల్‌ ఉపాధిలో ఉండగా, 71 శాతం మంది ఇన్‌ఫార్మల్‌ పనుల్లో లేదా ‘నీట్‌’ విభాగంలో ఉన్నారు. అలాగే 47 శాతం మహిళలు, 43 శాతం యువత, ఉన్నత విద్యలోని 36 శాతం మంది, ఫార్మల్‌ వర్కర్లలో 52 శాతం, ఇన్‌ఫార్మల్‌ వర్కర్లలో 55 శాతం మందికి తమకు సరిపోయే శిక్షణను గుర్తించి పొందడంలో ఇబ్బందులు ఉన్నాయని నివేదిక పేర్కొంది. శిక్షణ పొందేందుకు ప్రయాణం, ఇతర ఖర్చులు కూడా పేద యువతకు భారంగా మారుతున్నాయి. అందువల్ల ‘నీట్‌’లో ఉన్న 8.7 కోట్ల మంది యువతను వెంటనే ఉపాధి వైపు మళ్లించాలి. పాఠశాల నుంచే వృత్తి విద్యను, ఉపాధికి అనుసంధానమైన విద్యను అందించాలి. ఇప్పటికే శిక్షణ పొందిన 7.6 కోట్ల మందిని సంబంధిత ఉపాధిలోకి తీసుకురావాలి. ముఖ్యంగా ఉపాధికి దూరంగా ఉన్న మహిళలకు ప్రత్యేక శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వ విధానాలను రూపొందించాలి. వికసిత్‌ భారత్‌ అంటే కేవలం మౌలిక వసతులు, భారీ ప్రాజెక్టులు మాత్రమే కాదు. యువతకు స్థిరమైన ఉపాధి, గౌరవప్రదమైన ఆదాయం, మహిళలకు సమాన అవకాశాలు, కార్మికులకు సామాజిక భద్రత లభించినప్పుడే అది నిజమైన అభివృద్ధిగా భావించాలి. ‘నీట్‌’లో ఉన్న యువతను వదిలిపెట్టి 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధిస్తామని చెప్పడం ఆచరణలో సాధ్యం కాదు. కేవలం సర్టిఫికెట్లతో కాదు.. ఉపాధి, ఆదాయం, భద్రతతోనే నైపుణ్య భారతాన్ని నిర్మించాలి.

గూళ్ల తిరుపతయ్య, 9951300016

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -