నవతెలంగాణ-కాటారం
వంటగ్యాస్ సరఫరాలో నెలకొన్న సమస్యలతో సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాటారంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం అమల్లో ఉన్న గ్యాస్ బుకింగ్ విధానం గ్రామీణ ప్రజలకు భారంగా మారిందన్నారు.
గ్రామాల్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత డెలివరీకి కనీసం 15 నుంచి 20 రోజులు పట్టడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా బుకింగ్ విధానం తెలియని వృద్ధులు, అక్షరాస్యత తక్కువగా ఉన్న వారు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పాత విధానంలోనే ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ఇక కమర్షియల్ గ్యాస్ విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని కిరణ్ పేర్కొన్నారు. మార్కెట్‌లో సుమారు ₹1850 ఉండాల్సిన కమర్షియల్ సిలిండర్‌ను ₹3000 వరకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. అలాగే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ కూడా ₹1000 బదులు ₹2000కు అమ్ముతున్నారని అన్నారు. గ్యాస్ గోదాముల వద్ద బ్లాక్ మార్కెట్ దందా బహిరంగంగానే సాగుతున్నప్పటికీ, అధికారులు తనిఖీలు చేపట్టడం లేదని విమర్శించారు.
చిన్న హోటల్ యజమానులు, టీ స్టాళ్ల నిర్వహకులు, బజ్జీ బండ్ల వ్యాపారులు ఈ పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వ్యాపారం సరిగా లేకపోయినా, అధిక ధరలకు గ్యాస్ కొనాల్సి వస్తోందని వారు వాపోతున్నారని చెప్పారు. కొందరు డెలివరీకి ముందే ఓటీపీ తీసుకుని, ఆ సిలిండర్లను ఇతరులకు బ్లాక్‌లో అమ్ముతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయని ఆరోపించారు.
జిల్లాలోని భూపాలపల్లి, మహాదేవపూర్, కాటారం ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, గోదాములను తనిఖీ చేసి ప్రజలకు సక్రమంగా సరఫరా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ను టీపీఎఫ్ తరఫున విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో యుఐ ఐఎఫ్‌ఐ అధ్యక్షుడు అక్కల బాపు, నాయకపోడు సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకరి మల్లయ్య, మహిళా నాయకురాలు కాలినేని రాజమణి తదితరులు పాల్గొన్నారు.



