– వృద్ధులకు ధాన్యం, నిత్యావసర సరుకుల పంపిణీ
నవతెలంగాణ – అశ్వరావుపేట
అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్న “అమ్మ సేవా సదనం” వృద్ధాశ్రమాన్ని గురువారం సందర్శించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్. జె. హేమంత కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడింది. వృద్ధాశ్రమం నిర్వాహకురాలు భవాని ఆశ్రమ స్థాపన, నిర్వహణ, ప్రస్తుతం అందిస్తున్న సేవల గురించి విద్యార్థులకు వివరించారు. ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు అందుతున్న సహాయ సహకారాలను కూడా తెలియజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తమ సేవా భావాన్ని ప్రదర్శిస్తూ వృద్ధులకు ధాన్యపు బస్తాలు, నూనె డబ్బా, పండ్లు వంటి నిత్యావసర వస్తువులను బహుమతిగా అందజేశారు. మేఘన, సుధాకర్, అశ్విన్, ఇమ్రాన్, మల్లికార్జున్, సాధన, హరిక తదితర విద్యార్థులు వృద్ధులతో సమయం గడిపి, వారి జీవిత విశేషాలను తెలుసుకున్నారు. అలాగే చిన్న చిన్న ఆటలు ఆడించి వారిలో ఉన్న ఒంటరితనాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్. పి. ఝాన్సీ రాణి, డి. స్రవంతి మాట్లాడుతూ విద్యార్థుల్లో సేవా భావాన్ని పెంపొందించడంలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు మరియు వృద్ధాశ్రమం సిబ్బంది పాల్గొన్నారు.



