రాష్ట్రంలో పడకేసిన వాహన కాలుష్య పరీక్షలు
ఈ-చలాన్ల వేటలోనే పోలీసులు.. గాలికొదిలేసిన ఆర్టీఏ
రోజుకు రెండు, మూడు టెస్టులే.. బోసిపోతున్న కేంద్రాలు!
‘ఐఆర్‌డీఏఐ’ తరహాలో ‘పీసీబీ’ డేటాను ‘వాహన్’కు అనుసంధానించాలి
పొరుగు రాష్ట్రాల్లో కఠినం.. మన దగ్గర అంతా ఉదాసీన వైఖరి
ఇన్సూరెన్స్, ఆర్టీఏ సేవలకు లింక్ చేస్తేనే దారిలోకి వచ్చే అవకాశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఒకవైపు నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది.. మరోవైపు రోడ్లపై పొగలు కక్కుతూ తిరిగే వాహనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అయినా సంబంధిత అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. వాహనాల పొగ తీవ్రతను గుర్తించి జారీ చేయాల్సిన ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్’(పీయూసీ) సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ రాష్ట్రంలో పూర్తిగా అటకెక్కింది. ఇతర రాష్ట్రాల్లో పీయూసీ లేకపోతే భారీగా జరిమానాలు విధిస్తూ కఠిన చర్యలు తీసుకుంటుంటే.. మన రాష్ట్రంలో మాత్రం ఆ ఊసే కనిపించడం లేదు. ట్రాఫిక్ పోలీసులు కేవలం ఈ-చలాన్లు రాయడానికే పరిమితం కావడం, రవాణా శాఖ(ఆర్టీఏ) చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో వాహనదారులు కాలుష్య పరీక్షలకు ఏండ్ల తరబడి ‘డుమ్మా’ కొడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా వాహనాలు రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. కానీ కాలుష్య పరీక్షా కేంద్రాల్లో పరిస్థితి చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రధాన రోడ్లపై, పెట్రోల్ బంకులు, ప్రధాన రహదారుల వెంట ఉండే మొబైల్ టెస్టింగ్ వాహనాల్లో రోజుకు కనీసం రెండు లేదా మూడు పరీక్షలు కూడా జరగడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆన్‌లైన్ స్క్రీన్లలో ‘రోజువారీ లావాదేవీలు’(పీయూసీ టుడే) సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతున్నాయి. టెస్టింగ్ సెంటర్ల నిర్వాహకులు రోజంతా వాహనదారుల కోసం ఎదురుచూసి ఈగలు తోలుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో పొల్యూషన్ సర్టిఫికెట్స్ జారీ చేసే వాహనాల సంఖ్య 550కు గాను 400కి తగ్గింది.
పొరుగున ‘పకడ్బందీ’.. మన దగ్గర ‘పడకేసింది’
పొరుగు రాష్ట్రమైన కర్నాటకలో కాలుష్య నియంత్రణపై పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. పరీక్షల రుసుములను పెంచడంతో పాటు(టూవీలర్లకు రూ.80, కార్లకు రూ.150, డీజిల్ వాహనాలకు రూ.200).. టెస్టింగ్ సెంటర్లకు జియో-ఫెన్సింగ్, మెషీన్ల రీ-క్యాలిబ్రేషన్, బీఎస్-6 వాహనాలకు ఏడాది వ్యాలిడిటీ, ప్రతి పత్రానికి క్యూఆర్ కోడ్ విధానాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. తెలంగాణలో 2023లో నామమాత్రంగా ఫీజులు పెంచినప్పటికీ(టూవీలర్ రూ.50, కారు రూ.75, డీజిల్ రూ.100), తనిఖీల యంత్రాంగాన్ని మాత్రం కనుమరుగు చేసేశారు.
మెషీన్ల క్యాలిబ్రేషన్ బాధ్యత పీసీబీదే కావాలి
వాహనాల నుంచి కార్బన్ డయాక్సైడ్, ఇతర ప్రమాదకర వాయు ఉద్గారాలు ఏ మోతాదులో వెలువడుతున్నాయి? పర్యావరణ ప్రమాణాలు ఎలా ఉండాలనేది నిర్ధారించాల్సిన ప్రాథమిక బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)దే. లీగల్ మెట్రాలజీ విభాగం ఏ విధంగానైతే పక్కాగా తనిఖీలు చేపట్టి పరికరాల నాణ్యతను పరిశీలిస్తుందో.. అలాగే కాలుష్య పరీక్షా కేంద్రాల్లోని గ్యాస్ ఎనలైజర్లు, స్మోక్ మీటర్లను కూడా పీసీబీ ఇంజినీర్లే నేరుగా రీ-క్యాలిబ్రేషన్ చేసి సర్టిఫై చేయాలి. ప్రత్యేక వెబ్‌సైట్‌ను పీసీబీనే నిర్వహిస్తూ, క్యాలిబ్రేషన్ డాక్యుమెంట్లు, టెస్టింగ్ రికార్డులను అక్కడి నుంచే ‘వాహన్’ పోర్టల్‌కు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసేలా వ్యవస్థను రూపొందించాలి. దీనివల్ల ప్రైవేట్ టెస్టింగ్ కేంద్రాల్లో బోగస్ రీడింగులకు ఆస్కారం ఉండదు.
ఉమ్మడి తనిఖీలు చేపట్టాలి..
నగరంలో వాహనాల విష పొగల వల్ల చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా నిద్ర మత్తు వీడి ఆర్టీఏ, ట్రాఫిక్ విభాగాలు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి.. పీయూసీ లేని వాహనాలకు భారీ జరిమానాలు విధించాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
‘వాహన్’తో అనుసంధానం చేయాలి
పీయూసీ పరీక్షలు సక్రమంగా జరగాలంటే నిబంధనలను ఇతర సేవలకూ ముడిపెట్టాలని ‘తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్స్’ సర్కారును కోరుతోంది. ప్రస్తుతం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏఐ) డేటా నేరుగా కేంద్ర రవాణా శాఖకు చెందిన ‘వాహన్’ పోర్టల్‌తో అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల ఇన్సూరెన్స్ చేయించగానే వివరాలు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయి. సరిగ్గా ఇదే తరహాలో వాహన కాలుష్య నియంత్రణ డేటాను సైతం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో ‘వాహన్’ పోర్టల్‌కు అనుసంధానించాలని నిపుణులు, సంఘాల ప్రతినిధులు సూచిస్తున్నారు. దీంతో పాటు వాహన బీమా రెన్యువల్ చేసే సమయంలో చెల్లుబాటు అయ్యే పీయూసీ పత్రం తప్పనిసరి చేయాలి. అలాగే వాహనాల యాజమాన్య బదిలీ, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్ల రెన్యువల్స్ సమయంలో చెల్లుబాటయ్యే పీయూసీ సర్టిఫికెట్ ఉంటేనే ఆమోదించేలా నిబంధనలు తెస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టెస్టులు చేయించుకుంటారని అసోసియేషన్ స్పష్టం చేస్తోంది.
చలాన్లపైనే శ్రద్ధ..పొగపై నిఘా ఏదీ?
హెల్మెట్ లేదు, సీటు బెల్టు పెట్టుకోలేదు, సిగ్నల్ జంపయ్యింది.. ఇలాంటి వాటికి కెమెరాల ద్వారా ఈ-చలాన్లు పంపించడంలో చూపిస్తున్న శ్రద్ధ.. వాహనాలు వెదజల్లుతున్న విషవాయువులపై అధికారులు చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం ఎప్పుడో మానేశారు.
గాల్లో కాలుష్యం..పీయూసీకి పంగనామం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



