Thursday, April 16, 2026
E-PAPER
Homeఆటలుకదంతొక్కిన బెంగళూరు బౌలర్లు

కదంతొక్కిన బెంగళూరు బౌలర్లు

- Advertisement -

లక్నో సూపర్‌జెయింట్స్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ ఘన విజయం
వరుస విజయాలతో టాప్‌లోకి
బెంగళూరు:
చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) బౌలర్లు సమిష్టిగా చెలరేగారు. దీంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై ఐదు వికెట్ల తేడాతో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 146పరుగులకే ఆలౌట్‌ కాగా.. అనంతరం బెంగళూరు 15.1ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 149పరుగులు చేసి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. కోహ్లి(49), పటీధర్‌(27), జితేశ్‌ శర్మ(23) బ్యాటింగ్‌లో రాణించారు. ఛేదనలో భాగంగా బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ సాల్ట్‌(7) మరోసారి నిరాశపరిచాడు. దీంతో బెంగళూరు 9పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత పడిక్కల్‌-కోహ్లి జంట అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో పడిక్కల్‌(10)ను ఆవేశ్‌ ఖాన్‌ ఔట్‌ చేయడంతో 66పరుగుల వద్ద బెంగళూరు రెండో వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ రజత్‌ పటీధర్‌, జితేశ్‌ శర్మ సమయస్ఫూర్తిగా ఆడి బెంగళూరును విజయానికి చేరువ చేశారు. ఈ క్రమంలో అర్ధసెంచరీకి ఒక్క పరుగు దూరంలో కోహ్లి ఔటయ్యాడు. ఆవేశ్‌ఖాన్‌ బౌలింగ్‌లో పూరన్‌ క్యాచ్‌ అందుకోవడంతో కోహ్లి ఇన్నింగ్స్‌ ముగిసింది. చివర్లో టిమ్‌ డేవిడ్‌, షెఫర్డ్‌ మ్యాచ్‌ను ముగించారు. దీంతో బెంగళూరు 15ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. లక్నో బౌలర్లు ప్రిన్ష్‌ యాదవ్‌కు మూడు, ఆవేశ్‌ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీకి బౌలర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. లక్నో జట్టు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌(1), నికోలస్‌ పూరన్‌ (1) వంటి కీలక బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమై పెవిలియన్‌ చేరారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మిచెల్‌ మార్ష్‌ (40) కాసేపు పోరాడాడు. చివర్లో ఆయుష్‌ బదోని(38), ముకుల్‌ చౌదరి(39) వేగంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించే ప్రయత్నం చేశారు. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి వారికి సహకారం అందలేదు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్‌ సలామ్‌ నాలుగు వికెట్లతో కెరీర్‌ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగా, భువనేశ్వర్‌ కుమార్‌ కీలక సమయాల్లో మూడు వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టాడు. వారికి తోడుగా జోష్‌ హేజిల్‌వుడ్‌ (1/20) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయగా, కనాల్‌ పాండ్య రెండు వికెట్లు పడగొట్టాడు. బౌలర్ల సమష్టి ప్రదర్శనతో ఆర్సీబీ… లక్నోను స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. బెంగళూరు బౌలర్లు సలామ్‌ దార్‌కు నాలుగు, భువనేశ్వర్‌కు మూడు, కృనాల్‌ పాండ్యాకు రెండు, హేజిల్‌వుడ్‌కు ఒక వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సలామ్‌ దార్‌కు దక్కింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -