Thursday, April 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజూన్‌ వరకు అధిక ఉష్ణోగ్రతలు

జూన్‌ వరకు అధిక ఉష్ణోగ్రతలు

- Advertisement -

ఆరెంజ్‌, రెడ్‌ అలర్ట్‌లకు అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మార్గదర్శకాలు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఈనెల నుంచి జూన్‌ వరకు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని రెవెన్యూ విపత్తు, నిర్వహణ శాఖ తెలిపింది. ఆరెంజ్‌, రెడ్‌ అలర్ట్‌లను ప్రకటించే అవకాశముందని పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండా లని సూచించింది. ఈ మేరకు రెవెన్యూ విపత్తు, నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిశోర్‌ బుధవారం మార్గదర్శకాలను జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు తగు సూచనలు చేశారు. భారత మెట్రోలాజికల్‌ శాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశముందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదు కావొచ్చని పేర్కొన్నారు. సాధారణం కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 4.5 డిగ్రీల సెల్సియస్‌ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం వంటి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మార్చి నుంచి వేడి తీవ్రత ప్రారంభమైందని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌లు జారీ చేశామని తెలిపారు. మే, జూన్‌ ప్రారంభంలో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వివరించారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, బహిరంగ కార్మికులు (వ్యవసాయం, నిర్మాణం, రవాణా), పట్టణ పేదలు, మురికివాడల్లోని నివాసితులు, పశువులు, వన్యప్రాణులపై ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాల అధికారులు పలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రత యాక్షన్‌ ప్లాన్‌లను పరిశీలించాలని సూచించారు. ప్రజలకు అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. ముఖ్యప్రదేశాల్లో కూలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తాగునీరు, చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను, ప్రథమ చికిత్స సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆరోగ్య శాఖ ద్వారా అధిక ఉష్ణోగ్రత చికిత్సకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని కోరారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లడాన్ని తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తేలికపాటి దుస్తులను ధరించాలని తెలిపారు. తల కప్పుకోవాలని పేర్కొన్నారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి పానీయాలు తీసుకోవాలని సూచించారు. మద్యపానం, కాఫీ, కార్బొనేటెడ్‌ పానీయాలను నివారించాలని కోరారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లాలని తెలిపారు. శరీరాన్ని చల్లబరచి వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -