– భారీగా తరలివచ్చిన విప్లవ అభిమానులు
– అంతిమయాత్రలో అడుగడుగునా పోలీసుల నిఘా
– హాజరైన ప్రజా సంఘాల నేతలు
నవతెలంగాణ-మిరుదొడ్డి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు భాగ్య అలియాస్(రూపి రెడ్డి) అంత్యక్రియలు బుధవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో జరిగాయి. మంగళవారం రాత్రి స్వగ్రామానికి భాగ్య మృతదేహం చేరుకుంది. బుధవారం గ్రామస్తులు, ఉద్యమకారులు, విప్లవ సంఘాల నేతలు, అభిమానులు, ప్రజాసంఘాల నేతలు తరలివచ్చి ఆమె మృతదేహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అంతిమయాత్ర ప్రారంభం కాగా.. పలువురు ఉద్యమకారులు పాటలు పాడుతూ.. ఆటలాడుతూ ముందుకు సాగారు. అనంతరం వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు పూర్తి చేశారు. భాగ్య తమ్ముడు అక్కకు తలకొరివి పెట్టాడు. పోలీసులు అడుగడుగునా నిఘా పెట్టారు.
శోకసంద్రంలో ధర్మారం..
భాగ్య మృతితో ధర్మారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సుమారు 25 ఏండ్ల కిందట ఉద్యమంలోకి వెళ్లిన భాగ్య.. చివరికి విగతజీవిగా తిరిగి రావడంతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. బిడ్డ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురుని కంటతడి పెట్టించింది. అమరవీరుల బంధుమిత్రుల కమిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పద్మ కుమారి, అధ్యక్షురాలు అంజమ్మ, ఉపాధ్యక్షులు శాంత, సంధ్య, సహాయ కార్యదర్శి భవాని, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శోభ, విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి పాణి, బాలసని రాజయ్య, పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సహాయక కార్యదర్శి కుమారస్వామి, అధ్యక్షులు లక్ష్మణ్, పూర్వ విద్యార్థుల సంఘం వేదిక నాయకులు రవి, రమణ, ఓంబ్రహ్మం, కుల నిర్మూలన పోరాట సమితి సభ్యులు అభినరు, టిపిఎఫ్ సత్యం, మల్లేశం తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
మావోయిస్టు భాగ్యకు కన్నీటి వీడ్కోలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



