– సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు,
మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మనువాదంపై పోరాటమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు చెప్పారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సీతరాములుతో పాటు టీపీఎస్‌కే కన్వీనర్ జి రాములు, టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్ పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగంలో పొందుపరిచారని గుర్తు చేశారు. ఆ రాజ్యాంగాన్ని రద్దుచేసి మనువాదంతో కూడిన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాలని కుట్రలు చేస్తోందని విమర్శించారు. అంబేద్కర్ జీవితాంతం అంటరానితనం, అణిచివేతలకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. జి.రాములు మాట్లాడుతూ దేశాన్ని పట్టిపీడిస్తున్న కుల అసమానతలపై సామాజిక, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలను మరింత ప్రోత్సహించాలని చెప్పారు. అందుకే స్వకుల వివాహాలను వ్యతిరేకిద్దాం, బహిష్కరిద్దాం, నిషేధిద్దాం, రద్దు చేద్దాం వంటి నినాదాలు ముందుకు రావాల్సిన అవసరముందన్నారు. ఆర్ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న విలువైన అటవీ సంపదను అంబానీ ఆదానీలకు కట్టబెట్టేందుకు అటవీ సంరక్షణ పేరుతో 2023లో బీజేపీ ప్రభుత్వం చట్టం చేసిందని తెలిపారు. ఆ చట్టం వల్ల కోట్లాదిమంది ఆదివాసీ గిరిజనులు అడవుల నుండి గెంటి వేయబడతారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ పోరాట స్ఫూర్తితో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మరో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
మనువాదంపై పోరాటమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



