Thursday, April 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరోజారాణి మరణం శ్రామికోద్యమానికి తీరని లోటు

రోజారాణి మరణం శ్రామికోద్యమానికి తీరని లోటు

- Advertisement -

– ఆమె గొప్ప మానవతావాది
– ఉద్యోగం, ఉద్యమం, కుటుంబాన్ని సమన్వయంతో నడిపిన ఆదర్శ వనిత
– రోజారాణి సంతాప సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

‘రోజా రాణి మరణం శ్రామికోద్యమానికి తీరని లోటు. విద్యార్థి ఉద్యమంలో చురుకైన కార్యకర్తగా పని చేయటమే గాక, వివాహ అనంతరం కార్మికోద్యమాల్లోనూ, ప్రజాతంత్ర పోరాటాల్లోనూ ఆమె పాత్ర మరవలేనిది’ అని పలువురు వక్తలు నివాళులర్పించారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు అధ్యక్షతన రోజారాణి సంతాప సభను నిర్వహించారు. ఆమె చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సీఐటీయూ ఉమ్మడి రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి ఆర్‌ సుధాభాస్కర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ మాట్లాడుతూ రోజారాణి దుర్మరణం చెందటం జీర్ణించుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఉమ్మడి రాష్ట్రంలో యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా, సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యురాలుగా పనిచేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ బాధ్యతల్లో చేరి అక్కడా ఉత్తమ అధికారిగా పేరు తెచ్చుకోవటమే గాక, కార్మికోద్యమానికి, శ్రామిక మహిళా ఉద్యమానికి, ప్రజాతంత్ర ఉద్యమానికి వీలైన సహకారాన్ని అందించారని గుర్తు చేశారు. ఆమె మంచి విమర్శకురాలనీ, గొప్ప మానవతావాదని తెలిపారు.

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఉపాధ్యక్షులు బండారు రవికుమార్‌, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ అరుణజ్యోతి, ఏఐఐఈఏ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ కార్యదర్శి జి తిరపతయ్య, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ నాయకులు రాజ్‌భట్‌, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, ఎం వెంకటేశ్‌, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్‌ అరిబండి ప్రసాద్‌రావు, అర్బన్‌ డవలఫ్‌మెంట్‌ ఫోరం కన్వీనర్‌ ఎం శ్రీనివాస్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఏ వెంకటేశ్‌, సీపీఐ(ఎం) సీనియర్‌ నేత డీజీ నర్సింహారావు, ఐద్వా సీనియర్‌ నాయకులు కెఎన్‌ ఆశాలత, నవతెలంగాణ బ్యూరో చీఫ్‌ బీవీఎన్‌ పద్మరాజు, టీపీఎస్‌కే కన్వీనర్‌ జి రాములు, సీఐటీయూ నగర కార్యదర్శి జె కుమారస్వామి ప్రజాతంత్ర ఉద్యమప్రస్తానంలో రోజాతో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

‘రోజా సాధారణ ఉద్యోగిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం గెజిటెడ్‌ ఆఫీస్‌ స్థాయి హోదాలో ఉన్నా ఉద్యమ లక్ష్యాన్ని వీడలేదు. ఎక్కడ పని చేస్తున్నా..ఏ స్థాయి ఉద్యోగం చేస్తున్నా.. శ్రామికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల పక్షపాతిగా ఉండేవారు. కుటుంబం, ఉద్యమం, వృత్తిలోనూ సమన్వయంతో పని చేయటంలో ఆమెకు ఆమే సాటి. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జె వెంకటేశ్‌కు చేదోడు వాదోడుగా ఉంటూనే..మరింత ఎక్కువ సమయం ఉద్యమానికి వెచ్చించేందుకు తగిన సహకారాన్ని అందించటం సాధారణ విషయం కాదు. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా, ఎవరి బతుకు వారు బతకటం ఉత్తమమని ప్రేరిపిస్తున్న ప్రస్తుత పెట్టుబడిదారి సమాజంలో ఆమెకు అన్ని అవకాశా లున్నా..అందరి బాగోగుల గురించి ఆలోచించటం చూస్తే..వర్గ పోరాటాల పట్ల ఆమె కమిట్‌మెంట్‌ అందరికీ స్ఫూరి దాయకం. జేవీ, రోజాల జీవన విధానం ఆదర్శమైనది’. ‘మరణం నా చివరి చరణం కాదు. మౌనం నా చితా భస్మం కాదు.నిర్విరామంగా, నిత్యనూతనంగా కాలం అంచున చిగురించే నెత్తుటి ఊహను నేను’ అని అలిశెట్టి చెబుతాడు. ఆ స్ఫూర్తితో రోజా లక్ష్యాన్ని, ఆశయాన్ని ముందుకు తీసుకుపోవటమే ఆమెకు మనమిచ్చే నిజమైన నివాళి’.అని వక్తలు ఆమెను స్మరించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -