కానిస్టేబుల్ సస్పెన్షన్..
ఉన్నతాధికారులపై వేటు!
పూర్తిస్థాయి విచారణకు రవాణా శాఖ
కమిషనర్ ఆదేశం
ఏజెంట్లను రానిస్తే కఠిన చర్యలు
తప్పవని హెచ్చరిక
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని బండ్లగూడ రవాణా శాఖ(ఆర్టీవో) కార్యాలయంలో నగదు లెక్కింపు ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై రవాణా శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. కార్యాలయంలో బహిరంగంగా నగదు లెక్కిస్తూ అడ్డంగా దొరికిపోయిన కానిస్టేబుల్ అరుణ్‌ను సస్పెండ్ చేయడంతో పాటు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టారు. బండ్లగూడ ఆర్టీవో ఆఫీసులో కానిస్టేబుల్ అరుణ్ భారీగా నగదు లెక్కిస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై పత్రికలు, టీవీ మాద్యమాల్లో విస్తృతంగా కథనాలు ప్రసారమయ్యాయి. ఈ వ్యవహారాన్ని రవాణా శాఖ కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. ప్రాథమిక విచారణ అనంతరం కానిస్టేబుల్ అరుణ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉదంతంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
బాధ్యతల నుంచి అధికారుల తొలగింపు
కార్యాలయంలో ఏజెంట్లను అనుమతించడం, తగిన పర్యవేక్షణ కొరవడటం వంటి ఆరోపణల నేపథ్యంలో మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్(ఎంవీఐ) భీమ్ సింగ్, ఆర్టీవో రామ్‌చందర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. వారిద్దరినీ తక్షణమే బాధ్యతల నుంచి తప్పిస్తూ, రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు.
ఏజెంట్లను అనుమతిస్తే చర్యలు తప్పవు
కమిషనర్ హెచ్చరిక ఆర్టీవో కార్యాలయాల్లోకి దళారులు, ఏజెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తీ స్పష్టం చేశారు. ఎవరైనా ఏజెంట్లను ప్రోత్సహించినా, కార్యాలయాల్లోకి అనుమతించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత ఆర్టీవోలనే నేరుగా బాధ్యులను చేస్తామని, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు.
బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో ‘క్యాష్’ కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



