నవతెలంగాణ-నాచారం
అవార్డు గ్రహీత, ప్రముఖ సంఘసేవకులు కీ.శే. మెండ మురళి వర్ధంతి సందర్భంగా మల్లాపూర్ అంబేద్కర్ భవన్‌లో మంగళవారం ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పాల్గొని మెండ మురళి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మెండ మురళి దళితుల అభ్యున్నతి, సామాజిక న్యాయం, ప్రజా సేవల కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. ప్రజా సంక్షేమం పట్ల ఆయన చూపిన అంకితభావం యువతకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
మాజీ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మెండ మురళి ఆశయాలను కొనసాగిస్తూ సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, సామాజిక కార్యకర్తలు కలిసి మెండ మురళి సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, అభిమానులు మరియు స్థానికులు పాల్గొన్నారు.



