Saturday, April 18, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఒకరి కోసం ఒకరు

ఒకరి కోసం ఒకరు

- Advertisement -

భార్యా భర్తలు అన్యోన్యంగా, సంతోషంగా ఉండాలంటే పరస్పర గౌరవం, ప్రేమ చాలా ముఖ్యం. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఒకరి మనోభావాలను ఒకరు అర్థం చేసుకోవాలి, ప్రశంసించుకోవాలి. బాధ్యతలు పంచుకోవాలి. అలాగే వ్యక్తిగత స్వేచ్ఛ కూడా చాలా ముఖ్యం. చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు జరిగినప్పుడు క్షమించే గుణం వుండాలి. భార్యాభర్తల మధ్య అహం అస్సలు పనికిరాదు. ఇలాంటి చిన్న చిన్నవి పాటించడం వల్ల ఇద్దరూ ఆనందంగా జీవితాన్ని గడొపొచ్చు. ఫలితంగా కుటుంబంలోని అందరూ ముఖ్యంగా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వారిగా ఉంటారు. లేదంటే మొదటికే మోసం వస్తుంది. అలాంటి ఓ కథనంతోనే ఈ వారం ఐద్వా అదాలత్‌ మీ ముందుకు వచ్చింది.

స్వాతి, కిరణ్‌లకు పెండ్లి జరిగి రెండేండ్లు అవుతుంది. ఇంకా పిల్లలు లేరు. ఇద్దరివి చిన్న కుటుంబాలే. ఇద్దరూ ప్రయివేటు సంస్థలో ఉద్యోగస్తులు. ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. అంతా బాగానే ఉంది. అయినప్పటికీ ప్రతి చిన్న విషయానికి వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియడం లేదు. దాంతో సలహా కోసం కిరణ్‌ వాళ్ల అక్క ఇద్దరినీ తీసుకుని ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చింది.
మేము కిరణ్‌ వాళ్ల అక్కతో పాటు ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడాం. స్వాతి చెప్పేది ఏమిటంటే ‘మా పెండ్లి జరిగి రెండేండ్లు అవుతుంది. కానీ కిరణ్‌ నాకోసం సమయమే కేటాయించడు. అసలు అతనికి ఏ కలర్‌ అంటే ఇష్టం, ఏ కూర ఇష్టంగా తింటాడు, ఆయన ఇష్టాయిష్టాల గురించి నాకు ఏమాత్రం అవగాహన లేదు. రోజులో కనీసం నాతో ఐదు నిమిషాలు కూడా మాట్లాడడు. అసలు ఇద్దరి మధ్య ప్రేమ, అప్యాయత, అన్యోన్యత లాంటివి ఏమీ లేవు.
మేమిద్దరం ఉద్యోగస్తులం. ఉదయం వెళితే సాయంత్రం వస్తాం. ఎలాగో ఇంట్లో పెద్దగా మాట్లాడుకోవడానికి కుదరడం లేదు. కనీసం ఆఫీసులో లంచ్‌ టైంలో అయినా ఫోన్‌ చేసి ‘తిన్నావా’ అని అడగొచ్చు కదా! అదీ చేయరు. నేను ఫోన్‌ చేసినా విసుక్కుంటారు. ‘ఏం చేస్తున్నావు, తిన్నావా’ అని అడగటానికి ఎంత టైం పడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంట్లో పని మొత్తం చేసుకునే సరికి పదకొండు అవుతుంది. తిరిగి ఉదయం ఎనిమిది గంటలకు వెళ్లిపోవాలి. జీవితంలో చిన్న చిన్న ఆనందాలైనా వుండాలి కదా! ఎప్పుడైనా నేను గొడవ చేసినా, అలిగినా నేనే మాట్లాడాలి. అంతేగానీ అతను మాత్రం మాట్లాడడు. అప్పుడప్పుడు ‘నాతో ఆయనకు బలవంతంగా ఏమైనా పెండ్లి చేశారా’ అనిపిస్తుంది.

నేను చెప్పే సమస్యలు అందరికీ చిన్న విషయాలుగానే అనిపిస్తాయి. కానీ నాకు మాత్రం చాలా బాధగా ఉంటుంది. నా మనసు అర్థం చేసుకొని మా ఆడపడుచు మమ్మల్ని మీ దగ్గరకు తీసుకొచ్చింది. ఇప్పటి నుండి అయినా ఆయనలో మార్పు వస్తే చాలా సంతోషం’ అంది.
స్వాతి చెప్పింది మొత్తం విన్న తర్వాత కిరణ్‌తో మాట్లాడాం. అతను చెప్పింది ఏమిటంటే ‘స్వాతి అంటే నాకు చాలా ఇష్టం. ఆమె కోసం నేను ఏమైనా చేస్తాను. కాకపోతే నాకు సరిగ్గా మాట్లాడటం రాదు. నాకూ మాట్లాడాలనే ఉంటుంది. కానీ నేనేం మాట్లాడితే ఆమె ఏమనుకుంటుందో అని భయం. నా మాటల్లో చాలా మందికి నెగిటివ్‌ మాత్రమే కనిపిస్తుంది. నేను ఎవరి గురించి అయినా మంచిగా చెప్పినా వాళ్లు మాత్రం నెగిటివ్‌గానే తీసుకుంటారు. స్వాతి కూడా నా గురించి అలాగే అనుకుంటే నా పరిస్థితి ఏమిటి? అందుకే నేను ఆమెతో చాలా తక్కువగా మాట్లాడతాను. అంతకు మించి మరేమీ లేదు. ఆఫీసులో అయినా, ఇంట్లో అయినా నేను చాలా తక్కువగా మాట్లాడతాను. ఎంత వరకు అవసరమో అంత వరకే ఉంటాను.
మా ఫ్రెండ్స్‌ చాలా మంది ‘ఏంటిరా మాట్లాడటానికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయనుకుంటావా ఏంటీ? నువ్వు ఇలాగే ఉంటే రేపు పెండ్లి తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది’ అనేవారు. అప్పుడు వాళ్ల మాటాలను నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. మా అక్కకు నేనంటే చాలా ఇష్టం కాబట్టి నన్ను మీ దగ్గరకు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ‘ఇలా చెయ్యి, అలా చెయ్యి’ అని నాకు ఎవరూ చెప్పలేదు. దాంతో నేను చేసిందే సరైనది అనుకుంటూ వచ్చాను. నా వల్ల స్వాతి చాలా బాధపడుతుంది. కచ్చితంగా నా పద్దతిని మార్చుకుంటాను. నా భార్యకు నచ్చినట్టుగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి’ అన్నాడు.

అతను చెప్పింది విన్న తర్వాత ‘విన్నావు కదా స్వాతి. నువ్వంటే నీ భర్తకు చాలా ఇష్టం. కానీ అతనికి కొన్ని భయాలు ఉన్నాయి. అతను పెరిగిన వాతావరణం అలాంటి. కాబట్టి అతనికి కొంచెం టైం ఇవ్వు. ఇప్పటి నుండి రోజూ ఇద్దరూ కొద్దిసేపు బయటకు వెళ్లి వస్తుండండి. ఓ వారం రోజులు సెలువు పెట్టి ఏదైనా టూర్‌ ప్లాన్‌ చేసుకోండి. అప్పుడు ఇద్దరికీ మాట్లాడుకోవడానికి కొంత సమయం దొరుకుతుంది. మనసు విప్పి మాట్లాడుకోండి. ఒకరి ఇష్టాలు ఒకరు తెలసుకోండి. ప్రతి విషయంలో ఒకరికొకరు సహకరించుకోండి. అప్పుడే మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య పంతాలు, పట్టింపులు ఉంటే కలిసి బతకడం కష్టం. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అర్థం చేసుకొని సర్దుకు పోవాలి. ఏ సమస్య అయినా ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవాలి. అప్పుడు మీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది’ అని చెప్పి పంపించాము.
– వై వరలక్ష్మి, 9948794051

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -