వాతావరణ శాఖ హెచ్చరికలున్నా పట్టింపు లేదా? : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్నా
కొత్తగూడెంలో నిర్వహించనున్న సంఘం రాష్ట్ర మహాసభ విజయవంతానికి పిలుపు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఈ యాసంగిలో ధాన్యం, మక్క పంటల కొనుగోళ్లపై ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికలు లేవని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నా పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో గురువారం విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబుతో కలిసి నున్నా మాట్లాడారు. ఈ నెల 23 నుంచి 25 వరకు తెలంగాణ రాష్ట్ర మహాసభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మహాసభకు ఆలిండియా కిసాన్ సంఫ్‌ు (ఏఐకేఎస్) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ధావలే, విజ్జు కృష్ణన్ హాజరవుతున్నట్టు చెప్పారు. దీనికి ముందు తల్లాడ మండల కేంద్రంలో సంఘం ఖమ్మం జిల్లా మహాసభ 20, 21 తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ యాసంగిలో మొక్కజొ న్నలు, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో 60 లక్షల ఎకరాల్లో వరి, 10.65లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైందని, ఈ ఏడాది 29లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవుతోందన్నారు. లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, మొక్కజొన్నలు దిగుబడి వస్తుంటే ప్రభుత్వం ప్రణాళికాలేమితో వ్యవహరిస్తోందని విమర్శించారు. రోడ్ల మీద, కల్లాల్లో ఎక్కడ పడితే అక్కడ ధాన్యం, మొక్కజొన్నలు ఆరబోసి ఉన్నాయని, అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక నేపథ్యంలో రైతాంగం ఆందోళన చెందుతోందన్నా రు. మొక్కజొన్నలకు క్వింటాకు రూ.2,400 మద్దతు ధర నిర్ణయిస్తే.. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389గా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. అయితే, సరిపడా కొనుగోలు కేంద్రాలు లేక బయటి వ్యాపారులకు విక్రయించి రైతులు క్వింటాకు రూ.600-700 వరకు నష్టపోతున్నారని వివరించారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో మండల, జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. దాంతో తప్పనిసరి స్థితిలో జిల్లాలో కొన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. గతేడాది విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో 31 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఈ ఏడాది 17 కేంద్రాలే ఏర్పాటు చేయటాన్ని బట్టి రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి స్పష్టమవుతోందన్నారు.
కేంద్రం కొర్రీలు
ఎకరానికి 50 క్వింటాళ్లకు పైగా మొక్కజొన్నలు దిగుబడి వస్తుంటే కేంద్ర ప్రభుత్వం 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని కొర్రీలు పెడుతోందని నున్నా అన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, రవాణాసౌకర్యం కల్పించాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా మిల్లర్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయలేక రైతులు అనారోగ్యానికి, గుండెపోటుకు గురవుతున్నార ని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వాసిరెడ్డి వరప్రసాద్, మీరా సాహెబ్, దుగ్గి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కౌలు రైతుల ఇబ్బందులు
కాంటాల దగ్గర కౌలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బొంతు రాంబాబు అన్నారు. పట్టాదారులు వేలిముద్ర వేస్తేనే కాంటాలు పెడుతున్నారని తెలిపారు. పట్టాదారులు సుదూర ప్రాంతాల్లో.. కొందరు విదేశాల్లో సైతం ఉండటంతో, వారితో నిమిత్తం లేకుండా కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు. బయోమెట్రిక్ విధానాన్ని సడలించాలని కోరారు. 17 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే నాలుగు కేంద్రాల్లో నేటికీ కొనుగోళ్లు ప్రారంభం కాలేదని తెలిపారు. 17 శాతం కూడా మొక్కజొన్నలు కొనలేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలని, సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మిల్లర్లను ఒప్పించి కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.



