Friday, April 17, 2026
E-PAPER
Homeక్రైమ్వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి?

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి?

- Advertisement -

బీరంగూడ తిరుమల ఆస్పత్రిలో విషాదం
నవతెలంగాణ-అమీన్‌పూర్‌

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పరిధి బీరంగూడలోని తిరుమల ఆస్పత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని వందనపురి కాలనీకి చెందిన హారిక(28) బుధవారం కడుపు నొప్పితో తిరుమల ఆస్పత్రికి వెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. అత్యవసరంగా శస్త్రచికిత్స (ఆపరేషన్‌) చేయాలని సూచించారు. వైద్యులు రాత్రి 9 గంటల ప్రాంతంలో హారికకు ఆపరేషన్‌ ప్రారంభించారు. అయితే, శస్త్రచికిత్స జరుగుతుండగానే ఆమె పరిస్థితి విషమించి ప్రాణం కోల్పోయినట్టు సమాచారం. ఆరోగ్యంగా ఉన్న మహిళ ఆపరేషన్‌ థియేటర్‌లోకి వెళ్లిన కొద్దిసేపటికే మరణించడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే హారిక మృతిచెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట బైటాయించారు. ఆపరేషన్‌లో ఏదో పొరపాటు జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అమీన్‌పూర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆస్పత్రి వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -